రోగ్యం విషయంలో చాలామంది పురుషులు చాలా అశ్రద్ధగా ఉంటారట. ముఖ్యంగా లైంగిక సంబంధిత సమస్యలను పెద్దగా పట్టించుకోరట. ఈ నిర్లక్ష్యం ప్రాణాంతక వ్యాధులకు దారితీచ్చని ఆఫీస్ ఫర్ నేషనల్ స్టాటిస్టిక్స్ (ONS) హెచ్చరిస్తోంది. తాజా డేటా ప్రకారం.. స్త్రీలు, పురుషుల కంటే ఎక్కువ కాలం జీవించగలరని అంచనా వేశారు. పురుషులు సగటున 79.4 సంవత్సరాలు జీవిస్తే, స్త్రీలు 83.1 సంవత్సరాల వరకు జీవించగలరని గణంకాలు చెబుతున్నాయి.  హార్వర్డ్ విశ్వవిద్యాలయం అధ్యయనం కూడా పురుషులు తమ నిర్లక్ష్యంతోనే రోగాలను కొనితెచ్చుకుంటున్నారని స్పష్టం చేయడం గమనార్హం. 


లాయిడ్స్ ఫార్మసీకి చెందిన ఆన్‌లైన్ డాక్టర్ టైమ్ టు రైజ్ ఇట్(TTRI) తాజా డేటా ప్రకారం.. పురుషుల్లోని అంగస్తంభన సమస్యలను బయటకు ప్రస్తావించేవారి సంఖ్య చాలా తక్కువట. మూడోవంతు మహిళలు తమ బాగస్వామిలోని అంగ సమస్యలను వారితో చెప్పేందుకు ఇబ్బంది పడుతున్నారని తేలింది. అలాగే, పురుషులు కూడా తమ అంగంలో ఏర్పడే మార్పులు, ఇతరాత్ర లక్షణాలను పెద్దగా పట్టించుకోవడం లేదట. ఈ నేపథ్యంలో పురుషులు అంగంలో కలుగుతున్న మార్పుల గురించి తప్పకుండా తెలుసుకోవాలి. ఈ కింద సమస్యలో ఏ ఒక్కటి కనిపించిన వైద్యుడిని సంప్రదించి చికిత్స తీసుకోవాలి. 


అసాధారణ గడ్డలు: పురుషాంగంపై అసాధారణ గడ్డలు కనిపించినప్పుడు.. అశ్రద్ధ అసలు పనికిరాదు. సాధారణంగా చాలా రకాల క్యాన్సర్లు వయస్సు పెరిగిన తర్వాత ఏర్పడతాయి. అయితే, వృషణ క్యాన్సర్లు.. 15 నుంచి 49 సంవత్సరాల వయస్సు గల యువకులలోనూ ఏర్పడుతోంది. వృషణాలలో కొత్తగా గడ్డలు ఏర్పడినట్లు అనిపించినా, వృషణం సైజు పెరిగినట్లు కనిపించినా అప్రమత్తం కావాలి. ఇలాంటి గడ్డలు నొప్పి కూడా రావు. కాబట్టి.. చాలామంది నిర్లక్ష్యం వహిస్తారు. కాబట్టి.. ఎప్పటికప్పుడు మీ వృషణాలను పరీక్షించుకోవడం కూడా తప్పనిసరి. ఎందుకంటే ఆ గడ్డలు క్యాన్సర్ కణాలు కావచ్చు. వాటిని త్వరగా కనిపెడితే చికిత్స సైతం సాధ్యమే.  


వృషణాల వాపు: వృషణాలు కలిగిన సంచి విస్తరిస్తున్నా, పెద్ది అవుతున్నా తప్పకుండా అప్రమత్తం కావాలి. అది ఇంగువినల్ హెర్నియాకు సంకేతం కావచ్చు. ఈ వాపు చాలా బాధకరంగా ఉంటుంది. ఇంగ్జినల్ హెర్నియాలు కొన్నిసార్లు పొత్తికడుపుపై ఒత్తిడి ఏర్పడటం వల్ల కూడా అకస్మాత్తుగా ఏర్పడుతుంటాయి. ఉదాహరణకు.. మలబద్దం సమస్య ఉండేవారు.. బలవంతంగా విసర్జించేందుకు ప్రయత్నిస్తారు. దాని వల్ల వృషణాలపై కూడా ఒత్తిడి పడుతుంది. ఈ సమస్య తీవ్రమైన దగ్గుకు కూడా దారితీస్తుంది.


పురుషాంగంపై దద్దుర్లు: పురుషాంగం కొన(చివర్లు)పై దద్దుర్లు బాలనిటిస్‌కు సంకేతం. పురుషాంగం ముందు చర్మం శుభ్రంగా లేనప్పుడు బాలనిటిస్ ఏర్పడే అవకాశాలున్నాయి. ఫలితంగా అంగంలో ఏర్పడే సహజ లూబ్రికెంట్లు అక్కడే పేరుకుపోతాయి. చివరికి అది స్మెగ్మాకు కారణమవుతుంది. ఇది బ్యాక్టీరియాకు సంతానోత్పత్తి ప్రదేశం. ఈ సమస్య ఏర్పడినప్పుడు పురషాంగం శిఖరాగ్రంలో వాపు, దద్దుర్లు, లేదా పుండ్లు  ఏర్పడతాయి. ఫిమోసిస్ (ముందు చర్మం వెనుకకు లాగడానికి ప్రయత్నించినప్పుడు కలిగే గాయాలు), థ్రష్ (ఈస్ట్ ఇన్ఫెక్షన్), క్లామిడియా మరియు గోనేరియా వంటి లైంగిక సంక్రమిత వ్యాధులు (STI), మూత్రంలో అధిక చక్కెర(మధుమేహుల్లో ఎక్కువ) పేరుకుపోవడం వంటివి కారణాలు.


ఆకస్మిక నొప్పి: ఒక్కోసారి అకస్మాత్తుగా వృషణాలు నొప్పి పెడతాయి. వాటిని ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయకూడదని యూకేకు చెందిన యూరాలజీ కేర్ ఫౌండేషన్ నిపుణులు తెలిపారు. నొప్పి సాధారణంగా గజ్జల ప్రాంతంలో ఏర్పడుతుంది. ఎవరో అక్కడ బలంగా కొట్టిన భావన కలుగుతుంది. నడవడం కూడా చాలా కష్టం. వృషణాలను శరీరానికి కలిపే నాళం మెలితిరిగినప్పుడు వృషణానికి రక్త ప్రవాహం నిలిచిపోయి ఈ నొప్పి ఏర్పడుతుంది. ఈ సమస్య ఏర్పడినప్పుడు వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. లేకపోతే వృషణాలు దెబ్బతింటాయి.


అంగస్తంభన సమస్యలు: పురుషుల్లో అంగస్తంభన సమస్యలు సాధారణమే. దాదాపు 27 శాతం మంది పురుషుల్లో ఈ సమస్య ఉంది. అయితే, వీటిని గోప్యంగా ఉంచడం కంటే వైద్యులను సంప్రదించడం ద్వారా పరిష్కారం పొందవచ్చు. లేకపోతే ఇది మానసిక సమస్యలకు దారి తీయొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పరిస్థితులు, జీవనశైలి, అలవాట్లు వల్ల కొందరిలో అంగస్తంభన సమస్యలు ఏర్పడతాయి. వాటికి చికిత్స అందుబాటులో ఉంది. వాటి గురించి బయటకు మాట్లాడకుండా మనసులో కుమిలిపోవడం వల్ల ప్రయోజనం ఉండదు. 


అంగంపై మొటిమలు: అంగంపై కొందరికి బొడిపెలు ఏర్పడతాయి. వాటినే జననేంద్రియ మొటిమలని కూడా అంటారు. అవి మంట లేదా దురద కలిగిస్తాయి.  కొన్ని సందర్భాల్లో రక్తస్రావం కూడా కావచ్చు. ఇవి చర్మంలోని ఇతర ప్రాంతాలకు కూడా వ్యాప్తి చెందగలవు. అయితే, అవి అంగం మీద అందహీనంగా కనిపిస్తాయి. వీటి వల్ల పెద్ద ప్రమాదం లేదు. క్రీములు, లోషన్స్ ద్వారా వాటిని తగ్గించుకోవచ్చు. వైద్యులను సంప్రదించి చికిత్స పొందవచ్చు. 


Also Read: నగ్నంగా నిద్రపోతే ఇన్ని ప్రయోజనాలా? పరిశోధకులు ఏమంటున్నారు?


మూత్ర విసర్జనలో సమస్య: మూత్ర విసర్జన చేయడంలో ఇబ్బంది లేదా నొప్పి రావడం అనేది ప్రోస్టేట్ వ్యాధి లేదా క్యాన్సర్‌కు సంకేతమని, దీనిని విస్మరించరాదని వైద్యులు చెబుతున్నారు. ప్రోస్టేట్ గ్రంథి విస్తరించడం వల్ల మూత్రాశయం నుంచి మూత్రాన్ని తీసుకువెళ్ళే నాళంపై ఒత్తిడి పడుతుంది.  ఇది మూత్రవిసర్జనను కష్టతరం చేస్తుంది. ఈ లక్షణాలు కనిపించినప్పుడు వైద్యులను సంప్రదించడమే ఉత్తమం. 


Also Read: సైలెంట్‌గా ఉండేవారు అంత డేంజరా? ఈ కారణాలు తెలిస్తే తప్పకుండా ఆశ్చర్యపోతారు!


గమనిక: వివిధ అధ్యయనాలు, వైద్య నిపుణులు, కథనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. పైవాటిలో ఏ చిన్న సమస్య కనిపించినా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. ఈ కథనంలో పేర్కొన్న అంశాలతో ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ బాధ్యులు కాదని గమనించగలరు.