అన్ని దానాలు కన్నా అన్నదానం గొప్పదని పెద్దలు చెబుతుంటారు. అన్నదానం కన్నా అవయవదానం చాలా గొప్పదని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఎందుకంటే తాను చనిపోతూ మరికొంతమందికి ప్రాణదానం చేయటం చాలా గొప్ప విషయమే కదా. మనిషి చనిపోతే శరీరంతోపాటు అవయవాలన్నీ శిథిలమైపోతాయి. ఇప్పుడు అవయవదానంపై అవగాహన పెరిగి చాలా మంది అవయవదానం చేసేందుకు ముందుకు వస్తున్నారు. 



బతికున్న కాలం ప్రజాసమస్యలపై పోరాడిన వ్యక్తి అతను. ఓ రాజకీయ పార్టీలో కీలక పదవిలో ఉన్న ఆ యువనేత ప్రజల కోసం నిరంతరం పోరాడాడు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మరణించినా మరో ఐదుగురి అవయవదానం చేసి వారి ప్రాణాలు నిలిపారు. బతికున్నప్పుడు ఎన్నో సార్లు రక్తదానం చేసిన ఆయన చనిపోయాక కూడా తన అవయవాలను దానం చేయడాన్ని స్థానికలు అభినందిస్తున్నారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గంగసాని శ్రీనివాస్ రెడ్డి ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఆయన మలక్ పేట యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మరణించారు. బతికి ఉన్నప్పుడు పలుమార్లు రక్తదానంతో చేసిన శ్రీనివాస్ రెడ్డి మరణించాక కూడా ఆయన అవయవాలు దానం చేయాలని కుటుంబసభ్యులను కోరారు. దీంతో అవయవదానం కోసం ఆయన తమ్ముడు శ్రీకాంత్ రెడ్డి జీవన్ జ్యోతి ట్రస్ట్ కి వివరాలు అందించారు. ఐదుగురికి ఆయన అవయవాలను దానం చేశారు. శ్రీనివాస్ రెడ్డి మృతదేహం తరలిస్తుండగా యశోదా సిబ్బంది సెల్యూట్ తో నివాళులు అర్పించారు. 


మానవ శరీరంలో ఏఏ అవయవాలు దానం చేయవచ్చంటే...


చనిపోయిన వ్యక్తి అవయవాలను దానం చేయడం ద్వారా మరొకరి జీవితం రూపంలో జీవించే ఉంటారు. మనిషి చనిపోయిన తరువాత శరీరంలోని కొన్ని అవయవాలను దానం చేయవచ్చు. ఇందుకు ఓ  చట్టబద్ధమైన ప్రక్రియ ఉంది. అధికారిక గణాంకాల ప్రకారం భారతదేశంలో ప్రతి ఏడాది దాదాపు 5 లక్షల మంది అవయవదానం లేకపోవడం వల్ల మరణిస్తున్నారు. భారత్ లో ప్రతి 10 లక్షల మందికి 0.26 శాతం మంది మాత్రమే అవయవదానం చేస్తున్నారు. అవయవదానం ప్రధానంగా రెండు రకాలు మరణం తర్వాత చేసే అవయవ దానం ఒకటి, సజీవ అవయవదానం రెండు. ఒక వ్యక్తి అవసరమైన వారికి సాయం చేసేందుకు కిడ్నీలు, క్లోమం కొంత భాగాన్ని దానం చేయవచ్చు. మరణం తర్వాత అవయవ దానంలో మరణించిన వ్యక్తి శరీరంలో సక్రమంగా పని చేసే అవయవాలను దానం చేయవచ్చు. మరణం అనంతరం 8 రకాల అవయవాలను దానం చేయవచ్చు. మరణించిన వ్యక్తి మూత్రపిండాలు, కాలేయం, ఊపిరితిత్తులు, గుండె, క్లోమం, ప్రేగులు ఇతరులకు దానం చేయవచ్చు.