Men and Sleep Apnoea : రాత్రిపూట నిద్రలో గురక పెట్టడం చాలామందికి అలవాటు. కొందరు దాన్ని సాధారణ సమస్యగా భావించి పట్టించుకోరు. కానీ గురకతో పాటు మధ్యమధ్యలో శ్వాస ఆగిపోవడం, ఉక్కిరిబిక్కిరిగా అనిపించడం, పగటిపూట విపరీతంగా నిద్ర రావడం వంటి లక్షణాలు ఉంటే అది అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా కావచ్చని నిపుణులు చెప్తున్నారు. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే గుండె ఆరోగ్యంపైనా ప్రభావం పడే ప్రమాదం ఉంది. మరి సాధారణ గురకకు, స్లీప్ అప్నియాకు మధ్య తేడా ఏంటి? ఎలాంటి లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించాలి?

Continues below advertisement

గురకకు, స్లీప్ అప్నియాకు తేడా ఏంటి?

నిద్రపోయినప్పుడు గొంతు కండరాలు విశ్రాంతి తీసుకుంటాయి. ఆ సమయంలో గాలి వెళ్లే మార్గంలోని కణజాలం కంపించడం వల్ల గురక శబ్దం వస్తుంది. సాధారణ గురకలో శ్వాస కొనసాగుతూనే ఉంటుంది. కానీ అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియాలో నిద్రలో గొంతు వెనుక భాగంలోని శ్వాసమార్గం పదేపదే ఇరుకుగా మారడం లేదా పూర్తిగా మూసుకుపోవడం జరుగుతుంది. దీంతో కొన్ని క్షణాల పాటు శ్వాస ఆగిపోతుంది. తిరిగి శ్వాస తీసుకునేందుకు మెదడు శరీరాన్ని కొద్దిసేపు మేల్కొలుపుతుంది. ఇలా రాత్రంతా పలుమార్లు జరగవచ్చు.

Also Read : రోజూ తెల్లవారుజామున 3-4 గంటలకే మెలకువ వస్తోందా? కారణాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి

Continues below advertisement

ఈ విషయంపై హైదరాబాద్లోని యశోద ఆస్పత్రిలో కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్​గా చేస్తోన్న డాక్టర్ కె యుగవీర్ గౌడ్ పలు విషయాలు తెలిపారు. యుగవీర్ ప్రకారం.. సాధారణ గురకలో గాలి శ్వాసమార్గం గుండా వెళ్తున్నప్పుడు గొంతులోని కండరాలు, కణజాలం కంపించడం వల్ల శబ్దం వస్తుంది. కానీ అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియాలో శ్వాసమార్గం పదేపదే మూసుకుపోవడం వల్ల కొన్ని క్షణాల పాటు శ్వాస ఆగిపోతుంది. శరీరం తిరిగి శ్వాస తీసుకునేలా మెదడు నిద్రకు అంతరాయం కలిగిస్తుంది.

పురుషుల్లో ఈ సమస్యకు కారణాలు ఏంటి?

మహిళలతో పోలిస్తే పురుషుల్లో స్లీప్ అప్నియా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని డాక్టర్ యుగవీర్ తెలిపారు. ముఖ్యంగా 40 ఏళ్లు దాటిన తర్వాత ఈ ప్రమాదం పెరగవచ్చని.. ఆ సమయంలో మెడ చుట్టుకొలత ఎక్కువ కావడం, పొట్ట చుట్టూ అధిక కొవ్వు పేరుకుపోవడం, అధిక బరువు, సాయంత్రం లేదా రాత్రి మద్యం సేవించడం, ధూమపానం వంటి అలవాట్లు ప్రమాదాన్ని పెంచుతాయని అన్నారు. కుటుంబంలో ఎవరికైనా ఈ సమస్య ఉంటే వారసత్వంగా కూడా వచ్చే అవకాశం ఉందట. 

 Also Read : నిద్ర, డిప్రెషన్ మందులు ఎవరికి ఎక్కువ ప్రమాదం? కిందపడే రిస్క్‌పై తాజా అధ్యయనంలో షాకింగ్ విషయాలు

ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త

స్లీప్ అప్నియా ఉన్నవారిలో గురక చాలా బిగ్గరగా వస్తుంది. మధ్యమధ్యలో శ్వాస ఆగినట్లు అనిపించడం, మళ్లీ ఒక్కసారిగా గాలి పీల్చుకుంటూ ఉలిక్కిపడి లేవడం వంటి లక్షణాలు ఉంటాయి. ఉదయం నిద్రలేచినప్పుడు నోరు పొడిబారడం, తలనొప్పి, గొంతు నొప్పి రావచ్చు. రాత్రంతా నిద్రపోయినా పగటిపూట అలసటగా అనిపించడం, పని సమయంలో నిద్ర ముంచుకురావడం, ఏకాగ్రత తగ్గడం, చిరాకు, మూడ్ మార్పులు కూడా కనిపించవచ్చు. కొందరిలో రాత్రిపూట తరచూ మూత్ర విసర్జనకు వెళ్లాల్సి రావడం, లైంగిక ఆసక్తి కూడా తగ్గిపోవచ్చు. 

నిర్లక్ష్యం చేస్తే గుండెకు ప్రమాదమా?

నిద్రలో పదేపదే శ్వాస ఆగిపోవడం వల్ల శరీరానికి ఆక్సిజన్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడతాయి. దీనివల్ల రక్తపోటు పెరిగే అవకాశం ఉంటుంది. దీర్ఘకాలంలో గుండె లయలో అసమానతలు, గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి సమస్యల ప్రమాదంతో స్లీప్ అప్నియాకు సంబంధం ఉంది. అంతేకాదు, సరైన నిద్ర లేకపోవడం వల్ల రోజువారీ పనితీరు దెబ్బతినవచ్చు. డ్రైవింగ్ సమయంలో నిద్రమత్తు రావడం ప్రమాదాలకు దారితీయవచ్చు.

Also Read : మంచి నిద్ర కావాలంటే నైట్ రొటీన్ ఇలా సెట్ చేసుకోండి.. వైద్యులు సూచించే సింపుల్ అలవాట్లు ఇవే

గురక తగ్గించే స్ప్రేలు వాడవచ్చా?

గురక తగ్గించేందుకు మార్కెట్లో అనేక స్ప్రేలు, మౌత్ గార్డులు, ఇతర పరికరాలు అందుబాటులో ఉంటాయి. అయితే ఇవి శబ్దాన్ని కొంతవరకు తగ్గించినా.. శ్వాసమార్గం మూసుకుపోవడం అనే అసలు సమస్యను పరిష్కరించకపోవచ్చు. ముఖ్యంగా స్లీప్ అప్నియా ఉన్నవారు గురక తగ్గించే ఉత్పత్తులపై ఆధారపడితే.. సమస్య నిర్ధారణ, చికిత్స ఆలస్యమయ్యే ప్రమాదం ఉంది.

స్లీప్ అప్నియాను ఎలా నిర్ధారిస్తారు?

బిగ్గరగా గురక పెట్టడం, నిద్రలో శ్వాస ఆగిపోవడం, ఉదయం లేచినా అలసటగా ఉండటం వంటి లక్షణాలు ఉంటే వైద్యులను సంప్రదించాలి. అవసరాన్ని బట్టి స్లీప్ స్టడీ (పాలిసోమ్నోగ్రఫీ) లేదా ఇంటి వద్ద చేసే స్లీప్ అప్నియా పరీక్షను సూచించవచ్చు. ఈ పరీక్షలో నిద్ర సమయంలో శ్వాస, రక్తంలోని ఆక్సిజన్ స్థాయిలు, గుండె స్పందన వంటి అంశాలను పరిశీలిస్తారు. పరీక్ష ఫలితాల ఆధారంగా సమస్య తీవ్రతను గుర్తించి చికిత్స చేస్తామని డాక్టర్ యుగవీర్ తెలిపారు.

Also Read : నిద్ర లేవగానే ఫోన్ చూస్తున్నారా? రోజంతా తలనొప్పి, అలసటకు అదే కారణం కావొచ్చు

స్లీప్ అప్నియా చికిత్సలు

స్లీప్ అప్నియాకు చికిత్స అనేది సమస్య తీవ్రత, వ్యక్తి ఆరోగ్య పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. అధిక బరువు ఉన్నవారు బరువు తగ్గడం, నిద్రకు ముందు మద్యం తీసుకోకపోవడం, వీలైనంత వరకు పక్కకు తిరిగి పడుకోవడం వంటి మార్పులతో కొంతమేర ప్రయోజనం పొందవచ్చు. అవసరమైతే వైద్యులు CPAP మెషిన్ సూచిస్తారు. ఇది నిద్రపోయే సమయంలో మాస్క్ ద్వారా స్వల్ప గాలి ఒత్తిడిని అందించి శ్వాసమార్గం మూసుకుపోకుండా ఉంచుతుంది. కొందరికి నోటిలో అమర్చే ప్రత్యేక పరికరాలు లేదా ఇతర చికిత్సలు అవసరమవుతాయి.

అయితే గురక పెట్టే ప్రతి ఒక్కరికీ స్లీప్ అప్నియా ఉందని అనుకోకూడదు. అలాగే గురకను కేవలం అలవాటుగా కొట్టిపారేయడం కూడా సరికాదని అంటున్నారు నిపుణులు. నిద్రలో శ్వాస ఆగిపోవడం, పగటిపూట నిద్రమత్తు, ఉదయం తలనొప్పి వంటి లక్షణాలు ఉంటే వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి.

Also Read : మెగ్నీషియం లోపం వల్ల మైగ్రేన్ పెరుగుతుందా? బీపీ, నిద్ర, గుండె ఆరోగ్యంపై దీని ప్రభావం ఇదే

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.