Mass Hysteria: ఉత్తరాఖండ్ లోని బాగేశ్వర్ జిల్లాలోని రైఖిలి గ్రామంలో ఉంది ఓ ప్రభుత్వ పాఠశాల. హఠాత్తుగా అందులో చదివే కొంతమంది పిల్లలు వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. ముఖ్యంగా ఆడపిల్లలు ఏడుస్తూ, అరుస్తూ, తలలు కొట్టుకుంటూ కనిపించారు. నేలపై దొర్లడం, కేకలు వేయడం ఇవన్నీ చూసి టీచర్లు భయపడిపోయారు. తల్లిదండ్రులను పిలిపించారు. వారు వీళ్ల ప్రవర్తనను చూసి బెంబేలెత్తారు. ఈ ప్రవర్తనను మాస్ హిస్టీరియా అంటారు. ఆ సమస్య ఉన్న వారే ఇలా అరుస్తూ, కేకలు వేస్తూ, దొర్లుతూ గందరగోళం  సృష్టిస్తారు. వైద్యులు వచ్చి పిల్లల్ని చెక్ చేసి వెళ్లారు. వారెందుకు హఠాత్తుగా ఇలా ప్రవర్తించారో మాత్రం తెలియదు. తల్లిదండ్రులు మాత్రం స్కూల్లో దయ్యాలు ఉన్నాయంటూ ప్రచారం మొదలుపెట్టారు. వైద్యులు మాత్రం ఇవన్నీ హిస్టిరియా లక్షణాలని చెప్పారు. 


ఏంటి ఈ మాస్ హిస్టీరియా?
ఎపిడెమిక్ హిస్టీరియా లేదా మాస్ హిస్టీరియా అనేది ఒకేసారి ఒకేచోట నివసించే ఎక్కువ మందిలో కలుగుతుంది. నివాసప్రాంతాల్లో లేదా ఉద్యోగప్రాంతాల్లో ఇలా జరుగుతుంది. పాఠశాలల్లో కూడా ఇలా మాస్ హిస్టీరియా వస్తుంది. ఒక మనిషిలో విపరీతమైన, అసాధారణమైన ప్రవర్తనలు కనిపిస్తే హిస్టీరియా అంటారు. అదే ఒక చోటు నివసిస్తున్న వారిలో ఒకేసారి లక్షణాలు కనిపిస్తే దాన్ని మాస్ హిస్టీరియా అంటారు.దీనికి సరైన కారణాన్ని ఎవరూ చెప్పలేరు. నిర్ధిష్టమైన ఒక కారణమేదో వారిని ప్రేరిపించడం వల్లే ఇలా అందరూ పిచ్చి పట్టినట్టు ప్రవర్తిస్తారని చెబుతారు. సామాజిక ఒత్తిడి, అందరూ ఒకేలా ఆలోచించడం వంటి దృగ్విషయాలు మాస్ హిస్టీరియాకు దోహదం చేస్తాయి. ఒక గ్రూపులో ఉన్న సాధారణ భయం ఒక్కోసారి మాస్ హిస్టీరియాగా మారి ఒకేసారి బయటపడుతుంది. 
  
మాస్ హిస్టీరియా లక్షణాలు..
1. కొంతకాలం పాటూ కళ్లు కనిపించకుండా అవుతుంది. 
2. గట్టిగా అరుస్తూ, తిడుతూ ఉంటారు. 
3. అన్నీ ఊహించుకుని మాట్లాడుతుంటారు. 
4. చాలా విచిత్రంగా ప్రవర్తిస్తారు. 
5. చుట్టుపక్కల ఏంజరుగుతుందో కనీసం గుర్తించలేరు. 


మాస్ హిస్టీరియాలను కన్వర్షన్ డిజార్డర్ అని కూడా అంటారు. కారణం లేకుండా ఒక వ్యక్తి హిస్టీరిక్ ప్రవర్తిస్తున్నాడంటే అతడి నాడీ వ్యవస్థను ప్రభావితం చేసే ఏవైనా మానసిక క్షోభ కారణం కావచ్చని చెబుతారు. 


చికిత్స ఉందా?
మాస్ హిస్టీరియాకు ఎలాంటి చికిత్స లేదు. కొంతసేపు తరువాత అంత సాధారణ స్థితికి వచ్చేస్తుంది. హిస్టీరిక్ గా ప్రవర్తిస్తున్న వ్యక్తులతో ప్రేమగా మాట్లాడి శాంతింపజేయాలి. హిస్టిరిక్ ప్రవర్తన తగ్గాక నీరసంగా ఉంటారు. నిద్రపోయి లేచాక వారు సాధారణంగానే ప్రవర్తిస్తారు. 


Also read: పిల్లలకు కూడా మంకీపాక్స్ సోకే అవకాశం ఉందా?


Also read: పిల్లల్లో పెరుగుతున్న టమోటో ఫీవర్ కేసులు, ఇది టమోటొలు తినడం వల్ల మాత్రం రాదు



















గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.