మొన్నటి వరకు కరోనాతో జాగ్రత్త అంటూ సూచనలు ఇచ్చిన ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పుడు మంకీపాక్స్ గురించి హెచ్చరికలు ఇవ్వసాగింది. ప్రపంచ అత్యవసర ఆరోగ్యస్థితినీ ప్రకటించింది. ఆఫ్రికా దేశాల్లో పుట్టిన మంకీపాక్స్ దాదాపు 75 దేశాలకు పాకింది. ప్రపంచ వ్యాప్తంగా 18000 మందికి సోకింది. ఇది అధికంగా లైంగిక సంపర్కం వల్ల వస్తుందని చెబుతున్నారు ఆరోగ్యనిపుణులు. ఇది అంటువ్యాధి కూడా. ఇప్పుడు ఎక్కువ మందిని వేధిస్తున్న సందేహం... ఈ వ్యాధి పిల్లలకు సోకుతుందా? అని. ఎలా సోకుతుంది? ఎంత వరకు వారికి హానికరం? లాంటి ప్రశ్నలకు ఆరోగ్యనిపుణులు వివరణ ఇచ్చారు. 


ఆరోగ్యనిపుణులు చెప్పిన ప్రకారం కరోనాతో పోలిస్తే మంకీపాక్స్ సోకే రేటు తక్కువ. కరోనా కేవలం గాలి ద్వారా కూడా పక్కవారికి సోకేస్తుంది. అందుకే అతి తక్కువ సమయంలో ఎక్కువ మంది దీని బారిన పడ్డారు.మంకీపాక్స్ సోకే వేగం తక్కువగా ఉంది. ఇది కొన్ని సందర్భాల్లో మాత్రమే సోకుతుంది. ముఖ్యంగా సెక్స్ చేయడం వల్ల  త్వరగా సోకుతుంది. అందుకే  కొన్ని రోజులు సెక్స్ పార్టనర్లను తరచూ మార్చవద్దంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా హెచ్చరించింది. 


పిల్లలకు సోకుతుందా?
మంకీపాక్స్ పిల్లలకు సోకే అవకాశం ఉందని చెబుతున్నారు వైద్యులు. అయితే సోకే శాతం చాలా తక్కువ. సోకితే మాత్రం ప్రాణాంతకంగా మారవచ్చని హెచ్చరిస్తున్నారు. మంకీపాక్స్ సోకిన వ్యక్తితో కలిసి ఒకే ఇంట్లో జీవిస్తున్న పిల్లలకు ఇది సోకే అవకాశం ఉంది. ఆ వ్యక్తి తిన్న ఆహారాన్ని తినడం, అతను వాడిన దుస్తులను ముట్టుకోవడం, రోగి ఆ పిల్లలకు ఆహారం తినిపించడం... ఇలా రోగితో పాటూ పిల్లలు జీవించడం వల్ల వీరికి సోకే అవకాశం ఉంది. కాబట్టి మంకీపాక్స్ సోకిన వారికి పిల్లల్ని చాలా దూరంగా ఉంచాలి. వారికి ఈ వైరస్ ను తట్టుకునే శక్తి చాలా తక్కువ. పిల్లలకు మంకీపాక్స్ సోకితే వారిలో మొదట జ్వరం వస్తుంది. లింఫ్ నోడ్స్ దగ్గర వాపు కనిపిస్తుంది. ఓ రెండు రోజుల తరువాత ముఖం, అరచేతులపై దద్దుర్లు వస్తాయి. 


ఈ వ్యాక్సిన్ వేయించాలి...
అమెరికా వైద్య అసోసియేషన్  ఇలాంటి వైరస్ సోకకుండా ఉండేందుకు ఎనిమిదేళ్ల వయసు కన్నా తక్కువ చిన్న పిల్లలకు టెకోవిరిమాట్ లేదా TPOXX టీకాను సిఫారసు చేసింది. ఈ టీకా మన దేశంలో కూడా అందుబాటులో ఉంది. కానీ పిల్లల్లో ఈ కేసులు మనదేశంలో నమోదవ్వలేదు కాబట్టి ప్రభుత్వం ఎలాంటి ప్రకటనలు చేయలేదు. 


Also read: పిల్లల్లో పెరుగుతున్న టమోటో ఫీవర్ కేసులు, ఇది టమోటొలు తినడం వల్ల మాత్రం రాదు


Also read: తలపై దురద పెడుతోందా? ఈ చిట్కాలు పాటిస్తే చుండ్రు తగ్గి, జుట్టు బాగా పెరుగుతుంది


















గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.