లం అనగానే చీదరించుకుంటాం. కానీ, అది ఇతరుల ప్రాణాలను కాపాడేందుకు కూడా ఉపయోగపడుతుందనే సంగతి మీకు తెలుసా? అయితే, మీరు యూకేకు చెందిన ఓ వ్యక్తి గురించి తప్పకుండా తెలుసుకోవల్సిందే. అతడికి ఇప్పుడు ఆ మలమే ప్రాణం పోస్తుంది. అంతేకాదు.. ప్రపంచంలో అలాంటి చికిత్స పొందుతున్న మొదటి వ్యక్తి కూడా అతడే. 


రికీ అనే వ్యక్తి ప్రైమరీ స్క్లెరోసింగ్ కోలాంగైటిస్ (PSC) అనే వ్యాధితో బాధపడుతున్నాడు. ఇది కాలేయ సమస్య వల్ల పిత్తాశయానికి వచ్చే అరుదైన రోగం. పిత్తాశయంలో వాపు, మచ్చల వల్ల కాలేయం లోపల, వెలుపల ఉండే నాళాల పరిమాణం తగ్గుతుంది. దానివల్ల అక్కడి భాగాలు ఇన్ఫెక్షన్‌కు గురవ్వుతాయి. దాని వల్ల అతడు లివర్ ఫెయిల్యూర్‌తో చనిపోయే ప్రమాదం కూడా ఉంది.


ఇలాంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ క్లోస్ట్రిడియోయిడ్స్ డిఫిసిల్ చికిత్సలకు ఫీకల్ మైక్రోబయోటా ట్రాన్స్‌ప్లాన్టేషన్ (faecal microbiota transplantation - FMT) చికిత్స సహాయపడుతుందని గత పరిశోధనల్లో తేలింది. ఈ నేపథ్యంలో రికీకి వారానికి ఒకసారి ఆరోగ్యకరమైన వ్యక్తి మలాన్ని.. అతడి మలద్వారం నుంచి పేగుల్లోకి ప్రవేశపెడుతున్నారు. 


FMT అంటే?


మైక్రోబయోటా ట్రాన్స్‌ప్లాంటేషన్ (FMT) అంటే.. మల మార్పిడి చికిత్స. అంటే.. ఒక ఆరోగ్యకరమైన వ్యక్తి నుంచి మలాన్ని సేకరించి. దాన్ని రోగి మలద్వారం నుంచి పేగుల్లోకి ప్రవేశపెట్టే ప్రక్రియ. దీన్ని కొలనోస్కోపీ ద్వారా నిర్వహిస్తారు. అయితే, దాత నుంచి సేకరించిన మలాన్ని ముందుగా వివిధ విధానాల్లో శుద్ధి చేస్తారు. ఆ తర్వాతే.. రోగి మలద్వారంలోకి ప్రవేశపెడతారు. పేగుల్లో ఉండే బ్యాక్టీరియాను, మైక్రోబయోటాలను తిరిగి సమతుల్యం చేయడానికి ఈ విధానం తోడ్పడుతుంది. ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థలో వేలాది బ్యాక్టీరియాలు ఉంటాయి. అయితే, అవి జీర్ణక్రియకు సహాయపడతాయి. వాటి వల్ల పెద్దగా హాని కూడా ఉండదు.


యాంటిబయాటిక్స్ ఎక్కువగా తీసుకుంటే.. పెద్ద పేగుల్లో ఉండే మంచి బ్యాక్టీరియా నాశనం అవుతుంది. దీంతో చెడు బ్యాక్టీరియా జీర్ణ వ్యవస్థను స్వాధీనం చేసుకుని.. దాడి చేస్తుంది. దానివల్ల విరేచనాలు, జ్వరాలు వస్తాయి. వాటిని ఎదుర్కోవడంలో మందులు కూడా విఫలమవుతాయి. అందుకే పరిశోధకులు ముల్లును ముల్లుతోనే తీయాలి అన్నట్లుగా.. ఈ మలమార్పిడి చికిత్సను తెరపైకి తెచ్చారు.


అయితే FMT వల్ల నష్టాలు కూడా ఉన్నాయి


ఈ FMT చికిత్స పొందేవారికి ఎప్పుడూ మేలు జరుగుతుందనే చెప్పలేం. వారిలో కడుపు ఉబ్బరం, మల విసర్జన కష్టం కావచ్చు, వాసనలోనూ మార్పులు వస్తాయి. కొందురు డయేరియాకు గురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అందుకే, డాక్టర్లు.. దాత నుంచి మలాన్ని సేకరించే ముందు చాలా అంశాలను పరిశీలిస్తారు. ముందుగా వారి హెల్త్ హిస్టరీ తెలుసుకుంటారు. ఆ తర్వాత వారి మలంలో కచ్చితంగా మేలు చేసే బ్యాక్టీరియాలు ఉన్నదా లేదా అనేది తెలుసుకుంటారు. ఈ చికిత్స విధానాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మరికొన్ని పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ మేరకు మొదటి ప్రయోగం రిక్ మీదే చేశారు. అతడికి ఎనిమిది వారాలుగా మల మార్పిడి చికిత్స అందిస్తున్నారు. దీంతో అతడు ఆరోగ్యం కూడా కుదటపడుతున్నట్లు తెలిసింది. అయితే, ఈ చికిత్సను ఇంట్లో చేసుకోరాదని, ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు.


PSC వ్యాధి లక్షణాలేమిటీ?


ప్రైమరీ స్క్లెరోసింగ్ కోలాంగైటిస్ వ్యాధికి గురైనవారు తరచుగా అలసటకు గురవ్వుతారు. పని మీద ధ్యాసపెట్టలేరు. మైండ్ బ్లాక్ అయినట్లుగా మబ్బుగా అనిపిస్తుందట. జ్వరం, పాదాలు, అరచేతుల్లో దురదలు, కామెర్లు (కళ్లు, చర్మం పసుపుగా మారడం) వంటి లక్షణాలు కనిపిస్తాయి. బ్లడ్ టెస్ట్ ద్వారానే ఈ వ్యాధిని నిర్ధరించగలరు. 


Also Read : డెంగ్యూ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే.. ప్లేట్‌లెట్ కౌంట్​ని పెంచే ఇంటి చిట్కాలివే