Rs. 15,000 cr rupees for AP Capital Amaravathi Developement | కేంద్ర బ‌డ్జెట్‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధానికి అమ‌రావ‌తికి రూ. 15 వేల కోట్లు కేటాయించ‌డంపై మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ రాజ్య‌స‌భ స‌భ్యుడు జైరాం ర‌మేశ్ వెట‌కారంగా స్పందించారు. మోడీపై సైటైర్లు వేస్తూ ఆయ‌న ఎక్స్‌లో త‌న సందేశాన్ని పోస్ట్ చేశారు. ఏపీకి ప్ర‌త్యేక హోదా లేదా ప్యాకేజీ కోసం డిమాండ్ చేసిన ఎన్‌డీఏలో భాగ‌స్వామిగా ఉన్న చంద్ర‌బాబు, కేంద్రం సానుకూలంగా స్పందించ‌క‌పోవ‌డంతో నాలుగేళ్ల త‌ర్వాత 2018 కూట‌మి నుంచి బ‌య‌ట‌కొచ్చారు. దాదాపు ఆరేళ్ల త‌ర్వాత ఇప్పుడు అదే చంద్ర‌బాబుకు ఎంపీలు మ‌ద్ద‌తుగా ఉన్నార‌న్న ఉద్దేశ్యంతోనే ఈరోజు పీఎం మోడీ అమ‌రావ‌తి నిర్మాణానికి నిధులు కేటాయించార‌ని విమ‌ర్శించారు. ఒకవేళ ఆంధ్ర‌ప్ర‌దేశ్ విభ‌జ‌న చ‌ట్టం -2014 ప్ర‌కారం ఇవ్వాల‌నుకుంటే ప‌దేళ్లు ఎందుకు స‌మ‌యం తీసుకున్నార‌ని బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్ర‌భుత్వాన్ని జైరాం ర‌మేశ్ సూటిగా ప్ర‌శ్నించారు. 


ఏపీకి ఇచ్చేది గ్రాంటా...? అప్పా..? 


ఏపీకి కేంద్ర బ‌డ్జెట్‌లో కేటాయింపుల‌పై భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మవుతున్నాయి. ఏపీ రాజ‌ధాని నిర్మాణానికి నేరుగా సాయం అందిస్తామ‌ని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ చెప్ప‌లేద‌ని ఆర్థిక‌రంగ నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. మ‌ల్టీ లేట‌ర‌ల్ డెవ‌లప్‌మెంట్ ఏజెన్సీ ద్వారా రూ.15 వేల కోట్ల ఆర్థిక మ‌ద్ద‌తు అందిస్తామ‌ని కేంద్ర మంత్రి నిర్మ‌ల చెప్ప‌డంపై అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. ఏషియ‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ బ్యాంక్‌, క్రెడిట్ గ్యారెంటీ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫెసిలిటీ (సీజీఐఎఫ్‌), ఇంట‌ర్నేష‌న‌ల్ ఫైనాన్ష్ కార్పొరేష‌న్, మ‌ల్టీ లేట‌ర‌ల్ ఇన్వెస్ట్‌మెంట్ గ్యారెంటీ ఏజెన్సీ (వ‌రల్డ్ బ్యాంక్ అనుబంధ సంస్థ‌లు) త‌దితర సంస్థ‌ల ద్వారా ఏపీకి అప్పులు ఇప్పించే ఏర్పాట్లు కేంద్ర ప్ర‌భుత్వం చేయ‌నున్న‌ట్టు తెలుస్తోంది. కాబ‌ట్టి ఇదంతా సాయం కాద‌ని, అప్పుగా ఇస్తున్నట్టేన‌ని తెలుస్తోంది. ఏపీకి జీవ‌నాడి అయిన పోల‌వ‌రం నిర్మాణానికి కూడా అండ‌గా నిలుస్తామ‌ని నిర్మ‌లా సీతారామ‌న్ ప్ర‌క‌టించారు. హామీ అయితే ఇచ్చారు త‌ప్ప ఇన్ని నిధులు కేటాయిస్తున్న‌ట్టు స్ప‌ష్టంగా చెప్ప‌క‌పోవ‌డం కూడా ప‌లు అనుమానాల‌కు తావిస్తోంది. 


ఏపీ అసెంబ్లీలో సంబ‌రాలు, ప్ర‌ధానికి ధ‌న్య‌వాదాలు
కేంద్రం నుంచి వ‌చ్చే నిధుల‌కు సంబంధించి ప్ర‌జ‌ల‌కు స్ప‌ష్టత ఇవ్వ‌కుండానే ఏపీ అసెంబ్లీలో కూట‌మి స‌భ్యులు ఆనందంతో సంబ‌రాలు చేసుకుంటున్నారు. మోడీ అందించిన సాయం ప‌ట్ల సీఎం చంద్ర‌బాబు, ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాన్ ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్నారు. 


సోష‌ల్ మీడియాలో కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాల‌పై మీమ్స్‌..
కేంద్రం ఇచ్చేది సాయం కాదు, అప్పుగా తెస్తున్నార‌ని ఇప్ప‌టికే సోష‌ల్ మీడియా హోరెత్తిపోయింది. అప్పులు ఇప్పించినందుకా బీజేపీకి ఇన్ని ఎలివేష‌న్లు ఇస్తున్నారంటూ నెటిజ‌న్లు రెచ్చిపోతున్నారు. కొంద‌రైతే ఏపీకి వేర్వేరు బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పిస్తామ‌ని చెప్పారు, కానీ బీహార్‌కు మాత్రం నేరుగా ట్రాన్స్‌పోర్టు మంత్రిత్వ శాఖ ద్వారా నేరుగా నిధులిస్తామ‌ని చెప్పార‌ని ఆర్థిక మంత్రి నిర్మ‌ల స్పీచ్‌ను గుర్తు చేస్తూ బీహార్‌కు జ‌రిగిన న్యాయం కూడా మ‌న‌కు జ‌ర‌గ‌లేద‌ని వివ‌రిస్తున్నారు. మ‌రికొంద‌రేమో అధికారంలోకి రావ‌డానికి కార‌ణ‌మైన బీహార్‌, ఏపీ రాష్ట్రాల‌కు మాత్ర‌మే సాయం చేస్తే దేశంలోని మిగ‌తా రాష్ట్రాల ప‌రిస్థితి ఏమిట‌ని, మేమంతా దేశంలో ఉన్నామా లేదా అని తెలంగాణ వాసులు ప్ర‌శ్నిస్తున్నారు. 


గ్రాంటా, అప్పా తేల్చాల‌ని వైసీపీ డిమాండ్ 
అమ‌రావ‌తి పేరుతో రాష్ట్రానికి ఇస్తున్న రూ. 15 వేల కోట్లు సాయం చేస్తున్నారా, అప్పుల‌ రూపంలో బ్యాంకుల నుంచి ఇస్తున్నారా స్ప‌ష్స‌ట‌త ఇవ్వాల‌ని వైసీపీ ఎంపీ మ‌ద్దిల గురుమూర్తి డిమాండ్ చేశారు. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ అప్పుల భారాన్ని రాష్ట్ర ప్ర‌జ‌ల‌పై మోప‌వ‌ద్ద‌ని కేంద్రాన్ని విజ్ఞ‌ప్తి చేస్తున్నారు. పోల‌వ‌రం నిధుల‌ విష‌యంలోనూ కేంద్రం నుంచి స్ప‌ష్ట‌మైన హామీ రాలేద‌ని, అలాగే వెనుక‌బ‌డిన జిల్లాల‌కు ఎంత మేర‌కు సాయం చేస్తార‌నే విష‌య‌మై స్ప‌ష్ట‌త లేద‌న్నారు. ఏపీతో పోలిస్తే బీహార్ రాష్ట్రానికి అత్య‌ధిక ప్రాజెక్టులు ఇచ్చారన్నారు. ఏపీకి అన్యాయం జ‌రిగింద‌ని తేలితే వైసీపీ స‌మ‌ష్టి పోరాటానికి దిగుతుందని తిరుప‌తి ఎంపీ హెచ్చ‌రించారు.