మొన్నటి వరకు కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలని వణికించింది. ఇప్పుడు భారత్ లో వ్యాపిస్తున్న మరో వైరస్ అందరినీ కలవరపెడుతోంది. అయితే ఇది పశువుల్లో వస్తుంది. అదే లంపి స్కిన్ డిసీజ్. ఇదొక అంటు వ్యాధి. తొలిసారిగా జులైలో ఈ వైరస్ వెలుగు చూసింది. దీని వల్ల పశువులు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. చర్మంపై బాగా బొబ్బలు వచ్చి అవి ఉబ్బినట్టుగా కనిపించడం ఈ వ్యాధి లక్షణం. ఇది జంతువు శరీరం మొత్తం వ్యాపిస్తుంది. భారత్ లోని పంజాబ్, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్ వంటి ఎనిమిది కంటే ఎక్కువ రాష్ట్రాల్లో ఈ వ్యాధి కారణంగా దాదాపు 64 వేలకి పైగా పశువులు మృత్యువాత పడ్డాయి.


పశువుల చర్మంపై కనిపించే ఈ బొబ్బలు చూసేందుకు కూడా చాలా భయంకరంగా ఉన్నాయి. వాటి వల్ల పశువులు చనిపోతున్నాయి. ఇది అంటు వ్యాధి కావడం వల్ల దీని వ్యాప్తి వేగంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే దీన్ని నివారించడానికి వ్యాక్సిన్స్ సరఫరా చేస్తుంది. దాదాపు కోటికి పైగా డోసుల్ని అన్నీ రాష్ట్రాలకి సరఫరా చేసింది. ఈ వ్యాధి కారణంగా పశువులు నష్టమే కాకుండా పాల ఉత్పత్తి తగ్గుతుంది, వాటిలో ఎదుగుదల లోపాలు, గర్భస్రావం, వంధ్యత్వం వంటి సమస్యలు కూడా ఎదురవుతున్నాయి. ఇప్పటి వరకు మనవులకి ఈ వ్యాధి సోకిన దాఖలాలు లేవు. 


మనుషులకు సోకుతోందా?


అయితే ఈ వ్యాధి మానవుల మీద కూడా ప్రభావం చూపుతుందనే వార్త చాలా మందిని భయాందోళనలకి గురి చేస్తుంది. అయితే దీని వల్ల మనుషులకి ఎటువంటి ప్రమాదం ఉండదని వైద్యులు వెల్లడించారు. ఇది మనుషులకి వ్యాపించే అవకాశం లేదని స్పష్టం చేశారు. వ్యాధి సోకిన జంతువులని ముట్టుకున్నా కూడా వ్యాప్తి ఉండదని తెలిపారు. ఈ వ్యాధి జూనోటిక్ కాదని అన్నారు. గొడ్డు మాంసం, పశువుల పాల ఉత్పత్తులను తీసుకోవడం వల్ల ఎటువంటి ప్రమాదం లేదని వైద్యులు పేర్కొన్నారు.


ఈ వ్యాధి లక్షణాల ఏంటి?


⦿ శరీరంపై బొబ్బలు


⦿ బరువు తగ్గడం


⦿ అధిక లాలాజలం 


⦿ కళ్ళు, ముక్కు వంటి శరీర భాగాల నుంచి నీరు లాంటి ద్రవం కారడం


⦿ జ్వరం


⦿ ఆహారం తినడంలో ఇబ్బంది


నివారణ ఎలా?


పశువులని ఈ వ్యాధి బారిన పడకుండా రక్షించేందుకు భారత ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపట్టింది. వ్యాధి వ్యాప్తి చెందకుండా నివారణ చర్యలు తీసుకుంటోంది. వ్యాధి గురించి పౌరులకి అవగాహన అధికారులకి ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు సూచించారు. పొరుగు రాష్ట్రాల్లోని జంతువులకి ఈ వ్యాధి వ్యాప్తి చెందకుండా ఆయా రాష్ట్రాలు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. ఈ లుంపి చర్మ వ్యాధిని నియంత్రించేందుకు కేంద్రం రాష్ట్రాలకి 'గోట్ పాక్స్' అనే వ్యాక్సిన్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రభుత్వ నివేదిక ప్రకారం ఇప్పటి వరకి ప్రభావిత రాష్ట్రాల్లో 1.50 కోట్ల డోసులు ఇవ్వడం జరిగింది. అవి పశువుల మీద ప్రభావవంతంగా పని చేస్తున్నాయని అధికారులు వెల్లడించారు.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు. 


Also Read: అండాశయ క్యాన్సర్‌ని నిరోధించడానికి ఐదు సూత్రాలు


Also Read: కంటి కింద నల్లటి వలయాల సమస్యా? ఈ టిప్స్ పాటించండి