KRMB Office In Vizag : కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు ( KRMB )ను విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించడం వివాదాస్పదమవుతోంది. ఇందు కోసం ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజీలో సౌకర్యాలు ఉన్నాయని కేంద్రానికి ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది. ఈ అంశంపై కేంద్రం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అయితే కృష్ణాబేసిన్‌లో లేని విశాఖలో కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డును పెట్టాలని ఏపీ సర్కార్ నిర్ణయించడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. విశాఖలో ఏర్పాటుకు తాము అంగీకరించబోమని తెలంగాణ కృష్ణా బోర్డుకు గతంలోనే తెలిపింది. బేసిన్ ప్రాంతంలోనే బోర్డును ఏర్పాటు చేయడం అవసరమని తెలంగాణ వాదన.
ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో కృష్ణా, గోదావరి బోర్డులను ఏర్పాటు చేశారు. వాటి కార్యాలయాలను చెరో రాష్ట్రానికి కేటాయించారు. కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు ఏపీకి.. గోదావరి రివర్ బోర్డ్ తెలంగాణకు కేటాయించారు. ఉమ్మడి రాజధాని కాబట్టి కృష్ణా బోర్డు కూడా మొదట్లో హైదరాబాద్‌లోనే ఏర్పాటయింది. అమరావతిలో రాజధానిని ఖరారు చేసిన తర్వాత కృష్ణా బోర్డును విజయవాడకు తరలించాలని అప్పటి ప్రభుత్వం కేంద్ర జలవనరుల శాఖకు లేఖలు రాసింది. ఆ ప్రకారం.. కేంద్రం కూడా కొన్ని చర్యలు తీసుకుంది. విజయవాడలో కృష్ణా బోర్డు కార్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి 2018లోనే ఆమోదం తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం మారిన తర్వాత .. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా మొదట్లో విజయవాడలోనే కృష్ణాబోర్డు కార్యాలయాన్ని పెట్టాలని కేంద్ర జలశక్తి శాఖకు లేఖలను పంపారు. కానీ తర్వాత మూడు రాజధానుల నిర్ణయం తీసుకోవడంతో కాబోయే కార్యనిర్వాహక రాజధాని విశాఖపట్నానికి తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. అయితే ఏపీ ప్రభుత్వం అడిగిందని కృష్ణాబోర్డు కూడా అంగీకారం తెలిపింది. కేఆర్‌ఎంబీ కార్యాలయాన్ని విశాఖకు తరలిస్తే అన్ని సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఆ సౌకర్యాలపై కేఆర్ఎంబీ ఇంత వరకూ సంతృప్తి వ్యక్తం చేయలేదు.
ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం విశాఖకు కృష్ణాబోర్డు కార్యాలయం తరలింపుపై అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. కృష్ణా బేసిన దాటి మూడు వందల కిలోమీటర్ల అవతల కృష్ణాబోర్డు ఏర్పాటు చేయడం ఏమిటన్నది అటు తెలగాణతో పాటు ఇటు రాయలసీమ మేధావులు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. విజయవాడలో కాకపోతే కర్నూలు, శ్రీశైలంలో పెట్టాలన్న వాదన వినిపిస్తోంది.
ప్రభుత్వ నిర్ణయంపై సాగునీటి రంగ నిపుణులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పుడు కృష్ణాబోర్డు హైదరాబాద్‌లో ఉందని.. బేసిన్‌లో లేకపోయినా ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేయలేదని.. ఏపీ ఎగ్డిక్యూటివ్ క్యాపిటల్‌కే తరలిస్తున్నామని వైఎస్ఆర్‌సీపీ వర్గాలు వాదిస్తున్నాయి.