అండాశయాలు స్త్రీ పునరుత్పత్తి అవయవాల్లో ముఖ్యమైనవి. గర్భాశయానికి రెండు వైపులా రెండు అండాశయాలు ఉంటాయి. స్త్రీ పునరుత్పత్తి వ్యవస్థలో ఇవి ముఖ్య పాత్ర పోషిస్తాయి. ప్రతి నెల అండోత్సర్గం సమయంలో ఒక గుడ్డు విడుదల అవుతుంది. అండాశయాలు ప్రొజెస్టెరాన్, ఈస్ట్రోజెన్ అనే రెండు ముఖ్యమైన పునరుత్పత్తి హార్మోన్లను కూడా ఇవి విడుదల చేస్తాయి. ఇవి మహిళల్లో శరీర ఆకృతి, జుట్టు పెరుగుదలని నిర్ణయిస్తాయి. ఓవల్ ఆకారపు అవయవాలు ఫెలోపియన్ ట్యూబ్స్ ద్వారా గర్భాశయానికి కనెక్ట్ అయ్యి ఉంటాయి. మహిళల్లో ఎక్కువగా వచ్చే క్యాన్సర్స్ లో రొమ్ము క్యాన్సర్, జననేంద్రియాల క్యాన్సర్ మొదటి రెండు స్థానాల్లో ఉంటే మూడో స్థానంలో అండాశయ క్యాన్సర్ ఉంది. దీన్నే గర్భాశయ క్యాన్సర్ అని కూడా పిలుస్తారు.


క్యాన్సర్ ఉదర కుహరంలో లోతుగా అభివృద్ధి చెందుతుంది. ప్రారంభ దశల్లో దాన్ని గుర్తించడం దాదాపు అసాధ్యం. ఇది పెల్విస్, పొట్టకు చేరే వరకు దీన్ని గుర్తించలేము. చికిత్సను కష్టతరం చేసి ఒక్కోసారి ప్రాణాంతకం కూడా కావచ్చు. అండాశయ క్యాన్సర్‌కు నిర్దిష్ట స్క్రీనింగ్ లేదా టెస్టింగ్ పద్ధతి లేదు. అందుకే అది చివరి దశకి చేరేంత వరకి గుర్తించడం కష్టం అవుతుంది. సాధరణంగా ఈ క్యాన్సర్ పెద్ద వయసు స్త్రీలల్లో ఎక్కువగా కనిపిస్తుంది. దీన్ని రాకుండా చేయాలంటే జీవనశైలిలో మార్పులు చేసుకోవడమేనని వైద్యులు సూచిస్తున్నారు.


అండాశయ క్యాన్సర్‌ రాకుండా ఎలా అడ్డుకోవాలి? 


పోషకాహారం: అండాశయ ఆరోగ్యాన్ని బలోపేతం చేయడానికి ఆరోగ్యకరమైన, సమతుల్య పోషకమైన ఆహారం తీసుకోవాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. విటమిన్ ఏ పుష్కలంగా ఉన్న ఆహార పదార్థాలు అండాశయ క్యాన్సర్‌కు రాకుండా అడ్డుకుంటాయి. క్యారెట్లు, పాలు, గుమ్మడికాయ, చిలగడదుంపలు, బచ్చలికూర, గుడ్లు, కాడ్ లివర్ ఆయిల్ వంటి పోషకాలు నిండిన ఆహారం తీసుకోవాలి. ఇవే కాదు సెలీనియం అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల క్యాన్సర్ ప్రమాదాన్ని ఎదుర్కొనడంలో సహాయపడుతుంది. గింజలు, గుడ్లు, షెల్ఫిష్‌ ల్లో సెలీనియం అధికంగా లభిస్తుంది. వీటితో పాటు సిట్రస్ పండ్లు, ఎర్ర మిరియాలు, బ్రకొలీ వంటి విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాలు క్యాన్సర్ తో పోరాడగలిగే రోగనిరోధక కణాలను పెంపొందిస్తాయి. ఇవి క్యాన్సర్ తో పోరాడేందుకు సహజ నిరోధకతగా ఉపయోగపడతాయి.


శారీరక శ్రమ: ఏరోబిక్స్, స్విమ్మింగ్, డ్యాన్స్ లేదా యోగా వంటి సాధారణ శారీరక కార్యకలాపాలు రోగనిరోధక, యాంటీఆక్సిడెంట్ వ్యవస్థలను బలోపేతం చేయడంలో సహాయపడతాయి. అండాశయ క్యాన్సర్ ను నిరోధించడానికి అవసరమైన సామర్థ్యం ఇస్తుంది. వ్యాయామం ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరచి ఊబకాయంతో పోరాడుతుంది. రక్త ప్రసరణను ప్రోత్సహించి రక్తంలో చక్కెర స్థాయిలని తగ్గిస్తుంది.


బ్యూటీ ప్రొడక్ట్స్: టాల్కమ్ పౌడర్, వెజినల్ డౌచెస్, ఇంటిమేట్ హైజీన్ ప్రొడక్ట్స్, లోషన్స్ వంటి ఉత్పత్తులు కార్సినోజెన్స్ ( క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచే పదార్థాలు) ఉన్నాయని కొన్ని అధ్యయనాలు నిరూపించాయి. అందుకే అటువంటి ఉత్పత్తులు ఉపయోగించడం తగ్గించాలి. ఇవి అండాశయ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. శరీర సంరక్షణ ఉత్పత్తులు ఎంచుకునే ముందు తప్పనిసరిగా సేంద్రీయ, విషరహిత ప్రత్యామ్నాయాలను ఎంచుకోవాలి.


జనన నియంత్రణ: గర్భనిరోధకాల్ని 5 లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలు వాడుతున్న మహిళల్లో అండాశయ క్యాన్సర్ ప్రమాదం దాదాపు 50 శాతం తగ్గిందని అధ్యయనాలు వెల్లడించాయి. అయితే గర్భనిరోధకాలు వాడే ముందు తప్పనిసరిగా వైద్యులని సంప్రదించాలి.


ధూమపానం చెయ్యరాదు: ధూమపానం చెయ్యకూడదు. అలాగే పొగ తాగే వారి కంటే వారి పక్కన ఉండి దాన్ని పీల్చిన మహిళల్లో అండాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం మూడు రెట్లు పెరిగినట్టు నిపుణులు గుర్తించారు. అండాశయ క్యాన్సర్‌ను త్వరగా గుర్తించలేరు. అందుకే దాన్ని ది సైలెంట్ కిల్లర్ అని కూడా అంటారు. జీవన శైలిలో మార్పులు వల్ల దీని అడ్డుకోవచ్చు.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు. 


Also Read: కంటి కింద నల్లటి వలయాల సమస్యా? ఈ టిప్స్ పాటించండి


Also Read: నడవలేని స్థితిలో మైక్ టైసన్‌, ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త!