Haryana Crime News:
గడ్డి కోసుకుంటుండగా..
హరియాణాలో దారుణం జరిగింది. నూహ్ ప్రాంతంలో ఓ మహిళను కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు దుండగులు. 36 రోజుల పాటు ఆమెకు నరకం చూపించారు. గడ్డి కోసుకునేందుకు వెళ్లిన సమయంలో 45 ఏళ్ల మహిళను కిడ్నాప్ చేశారు. రాజస్థాన్‌లోని ఓ గ్రామంలో ఆమెను నిర్బంధించారు. చివరకు ఆమెను విడిపించటానికి కుటుంబ సభ్యులు ఆ నిందితులకు రూ.3 లక్షలు చెల్లించాల్సి వచ్చింది. అత్యాచారం చేసి వీడియోలు తీశారు. ఆ వీడియోలు బయట పెట్టకుండా ఉండాలంటే డబ్బులివ్వాలని బాధితురాలి కుటుంబ సభ్యుల్ని
డిమాండ్ చేశారు నిందితులు. చేసేదేమీ లేక ఆ డబ్బు కట్టి మహిళను విడిపించుకున్నారు. ఆ తరవాత పుణ్‌హన పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ FIR ప్రకారం...బాధితురాలు జులై 27 వ తేదీన గడ్డి కోసుకునేందుకు వెళ్లింది. ఇది గమనించిన ముగ్గురు దుండగులు...తుపాకీ చూపించి బెదిరించి కార్ ఎక్కించుకుని ఆ మహిళను తీసుకెళ్లిపోయారు. రాజస్థాన్‌లోని ఓ గ్రామానికి తీసుకెళ్లి ఓ గదిలో నిర్బంధించారు.
మత్తు మందు ఇచ్చి అశ్లీల వీడియోలు తీశారు. పలు సార్లు అత్యాచారం చేసినట్టు ఫిర్యాదు చేసింది బాధితురాలు. సెప్టెంబర్ 1వ తేదీన నిందితులకు రూ.3 లక్షలు ముట్టచెప్పాక విడుదల చేసినట్టు వెల్లడించింది. తన వీడియోలు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయకుండా ఉండేందుకు ఈ డబ్బు డిమాండ్ చేసినట్టు తెలిపింది. నూహ్ ఎస్‌పీ ఈ ఘటనపై మాట్లాడారు. "ఫిర్యాదులోని వివరాల ప్రకారం...FIR బుక్ చేశాం. నిజానిజాలు నిర్ధరించుకున్నాక చట్టప్రకారం శిక్ష విధిస్తాం" అని స్పష్టం చేశారు.
వరుస ఘటనలు..
ఇలాంటి ఘటనలు ఈ మధ్య కాలంలో తరచు జరుగుతున్నాయి. మధ్యప్రదేశ్‌లోనూ గత నెల ఓ అత్యాచార బాధితురాలిపై మరోసారి అత్యాచారం జరగటం సంచలనమైంది. అత్యాచారం కేసులో జైలు శిక్ష అనుభవిస్తోన్న ఓ కీచకుడు బెయిల్‌పై బయటకు వచ్చి బాధిత యువతిపై మరోసారి అత్యాచారం చేశాడు. మధ్యప్రదేశ్ జబల్‌పుర్ జిల్లాలో ఈ ఘోరం జరిగింది. అత్యాచార బాధితురాలిపై మళ్లీ అత్యాచారానికి తెగపడ్డాడు ఓ దుర్మార్గుడు. ఈ సారి స్నేహితుడితో కలిసి గ్యాంగ్ రేప్ చేశాడు. అంతటితో ఆగని దుర్మార్గులు ఆ ఘటనన వీడియో తీసి బాధితురాలిని బెదిరించారు. తనపై పెట్టిన కేసులు వెనక్కి తీసుకోకపోతే సోషల్ మీడియాలో వీడియోను వైరల్ చేస్తానని బెదిరించాడు. దీంతో బాధితురాలు మరోసారి పోలీసులను ఆశ్రయించడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. తమిళనాడు రాష్ట్రంలో మరో ఘటన జరిగింది. మైలాడు తురైలోని మహిళ నివాసం ముందు ఉన్న గేటును పగులగొట్టి 15 మంది యువకులు ఇంట్లోకి దౌర్జన్యంగా ప్రవేశించారు. ఆమె కుటుంబ సభ్యులను కత్తులతో బెదిరించి మహిళను ఎత్తుకెళ్లారు. ఈ మొత్తం ఘటన సీసీ కెమెరాల్లో రికార్డయింది. సమాచారం అందుకున్న మైలాడుతురై పోలీసులు వెంటనే గాలింపు చర్యలు చేపట్టారు. అదే రోజు రాత్రి జాతీయ రహదారిపై కిడ్నాపర్ల కారును అడ్డగించి మహిళను రక్షించారు.
Also Read: Alluri Movie Review: అల్లూరి రివ్యూ: శ్రీవిష్ణు కోరుకున్న హిట్ కొట్టాడా?