Sleepiness Is a Serious Health Red Flag : నిరంతరం అలసట చాలా మందిలో సాధారణమైపోయింది. దీనికి కారణం చాలా కష్టపడిపోవడం అనుకుంటారు. కానీ సరైన కారణం గుర్తించ లేకపోతున్నారు. దీనికి ప్రధాన కారణం నిద్ర లేకపోవడమే అని చెప్తున్నారు నిపుణులు. ఈ నిద్ర సమస్య చాలా సూక్ష్మమైన, సులభమైన సూచనలతో ప్రారంభమవుతుందని.. ఇది శరీరంపై వివిధ రకాలుగా ప్రభావం చూపుతుందని చెప్తున్నారు. నిద్ర లేకపోవడం వల్ల శరీరం ఇచ్చే హెచ్చరిక సంకేతాలు, ఎలా ఈ సమస్యను దూరం చేసుకోవాలో అనే అంశంపై పలు సూచనలు చేశారు P. D. హిందూజా హాస్పిటల్ & మెడికల్ రీసెర్చ్ సెంటర్లో కన్సల్టెంట్ పల్మోనాలజిస్ట్, ఎపిడెమియాలజిస్ట్‌గా చేస్తోన్న డాక్టర్ లాన్సెలట్ పింటో. అవేంటో చూసేద్దాం.
శరీరం ఇచ్చే హెచ్చరిక సంకేతాలు
పగటిపూట నిద్రపోవడం సాధారణం అని చాలామంది నమ్మే అపోహలలో ఒకటి అంటున్నారు డాక్టర్ పింటో. "ఒక వ్యక్తి రాత్రి తగినంత విశ్రాంతి తీసుకుంటే పగటిపూట నిద్రపోవడం చాలా కష్టం." పగలు గంటకు పైగా కునుకు తీస్తే.. అది రాత్రి నిద్ర నాణ్యతపై ప్రభావం చూపిస్తుందని చెప్తున్నారు. ఉదయం ప్రయాణం చేసేప్పుడు అంటే "టాక్సీ, కారు లేదా ప్రజా రవాణాలో ప్రయాణిస్తున్నప్పుడు చాలామంది నిద్రపోతారు" ఇది కూడా రాత్రి నిద్రకు హాని చేస్తుందని చెప్తున్నారు. ఇది కంటిన్యూ అయితే.. "ముఖ్యమైన సమావేశాలు, ప్రెజెంటేషన్లు, డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా వారికి నిద్ర వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు." కాబట్టి ఈ సంకేతాలు ఎప్పుడూ విస్మరించకూడదని హెచ్చరించారు.
వైద్యపరమైన ముప్పుగా మారితే
నిద్ర లేకపోవడం అంటే అలసిపోవడం మాత్రమే కాదు.. ఇది దీర్ఘకాలిక ఆరోగ్యాన్ని కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. డాక్టర్ పింటో ప్రకారం.. "నిద్ర నాణ్యత, పరిమాణం రెండూ అనేక జీవక్రియ, హృదయనాళ వ్యాధులతో ముడిపడి ఉన్నాయి." అధిక రక్తపోటు, ప్రారంభ గుండె జబ్బులు, మధుమేహం, కొలెస్ట్రాల్ సమస్యలు అన్నీ.. సరిపడా నిద్ర లేకపోవడానికి సూచనలు కావచ్చని చెప్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఇది అత్యవసర వైద్యపరమైన సమస్యగా మారుతుందని చెప్తున్నారు.
7–8 గంటలు నిద్రపోయేవారు కూడా అలసిపోయినట్లు అనిపించవచ్చు. అంటే "ఒక వ్యక్తి తగినంత నిద్రపోయినా నిద్రగా అనిపిస్తుందని చెప్తున్నారంటే.. అది నిద్ర నాణ్యత సమస్య కావచ్చు." నిద్రపోయే పరిసరాలు, గురక లేదా స్లీప్ అప్నియా వంటి రుగ్మతలు దీనికి కారణం కావచ్చని చెప్తున్నారు. "పెద్దగా గురక పెట్టడం లేదా నిద్ర మధ్యలో ఊపిరి ఆడనప్పుడు.. అది స్లీప్ అప్నియాకు సంకేతం కావచ్చు." జీవనశైలి ప్రేరేపకాలు కూడా నిద్ర నాణ్యతను మరింత దిగజారుస్తాయి. "కెఫిన్, చాక్లెట్, నిద్రపోయే ముందు ప్రకాశవంతమైన లైట్లలో ఉండడం కూడా నిద్ర నాణ్యతకు ఆటంకం కలిగిస్తాయి." ఆల్కహాల్ కూడా నిద్ర సమస్యకు ప్రధాన కారణమని ఆయన హెచ్చరించారు.
నిద్ర సమస్యను ఎలా దూరం చేసుకోవాలంటే..
నిద్ర సమస్యను రీసెట్ చేయాలనుకుంటే.. డాక్టర్ పింటో కొన్ని సూచనలు ఇస్తున్నారు. "ప్రతిరోజూ ఒకే సమయంలో నిద్రపోవడం, ఒకే సమయంలో మేల్కొనడానికి ప్రయత్నించడం మంచిదని చెప్తున్నారు. ఇది స్లీప్ సైకిల్ని రీసెట్ చేయడానికి హెల్ప్ చేస్తుందని చెప్తున్నారు. పడుకునే ముందు ఎలక్ట్రిక్ పరికరాలను నివారించాలని, కెఫిన్‌ను తగ్గించాలని సూచిస్తున్నారు. రెగ్యులర్‌గా వ్యాయామం చేస్తే మంచిదని అంటున్నారు. అలాగే దీనిని ఉదయం చేస్తేనే మంచిదని.. అప్పుడే నిద్ర నాణ్యత పెరుగుతుందని.. ఈవెనింగ్ చేస్తే నిద్ర నాణ్యతకు ఆటంకం కలిగే అవకాశం ఉందని చెప్తున్నారు.
చల్లని గది ఉష్ణోగ్రత, మసకబారిన లైటింగ్, వదులుగా ఉండే దుస్తులు, నిద్రకు ముందు కొంత వ్యవధితో కూడిన తేలికపాటి భోజనం శారీరక సౌకర్యాన్ని ఇచ్చి మంచి నిద్రను అందిస్తుంది. మీ పార్టనర్ గురక పెడుతున్నారని చెప్తే.. విస్మరించవద్దని సూచించారు. ఎందుకంటే నిద్ర సమస్య శారీరకంగానే కాదు మానసికంగా కూడా ఇబ్బందులు కలిగిస్తుందని చెప్తున్నారు. చిరాకు, ఆందోళన, డిప్రెషన్ పెరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.