Sameer Minhas Records | 2025 అండర్-19 ఆసియా కప్ ఫైనల్లో భారత్, పాక్ తలపడ్డాయి. దురదృష్టవశాత్తూ భారత యువ ఆటగాళ్లకు తుది మెట్టుపై నిరాశ తప్పలేదు. ఫైనల్లో తన అద్భుతమైన బ్యాటింగ్‌తో పాకిస్థాన్ యువ సంచలనం సమీర్ మిన్హాస్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. టోర్నమెంట్‌లో తొలి మ్యాచ్‌లో 177 పరుగులు చేసిన సమీర్ మిన్హాస్, భారత్‌తో జరిగిన ఫైనల్‌లో సైతం 172 పరుగులతో అదరగొట్టాడు. దీంతో క్రికెట్ అభిమానులు పాక్ యువ సంచలనం సమీర్ మిన్హాస్ గురించి సెర్చ్ చేస్తున్నారు. ఈ పాకిస్థాన్ యువ బ్యాటర్ గురించి పూర్తి వివరాలు ఇక్కడ అందిస్తున్నాం.
2025 అండర్-19 ఆసియా కప్ ఫైనల్‌లో సమీర్ మిన్హాస్ కేవలం 113 బంతుల్లోనే 172 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అతని బ్యాట్ నుండి 17 ఫోర్లు, 9 సిక్సర్లు వచ్చాయి. సమీర్ బ్యాటింగ్‌తో పాకిస్థాన్ ఫైనల్‌లో 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 347 పరుగులు చేసి భారత్‌కు బిగ్ టార్గెట్ ఇచ్చింది. కీలకమైన ఆసియా కప్ ఫైనల్‌లో సమీర్ కేవలం 71 బంతుల్లోనే తన సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
మలేషియాతో జరిగిన మ్యాచ్‌లో 177 పరుగుల ఇన్నింగ్స్
టోర్నీలో ఇంతకుముందు, ఈ కుడిచేతి వాటం బ్యాట్స్‌మెన్ సమీర్ మిన్హాస్ 2025 అండర్-19 ఆసియా కప్‌లో మలేషియాతో జరిగిన తొలి మ్యాచ్‌లో 177 పరుగుల చారిత్రాత్మక ఇన్నింగ్స్ ఆడాడు. అప్పుడు సమీర్ సెంచరీ ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, 8 సిక్సర్లు బాదాడు. సమీర్ ప్రస్తుతం 2025 అండర్-19 ఆసియా కప్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా ఉన్నాడు. భారత్‌తో జరిగిన ఫైనల్‌కు ముందు, బంగ్లాదేశ్‌తో జరిగిన సెమీఫైనల్‌లో సమీర్ మిన్హాస్ 69 పరుగులతో అజేయంగా నిలిచాడు.
సమీర్ సోదరుడు కూడా క్రికెటరే
పాక్ యంగ్ బ్యాటర్ సమీర్ మిన్హాస్ పెద్దన్న అరాఫత్ మిన్హాస్ కూడా క్రికెటరే. అరాఫత్ మిన్హాస్ పాకిస్థాన్ తరపున నాలుగు టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. గత సంవత్సరం అరాఫత్ మిన్హాస్ పాకిస్థాన్ తరపున అండర్-19 ప్రపంచ కప్‌లో ఆడాడు. అయితే, సమీర్ మిన్హాస్ వయస్సు 19 సంవత్సరాలు కాగా, డిసెంబర్ 2, 2006న పాకిస్థాన్‌లోని ముల్తాన్‌లో జన్మించాడు. సమీర్ ఇప్పుడు పాకిస్థాన్ క్రికెట్‌తో పాటు ప్రపంచ వ్యాప్తంగా తన బ్యాటింగ్‌తో ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. త్వరలోనే అతను అంతర్జాతీయ క్రికెట్‌లో అవకాశాలు దక్కించుకుంటాని సీనియర్ క్రికెటర్లు, పాక్ మాజీలు చెబుతున్నారు. సమీర్ అద్భుతమైన బ్యాటింగ్‌తో పాటు లెగ్ బ్రేక్ బౌలింగ్ కూడా చేస్తాడు. అది జట్టుకు అదనపు పార్ట్ టైమ్ బౌలర్ కొరతను తీర్చుతుంది.