Ind U19 vs Pak U19 Asia Cup 2025 Final | పాకిస్తాన్ అండర్-19 ఆసియా కప్ కొత్త ఛాంపియన్‌గా అవతరించింది. 2025 అండర్-19 ఆసియా కప్ ఫైనల్‌లో భారత్‌ను 191 పరుగుల తేడాతో పాకిస్తాన్ ఓడించింది. టైటిల్ పోరులో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు ఓపెనర్ సమీర్ మిన్హాస్ అద్భుతమైన శతకం సహాయంతో 8 వికెట్లు కోల్పోయి 347 పరుగులు చేసింది.
భారీ టార్గెట్ ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత యువ ఆటగాళ్లు ఒత్తిడికి లోనయ్యారు. దాంతో టీమిండియా కేవలం 156 పరుగులకే ఆలౌట్ అయింది. ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ, ఆయుష్ మ్హత్రేతో సహా అందరూ స్టార్ ఆటగాళ్లు విఫలం కావడంతో పాక్ చేతిలో దారుణ పరాభవం తప్పలేదు. ఇంకా చెప్పాలంటే పాక్ ఓపెనర్ సమీర్ మిన్హాస్ సాధించిన స్కోరును కూడా భారత జట్టు మొత్తం కలిసి కూడా టచ్ చేయలేకపోయింది. దాంతో 191 పరుగుల తేడాతో భారత్ మీద పాక్ అండర్ 19 టీం విజయం సాధించి ట్రోఫీ అందుకుంది.
ఫైనల్లో భారత తడ‘బ్యాటు’
ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌లో భారత ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ తొలి బంతికే సిక్సర్ కొట్టి తన ఉద్దేశాన్ని స్పష్టం చేశాడు. తొలి ఓవర్లో మొత్తం 18 పరుగులు రాబట్టాడు. కానీ స్కోరు వేగాన్ని పెంచే క్రమంలో 10 బంతుల్లో 26 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. కెప్టెన్ ఆయుష్ మాత్రే కేవలం రెండు పరుగులు మాత్రమే చేశాడు. భారత జట్టులోని ఆరుగురు ఆటగాళ్లు రెండంకెల స్కోరు చేయలేకపోయారు. 10వ నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన దీపేష్ దేవేంద్రన్ అత్యధిక స్కోరర్ గా నిలిచాడు. చివర్లో బ్యాటింగ్ కు దిగిన దేవేద్రంన్ 16 బంతుల్లో 36 పరుగులు చేశాడు.
పాకిస్థాన్ బౌలింగ్ విషయానికి వస్తే, అలీ రజా 42 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ఆయనతో పాటు మహమ్మద్ సయామ్, అబ్దుల్ సుభాన్, హుజైఫా ఎహ్సాన్ తలో 2 వికెట్లు తీశారు.
మూడో ఓవర్‌లో 32 పరుగుల వద్ద భారత్ తొలి వికెట్ కోల్పోయింది. ఆయుష్ మాత్రే ఏడు బంతుల్లో 2 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత ఆరోన్ జార్జ్ 9 బంతుల్లో 16 పరుగులు చేసి వెనుదిరిగాడు. అనంతరం వైభవ్ సూర్యవంశీ 10 బంతుల్లో ఒక ఫోర్, 3 సిక్సర్ల సాయంతో 26 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. భారత టాపార్డర్ బ్యాటర్లలో ఎవరూ క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు. వేదాంత్ త్రివేది 14 బంతుల్లో 9, అభిజ్ఞాన్ కుందు 20 బంతుల్లో 13, కనిష్క్ చౌహాన్ 23 బంతుల్లో 9, ఖిలన్ పటేల్ 23 బంతుల్లో 19 పరుగులు చేసి అవుట్ అయ్యారు. ఆ తర్వాత హెనిల్ పటేల్ 6, దీపేష్ దేవేంద్రన్ 36 పరుగులు చేసి పెవిలియన్ చేరారు.
సమీర్ మిన్హాస్ 172 పరుగుల ఇన్నింగ్స్ అంతకుముందు బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ జట్టులో ఓపెనర్ సమీర్ మిన్హాస్ 113 బంతుల్లో 172 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఈ క్రమంలో అతని బ్యాట్ నుండి 17 ఫోర్లు, 9 సిక్సర్లు వచ్చాయి. ఫైనల్ మ్యాచ్‌లో సమీర్ కేవలం 71 బంతుల్లోనే తన సెంచరీ పూర్తి చేశాడు. సమీర్ తుఫాన్ ఇన్నింగ్స్ కారణంగా పాకిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 347 పరుగులు చేసింది.