Jeera Water Benefits for Weight Loss : జీలకర్రకు ఆయుర్వేదంలో మంచి స్థానం ఉంది. వివిధ ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుందని చెప్తారు. వంటింట్లో దొరికే ఈ అద్భుతమైన మసాలాను రెగ్యులర్‌గా తీసుకుంటే ఎన్నో ఆరోగ్య సమస్యలు పరిష్కారమవుతాయని చెప్తున్నారు. అందుకే మీ రోజును జీలకర్ర నీటితో ప్రారంభిస్తే మంచిదట. ఉదయాన్నే పరగడుపున జీరా వాటర్ (జీలకర్ర నీరు)ను తీసుకుంటే.. జీవక్రియ మెరుగవడం నుంచి.. కొలెస్ట్రాల్ తగ్గడం వరకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయట. ఇంతకీ ఆ ప్రయోజనాలు ఏంటి? జీరా వాటర్‌ను ఎలా చేయాలి? ఎన్ని రకాలుగా తీసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
జీరా వాటర్..
జీరా వాటర్ తయారు చేసుకోవడానికి పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. టీస్పూన్ జీలకర్రను ఓ గ్లాస్ నీటిలో వేసి రాత్రంతా నానబెట్టాలి. జీరాలోకి నీరు చేరి అవి ఉబ్బుతాయి. ఆ సమయంలో జీరాలోని పోషకాలు నీటిలోకి వస్తాయి. దీనివల్ల నీరు పసుపు రంగుకు మారుతుంది. దీనిని ఆస్మాసిస్ ప్రక్రియ అంటారు. ఈ నీటిని ఉదయాన్నే పరగడుపున తాగితే ఎన్నో ప్రయోజనాలు శరీరానికి అందుతాయి.
పోషకాలు, కేలరీలు ఇవే
జీలకర్ర వాటర్‌లో విటమిన్ ఎ, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. వీటిలో మాంగనీస్, కాపర్ వంటి ఖనిజాలు కూడా ఉంటాయి. యాంటీఆక్సిడెంట్లతో నిండిన ఈ డ్రింక్‌లో కేలరీలు కూడా తక్కువగానే ఉంటాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారి ఇది బెస్ట్ ఆప్షన్. కేలరీల గురించి కంగారు పడాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే టేబుల్ స్పూన్ జీలకర్రలో 7 కేలరీలు ఉంటాయి. వీటిలోని యాంటీఆక్సిడెంట్లు హానికరమైన ఫ్రీరాడికల్స్ నుంచి హెల్త్‌ని కాపాడుతాయి.
జీవక్రియ
బరువు తగ్గడంలో జీవక్రియ ముఖ్యపాత్ర పోషిస్తుంది. మెటబాలీజం స్లోగా ఉంటే బరువు తగ్గడం ఆలస్యమవుతుంది. మెటబాలీజం తక్కువగా ఉంటే శరీరానికి కావాల్సిన శక్తిని అందించేందుకు.. షుగర్, ఫ్యాట్‌ను బాడీ ఉపయోగించుకోలేదు. దీనివల్ల బరువు పెరుగుతారు. ఈ సమస్య ఉన్నవారు జీరా వాటర్ తీసుకుంటే జీవక్రియ మెరుగవుతుంది. దీనిని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల.. బరువు తగ్గినట్లు పలు అధ్యయనాలు తేల్చాయి.
కొలెస్ట్రాల్ దూరం..
జీరా వాటర్ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. చెడు కొలెస్ట్రాల్ గుండె సమస్యలను పెంచుతుంది. వివిధ ఆరోగ్య సమస్యలు కూడా ప్రమాదకరంగా మారుతాయి. రోజూ జీలకర్ర వాటర్ తీసుకుంటే ఈ సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఇది చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి.. మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. ముఖ్యంగా పొట్ట చుట్టూ చేరిన కొవ్వును తగ్గించడంలో మంచి ఫలితాలు ఇస్తుంది.
టాక్సిన్లు దూరం..
శరీరంలో టాక్సిన్లు ఎక్కువైతే అవి చెడు కొలెస్ట్రాల్‌గా మారుతాయి. జంక్ ఫుడ్ తింటూ.. వ్యాయామం చేయనివారిలో ఇవి ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరానికి అందాల్సిన పోషకాలు అందకుండా చేస్తాయి. కాబట్టి టాక్సిన్లను వదిలించుకోవడం కోసం కూడా దీనిని తీసుకోవచ్చు. శరీరాన్ని క్లీన్‌గా ఉంచి.. టాక్సిన్లను బయటకు పంపిస్తాయి.
జీర్ణ సమస్యలు దూరం
గట్ హెల్తీగా ఉంటే.. పూర్తి ఆరోగ్యం బేషుగ్గా ఉంటుంది. జీరా నీటితో గట్ హెల్త్ మెరుగై జీర్ణ సమస్యలు దూరమవుతాయి. జీర్ణక్రియ మెరుగై జీవక్రియను పెంచుతుంది. ఇది బరువు తగ్గడంలో హెల్ప్ చేస్తుంది. కడుపు ఉబ్బరాన్ని, మలబద్ధకాన్ని దూరం చేసుకోవాలనుకునేవారు కూడా దీనిని తీసుకోవచ్చు.
ఇలా కూడా తీసుకోవచ్చు..
జీలకర్రను పొడి చేసి.. దానిని పెరుగులో కలిపి తీసుకోవచ్చు. వంటల్లో వేసుకోవచ్చు. జీలక్రరను రాత్రంతా నానబెట్టి.. ఉదయాన్నే దానిని మరిగించి.. దానిలో నిమ్మరసం కలిపి కూడా తీసుకోవచ్చు. ఈ జీరా వాటర్‌కు మీరు తేలికపాటి వ్యాయామం, శారీరక శ్రమ యాడ్ చేసి.. డైట్లో మార్పులు చేస్తే బరువు తగ్గడంలో అద్భుతమైన ఫలితాలు చూస్తారు. రెండు వారాలు దీనిని కంటిన్యూగా తీసుకుంటే ఫలితాలు మీకే తెలుస్తాయట. స్కిన్ హెల్త్కి కూడా మంచిది. అయితే ఇవి పర్సన్ బట్టి మారుతూ ఉంటాయి.
Also Read : రోజుకు 10,000 అడుగులు నడుస్తున్నారా? అయితే ఇది మీకోసమే.. డైలీ ఎంత నడిస్తే మంచిదంటే
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.