రెండేళ్ల నుంచి తొంభైశాతం మంది ఐటీ ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. కరోనాలాంటి కల్లోలం వస్తుందని, ఇలా ఇంట్లోనే పని చేసే పరిస్థితిని తెస్తుందని ఎవరూ ఊహించలేదు. 2020 మార్చిలో మొదలైన వర్క్ ఫ్రమ్ హోమ్ లు ఇప్పటికీ ఇంకా ముగియలేదు.త్వరలో మళ్లీ ఐటీ కంపెనీలన్నీ ఉద్యోగులను వెనక్కి పిలిచే అవకాశాలు మాత్రం అధికంగా ఉన్నాయి. ఇలా ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేయడం వల్ల కంపెనీలకు ఆర్ధికంగా ఎంతో లాభమని భావిస్తుంటారు చాలా మంది. ఆఫీసు స్పేస్‌కు కట్టే అద్దె మిగిలిపోతుందని, ఉద్యోగినులకు క్యాబ్‌లు పెట్టించక్కర్లేదని, హౌస్ కీపింగ్ ఉద్యోగులకు జీతాలివ్వక్కర్లేదని, ఆఫీసు కరెంటు బిల్లు, నెట్ బిల్లు మిగిలిపోతుందని... ఇలా అనేక రకాలుగా భావిస్తారు సామాన్య జనం. కానీ టీసీఎస్ ఛైర్మన్ చంద్రశేఖరన్ మాత్రం కొన్ని రోజుల క్రితం వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల కంపెనీకు ఖర్చు ఏమాత్రం తగ్గదని తేల్చి చెప్పారు. అలా అని ఆయన వర్క్ ఫ్రమ్ హోమ్ వ్యతిరేకిస్తున్నట్టు మాత్రం ఎక్కడా అనలేదు. ఇంటి నుంచి ఉద్యోగులు పనిచేయడం వల్ల కంపెనీలకు ఖర్చు తగ్గుతుందన్న అభిప్రాయాన్ని మాత్రం ఆయన వ్యతిరేకించారు. ఆయన అభిప్రాయంలో నిజమెంత? దానికి ప్రస్తుత పరిస్థితిని విశ్లేషించి చూసుకోవాలి. 


ఎందుకు తగ్గదు?
పెద్ద కంపెనీలు కార్యాలయాలను లీజుకు తీసుకుంటాయి. ఆ లీజులు అయిదేళ్ల నుంచి పదేళ్లకు రాసుకుంటారు. కొన్ని కోట్ల రూపాయలు విలువ చేస్తాయి ఆ లీజులు. కార్యాలయం వాడినా వాడకపోయినా... లీజుకు తీసుకున్నాక ఆ మొత్తం చెల్లించాల్సిందే. ఇక కార్యాలయ నిర్వహణ అంటే హౌస్ కీపింగ్ వంటివి కూడా దీర్ఘకాలిక ఒప్పందాలనే కలిగి ఉంటాయి. వారికీ చెల్లించాల్సిందే.కరోనాలాంటి మహమ్మారులు వచ్చిన కారణంగా ఆ లీజులను రద్దు చేయడానికి వీల్లేదు. ఒకవేళ రద్దు చేస్తే అంతకుమించి భారీగా చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ఆఫీసులకు ఇంటర్నెట్ ప్రొవైడర్లతో భారీ కాలానికి ఒప్పందాలు జరిగి ఉంటాయి. వారికీ నెలనెలా చెల్లించాల్సిందే. అంతే కాకుండా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చాక ఉద్యోగులకు ఇంటర్నెట్ బిల్లులును కూడా చాలా ఐటీ కంపెనీలు చెల్లిస్తున్నాయి. ఇది వారికి అదనపు ఖర్చు. కాబట్టి ఇంతవరకు కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ మోడల్ వల్ల ప్రయోజనాన్ని పొందినట్టు ఎక్కడా రికార్డు కాలేదు.


భవిష్యత్తులో...
కరోనా వల్ల హఠాత్తుగా వర్క్ ఫ్రమ్ హోమ్ నిర్ణయాన్ని తీసుకున్నాయి కంపెనీలు. అంటే అప్పటికే అన్నీ లీజులపై సంతకాలు అయిపోయాయి. చెల్లింపులు చేయకతప్పదు. పైగా ఉద్యోగులకు ల్యాప్ టాప్‌లు,ఫర్నిచర్ (కొన్ని కంపెనీలు చైర్, టేబుల్ వంటివి కూడా కొని ఇచ్చాయి)వంటివి అదనపు ఖర్చులుగా పడ్డాయి. కాబట్టే సంస్థలకు వర్క్ ఫ్రమ్ హోమ్ భారంగా మారింది. కానీ WFHను ప్లాన్ ప్రకారం  అమలు చేస్తే మాత్రం కంపెనీలకు లాభాల పంట పండే అవకాశం ఉందని చెబుతున్నారు విశ్లేషకులు. కాకపోతే మనదేశంలో పూర్తిగా వర్క్ హోమ్ ఇచ్చే పరిస్థితి, వాతావరణం రావాలి. అలా రావడానికి ఎన్నాళ్లు పడుతుందో చెప్పలేం. అయిదేళ్ల తరువాత మాత్రం కనీసం సగం మంది ఉద్యోగులైనా ఇంటి నుంచి పనిచేసే అవకాశం ఉన్నట్టు మాత్రం చెబుతున్నారు. అప్పుడు ప్రణాళిక ప్రకారం పెద్ద ఆఫీసు స్పేస్ లను లీజుకు తీసుకోకుండా ముందుకు వెళితే ప్రయోజనం కలగవచ్చని అంచనా వేస్తున్నారు.