Women's World Cup: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా తొలి పరాజయం చవిచూసింది. ఆతిథ్య న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచులో 62 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ప్రత్యర్థి నిర్దేశించిన 261 పరుగు లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. హర్మన్ ప్రీత్ (71; 63 బంతుల్లో 6x4, 2x6), మిథాలీ రాజ్ (31; 56 పరుగుల్లో 1x4) ఫైటింగ్ సరిపోలేదు. అంతకు ముందు కివీస్‌లో అమీ శాటర్త్‌వైట్ (75; 84 బంతుల్లో 9x4), అమెలియా కెర్ (50; 64 బంతుల్లో 5x4) హాఫ్ సెంచరీలు చేశారు. సుజీ బెట్‌ను పూజా వస్త్రకార్ డైరెక్ట్ హిట్‌తో పెవిలియన్ పంపించడం వైరల్‌గా మారింది.
హర్మన్ మాత్రమే
ఛేజింగ్‌లో టీమ్‌ఇండియాకు కలిసిరాలేదు. జట్టు స్కోరు 10 వద్దే ఫామ్‌లో ఉన్న ఓపెనర్ స్మృతి మంధాన (6; 21 బంతుల్లో)ను జెస్‌కెర్ పెవిలియన్ పంపించింది. మరికాసేపటికే దీప్తిశర్మ (5)ను తహూహు లెగ్ బిఫోర్‌గా ఔట్ చేసింది. క్లిష్ట పరిస్థితుల్లో యస్తికా భాటియా (28), మిథాలీ రాజ్ ఆదుకొనే ప్రయత్నం చేశారు. నిలకడగా ఆడుతున్న ఈ జోడీని యస్తికాను ఔట్ చేయడం ద్వారా తహూహు విడదీసింది.
తొలి మ్యాచులో విఫలమైన హర్మన్ ప్రీత్ మాత్రం ఈ సారి దూకుడుగా ఆడింది. వరుసగా బౌండరీలతో చెలరేగింది. రెండు చక్కని సిక్సర్లనూ బాదేసింది. అయితే జట్టు స్కోరు 97 వద్ద మిథాలీ, రిచా ఘోష్ వెంటవెంటనే ఔటవ్వడంతో ఛేదన లయ తప్పింది. హర్మన్‌కు మరొకరు అండగా నిలవకపోవడం, వరుసగా వికెట్లు పడటంతో ఒత్తిడి పెరిగిన టీమ్‌ఇండియా 198కి ఆలౌటైంది.