ఏబీపీ, సీఓటర్ సర్వే(ABP, C-Voter Survey)లో చెప్పినట్టుగా ఐదు రాష్ట్రాల్లో(Five State Elections 2022) ఫలితాలు వస్తున్నాయి. ఉత్తర్‌ప్రదేశ్‌(Uttar Pradesh)లో బీజేపీకి తిరుగు లేదని ఏబీపీ, సీఓటర్‌ సర్వేలో తేలింది. ఇప్పుడు ఫలితాలు చూస్తుంటే అదే నిజమని స్పష్టం అవుతోంది. 


ఉత్తర్‌ప్రదేశ్‌ను యోగి ఆదిత్యనాథ్‌(Yogi Adityanath) ఒంటిచేత్తో బీజేపీ(BJP)ని విజయ తీరాలకు చేర్చారు. ఎన్నికల టైంలో ఎస్పీ(Samajwadi Party) కాస్త టెన్షన్ పెట్టినా ఏ మాత్రం బెదరలేదు. చాలా మంది బీసీ లీడర్లను తమవైపు తిప్పుకున్నా బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా యోగీ తనస్టైల్ రాజకీయం నడిపించారు. 


ఉత్తర్‌ప్రదేశ్‌ ఎన్నికలు బీజేపీకి చాలా ప్రతిష్టాత్మకంగా మారాయి.403 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఉత్తర్‌ప్రదేశ్‌లో 250స్థానాలకుపైగా బీజేపీ ఆధిక్యంలో ఉంది. యూపీ సీఎం అభ్యర్థి యోగి ఆదిత్యనాథ్‌ భారీ మెజార్టీతో దూసుకెళ్తున్నారు. 


రైతు చట్టాలు, లఖింపూర్ ఘటన, ఉన్నావ్‌ రేప్‌ కేసు, పెట్రోల్‌ డీజిల్ ధరలు విషయంలో ఎంత వ్యతిరేకత ఉన్నప్పటికీ వాటిని కాదని బీజేపీకి ప్రజలు పట్టం కడుతున్నారు. ఎన్నికల టైంలో చాలా కీలమైన నేతలు బీజేపీని వదిలి ఎస్పీలోకి వెళ్లారు. అయినా ఓటర్లు మాత్రం బీజేపీతో ఉన్నట్టు ఫలితాలు చూస్తే అర్థమవుతోంది. 


బీజేపీ ప్రభుత్వంపై కొంత వ్యతిరేకత ఉన్నప్పటికీ గత ఐదేళ్లలో అమలు చేసిన పథకాలు, శాంతిభద్రతల తీరు ఇలాంటి అంశాలతో బీజేపీ క్యాంపెయిన్ చేసింది. గత ప్రభుత్వాల టైంలో ప్రజలు ఎదుర్కొన్న సమస్యలను గుర్తు చేస్తూ అలాంటి పరిస్థితి కొని తెచ్చుకోవద్దని పదేపదే హెచ్చరింది. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌షా సహా ఇతర స్టార్ క్యాంపెయినర్‌లంతా ఇదే అంశాన్ని పదే పదే ప్రచారం చేశారు. వీటికే ప్రజలు మద్దతు పలికినట్టు తెలుస్తోంది. 


అన్నింటికంటే ముఖ్యంగా యోగి చేసిన  80శాతం వర్సెస్‌ 20 శాతం నినాదం బాగా ప్రజల్లోకి చొచ్చుకెళ్లినట్టు కనిపిస్తోంది. ఆయన మాటల్లో 80శాతం మంది బీజేపీ మద్దతు దారులు, మిగతా 20 శాతం ప్రతిపక్షాలకు మద్దతుదారులు అంటూ ప్రచారం చేశారు. కానీ ఇది హిందూ ముస్లింల మధ్య విభేదాలు సృష్టించేందుకు హిందువును రెచ్చగొట్టేందుకు ఈ కామెంట్స్ చేశారని అప్పట్లో పెద్ద దుమారమే రేగింది. అయినా ప్రజలు వాటిని పెద్దగా పట్టించుకున్నట్టు కనిపించడం లేదు. 


ఈ నినాదమే బాగా వర్క్‌అవుట్‌ అయినట్టు కనిపిస్తోంది. హిందువుల ఓట్లు ఏక మొత్తంలో బీజేపీకి పడేలా చేయడంలో యోగి సక్సెస్‌ అయ్యారు. బీజేపీని విజయతీరాలకు చేర్చారు యోగి. వివిధ కులాల నేతలు తమ పార్టీని వీడుతున్నప్పటికీ ఏ మాత్రం ఓట్లు చీలిపోకుండా కాపాడుకోగలిగారు. ఆయా కులాల్లో వ్యతిరేక ముద్ర పడకుండా చూసుకున్నారు.