Amazon Blocks Prime Video Streaming: రష్యాను ఒంటరిని చేయాలన్న ఆంక్షల వలయంలోకి ఇప్పుడు అమెజాన్ చేరింది. అమెరికా, పశ్చిమ దేశాల ఆంక్షలకు తోడుగా తానూ కొన్ని అమలు చేస్తోంది. రష్యాలో అమెజాన్ ప్రైమ్ యాక్సెస్‌ను రద్దు చేసింది. రష్యా, బెలారస్‌లోని కస్టమర్లు చేసిన ఆర్డర్లు, రిటైల్ ఉత్పత్తులను నిలిపివేసిందని ఐఏఎన్‌ఎస్ పేర్కొంది.
రష్యా, బెలారస్‌లోని కస్టమర్లు, థర్డ్ పార్టీ సెల్లర్ల నుంచి ఎలాంటి కొత్త ఆర్డర్లను స్వీకరించడం లేదని అమెజాన్ తెలిపింది. 'రష్యా కేంద్రంగా ఉన్న కస్టమర్లకు ప్రైమ్ వీడియో యాక్సెస్‌ను సస్పెండ్ చేస్తున్నాం. న్యూవరల్డ్ నుంచీ ఇకపై ఆర్డర్లు తీసుకోబోం. రష్యాలో మేం నేరుగా విక్రయించే వీడియో గేమ్ అదొక్కటే' అని అమెజాన్ వెల్లడించింది. ఓపెనర్ వరల్డ్ ఎంఎంవో న్యూ వరల్డ్ ఆర్డర్లను స్వీకరించడం ఆపేసింది.
ఈఏ గేమ్స్, సీడీ ప్రాజెక్ట్ రెడ్, టేక్ టూ, యూబిసాఫ్ట్, యాక్టివేషన్, బ్లిజార్డ్, ఎపిక్ గేమ్స్ వంటి గేమింగ్ కంపెనీలూ రష్యాలో విక్రయాలను నిలిపివేశాయి. అయితే కొన్ని టెక్నాలజీ కంపెనీల్లా అమెజాన్, ఏడబ్ల్యూఎస్‌కు రష్యాలో ఎలాంటి డేటా సెంటర్లు, మౌలిక సదుపాయాలు, ఆఫీసులు లేకపోవడం గమనార్హం. 'రష్యా ప్రభుత్వంతో బిజినెస్ సంబంధాలు పెట్టుకోవద్దని మేం ఎప్పట్నుంచో పాలసీ పెట్టుకున్నాం' అని అమెజాన్ అంటోంది.
ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగడంతో రష్యా లేదా బెలారస్ వినియోగదారుల నుంచి కొత్త ఆర్డర్లు తీసుకోవడం లేదని అమెజాన్ క్లౌడ్ కంప్యూటింగ్ యూనిట్ ఏడబ్ల్యూఎస్ ప్రకటించింది. యుద్ధ కల్లోలిత ప్రాంతమైన ఉక్రెయిన్‌లో మానవతా దృక్పథంతో సేవలు అందించేందుకు వివిధ స్వచ్ఛంద సంస్థలతో భాగస్వామ్యం కొనసాగిస్తున్నామని వెల్లడించింది.
'యుద్ధ ప్రభావం పడిన వారికి మద్దతుగా అమెజాన్ 5 మిలియన్ డాలర్లు డొనేట్ చేసింది. మా ఉద్యోగులు ఇచ్చే మొత్తానికి సమానమైన డబ్బును మేం కూడా ఇస్తాం. దాదాపుగా పదివేల మంది ఉద్యోగులు ఇందులో భాగం పంచుకోవడం ఆనందంగా ఉంది' అని అమెజాన్ తెలిపింది. అమెజాన్ హోమ్ పేజీల ద్వారా వేల మంది ఉక్రెయిన్‌కు విరాళాలు అందిస్తున్నారు.
అమెజాన్ కన్నా ముందే యాపిల్, మైక్రోసాఫ్ట్, సామ్‌సంగ్, నెట్‌ఫ్లిక్స్, పేపాల్ వంటి సంస్థలు రష్యాలో బిజినెస్‌ను ఆపేశాయి. వీసా, మాస్టర్ కార్డు కూడా తమ సేవలు నిలిపివేశాయి.