వయసు పెరుగుతున్న కొద్దీ హైబీపీ వచ్చే అవకాశాలు కూడా పెరుగుతాయి. ఒత్తిడి కారణంగా చిన్న వయసులోనే దీని బారిన పడుతున్న వారు ఉన్నారు. దీన్ని సైలెంట్ కిల్లర్ అని పిలవవచ్చు. ఎప్పుడు శరీరంలో చేరుతుందో చెప్పలేం, చెక్ చేయించుకునేవరకు హైబీపీ వచ్చిన సంగతి కూడా పోల్చుకోలేం. లక్షణాలు పెద్దగా చూపించకపోవడం వల్లే హైబీపీ వచ్చే వరకు తెలియదు. ఇది రావడం వల్ల స్ట్రోక్, గుండె పోటు వంటివి కూడా వచ్చే అవకాశం పెరుగుతుంది. అధిక రక్తపోటు అనేది అత్యంత ప్రమాదకరమైన ఆరోగ్య పరిస్థితి. సాధారణ రక్తపోటు 120/80గా ఉంటుంది. 140/90 రీడింగ్ దాటితే వారికి అధికరక్తపోటు ఉన్నట్టే. 180/120 దాటి ఉంటే తీవ్రంగా పరిగణిస్తారు. బీపీ కంట్రోల్ లేదంటే దానికి కారణాలు చాలా ఉండొచ్చు. అలాంటి వాటిలో ప్రధాన కారణాలు ఇవి కావచ్చు.
ఉప్పు
అధిక సోడియానికి అధిక రక్తపోటుకు మధ్య చాలా సంబంధం ఉంది. సోడియం శరీరంలోని అధికంగా చేరుతుంటే రక్తపోటు పెరుగుతూ ఉంటుంది. ఆహారంలో ఉప్పుని తగ్గించుకుంటే రక్తపోటు కూడా తగ్గుతుంది. ఒక్కసారి హైబీపీ వచ్చిందా రోజూ మందులు వాడాల్సిందే. అందుకే రాకుండా ముందే ఉప్పును తగ్గించాలి.
కూరగాయలు, పండ్లు తినకపోవడం
శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ తాజా కూరగాయలు, పండ్లలో లభిస్తాయి. పొటాషియం కూడా వీటి నుంచి శరీరానికి చేరుతుంది. సోడియాన్ని ఎదుర్కొనే శక్తి పొటాషియానికే ఉంది. పొటాషియం రక్తపోటు సమస్య నుంచి ధమనులు, ఇతర రక్తనాళాల గోడలను కాపాడతుంది. శరీరంలో పొటాషియం స్థాయిలు పెంచాలంటే పాలకూర, బ్రొకలీ, అరటిపండ్లు, బీట్ రూట్స్, నారింజ, టమోటోలు,అన్ని రకాల కూరగాయలు తినాలి.
ఒత్తిడి తగ్గించుకోవాలి
ఒత్తిడి రక్తపోటుపై చాలా ప్రభావం చూపిస్తుంది. మీరు తీవ్ర ఒత్తిడికి గురైనప్పుడు రక్తపోటు స్థాయిలు పెరుగుతాయి. ఒత్తిడి లేకుంటే నరాలన్నీ ప్రశాంతంగా ఉంటాయి. కానీ అధిక ఒత్తిడి మీ రక్త నాళాల గోడలకు తీవ్ర హాని కలిగిస్తుంది. అందుకే యోగా, ధ్యానం ద్వారా ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించాలి.
నిద్రలేమి
నిద్ర తగినంత లేకపోయినా అధికరక్తపోటు ప్రమాదం పెరుగుతుంది. నిద్రలేమితో బాధపడేవారు అధిక రక్తపోటుకు గురయ్యే అవకాశం 48 శాతం ఎక్కువ. ఇక హైబీపీ ఉన్నవారు సరిగా నిద్రపోకపోతే వారి పరిస్థితి మరింత దిగజారుతుంది.
మద్యపానం
అధిక ఆల్కహాల్ పానీయం రక్తపోటు స్థాయిలు అనారోగ్య స్థాయికి చేరుకుంటాయి. ఇది రక్తనాళాల్లోని కండరాలపై ప్రభావం చూపి సన్నగా మారుతుంది. ఇది శరీరంలోని ఇతర భాగాలకు రక్తాన్ని పంప్ చేయడానికి మీ గుండెను కష్టపడేలా చేస్తుంది. ఈ పరిస్థితి గుండెపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఆ ఒత్తిడికి గుండె పోటు వచ్చే అవకాశం కూడా ఉంది.
Also read: వీళ్లని చూడాలంటే ఎవరైనా తల ఎత్తాల్సిందే, వీడియో చూడండి