తెలంగాణలో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌ గాంధీ పర్యటన తేదీలు ఖరారయ్యాయి. వచ్చే నెల 4, 5 తేదీల్లో ఆయన తెలంగాణకు రానున్నట్లుగా రాష్ట్ర కాంగ్రెస్ వర్గాలు ప్రకటించాయి. రెండ్రోజుల పర్యటనలో భాగంగా మే 4న రాహుల్ గాంధీ.. వరంగల్‌ జిల్లాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొననున్నారు. 5న తేదీన బోయిన్‌ పల్లిలో కార్యకర్తలతో సమావేశం అవుతారు. ఈ మేరకు ఏఐసీసీ నాయకులు రాష్ట్ర అధిష్ఠానానికి సమాచారం అందించారు. 


రాహుల్ పర్యటన తేదీలు ఖరారు కావడంతో ఆయన టూర్‌ను విజయవంతం చేసేలా తెలంగాణ పీసీసీ ఏర్పాట్లకు సిద్ధమైంది. మరోవైపు, తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇంఛార్జి మాణిక్యం ఠాగూర్ శుక్రవారం (ఏప్రిల్ 15) హైదరాబాద్‌కు రానున్నారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు, కమిటీ ఛైర్మన్లతో సమావేశమై రాహుల్ గాంధీ పర్యటన విజయవంతం అయ్యేలా కీలక సూచనలు చేయనున్నారు. పర్యటనలో వ్యూహాలు కూడా చర్చించనున్నారు.


తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే దిశగా ఢిల్లీలోని అధిష్ఠానం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అందుకే కొద్ది రోజుల క్రితం సీనియర్, కీలక నేతలతో రాహుల్ ఢిల్లీలో సమావేశం అయ్యారు. ఈ భేటీ కోసం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స‌హా టీ కాంగ్రెస్‌కు చెందిన 38 మంది కీల‌క నేత‌లు ఢిల్లీకి వెళ్లిన సంగ‌తి తెలిసిందే. చ‌ర్చలో భాగంగా అభ్యర్థులను ముందుగా ప్రకటించే అంశం చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే, భువ‌నగిరి ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి ఓ కీల‌క అంశాన్ని ప్రస్తావించారు. ఎన్నిక‌ల‌కు ఇంకా చాలా స‌మ‌య‌మే ఉన్నా ముందుగానే అభ్యర్థుల‌ను ఎలా ప్రక‌టిస్తార‌ని ఆయ‌న ప్రస్తావించారు. ఇందుకు ఉదాహ‌ర‌ణ‌గా ఆయ‌న పెద్దప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గానికి విజ‌య‌ర‌మ‌ణారావు అభ్యర్థిత్వాన్ని ఖ‌రారు చేసిన వైనాన్ని ప్రస్తావించారు. మిగిలినవారి లాగే తాను కూడా ముందుగానే అభ్యర్థుల‌ను ప్రక‌టించాలా? అంటూ ఆయ‌న పార్టీ కీల‌క నేత‌ల‌ను ప్రశ్నించారు.


మరోవైపు, అధిష్ఠానం రాష్ట్ర పార్టీలో నేతల మధ్య నెలకొన్న వర్గ విబేధాలకు చెక్ పెట్టేందుకు కేంద్ర పార్టీ పెద్దలు దృష్టి సారించారు. రేవంత్ రెడ్డిని టీపీసీసీ అధ్యక్షుడిగా నియమించిన నాటి నుంచి పార్టీలోని కొందరు సీనియర్లు అసంతృప్తితో ఉన్నారు. జగ్గారెడ్డి, హనుమంత్ రావు లాంటి వారు బహిరంగంగానే రేవంత్ తీరును తప్పుబడుతూ వస్తున్నారు. ఈ కోవలో కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కూడా ఉన్నారు. తెలంగాణ కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ గా సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని నియమిస్తూ ఏఐసీసీ వ్యవహారాల ఇన్ ఛార్జి కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు.