బొల్లి మచ్చలు ఒక చర్మరోగం. ఇది ఎంతో మందిలో కనిపిస్తుంది. సాధారణ చర్మానికి భిన్నంగా బొల్లి మచ్చలు చాలా తెలుపుగా ఉంటాయి. ప్యాచ్‌ల్లా ముఖం, మెడ, చేతులు, శరీరంపై బొల్లి పాకిపోతుంది. మెలనిన్ ఉత్పత్తికి కారణమయ్యే కణాలైన మెలనోసైట్లు నాశనమైనప్పుడు సంభవించే దీర్ఘకాలిక చర్మ రుగ్మత బొల్లి. మెలనిన్ అనేది చర్మం, జుట్టు, కళ్ళకు రంగును ఇచ్చే హార్మోను. మెలనోసైట్ కణాలు నాశనం అయిన ప్రాంతాల్లో తెల్లటి పాచెస్ ఏర్పడతాయి. అదే బొల్లి మచ్చలు. ఈ మచ్చల పరిమాణం, ఆకారం ఒకేలా ఉండవు. పెరుగుతూ ఉంటాయి. ఆ తెల్లటి ప్యాచెస్ వచ్చిన చోట సున్నితంగా ఉంటుంది. దురద కూడా అనిపిస్తుంది. బొల్లి మచ్చలు జుట్టును ప్రభావితం చేస్తాయి. ఆ ప్రాంతంలోని జుట్టు తెల్లగా లేదా బూడిద రంగులోకి మారతాయి.
బొల్లి రోగం ఎందుకు వస్తుందో కచ్చితంగా చెప్పలేము. ఇది వారసత్వంగా వచ్చే అవకాశం ఉంది. అంటే తల్లి దండ్రులకు ఉంటే పుట్టే పిల్లలకు వచ్చే అవకాశం ఎక్కువ. కుటుంబంలో ఎవరికి ఉన్నా కూడా ఆ కుటుంబంలో పుట్టే పిల్లలకు వచ్చే ఛాన్సులు ఉన్నాయి. అయితే ఇది చిన్నప్పట్నించే రావాలని లేదు. వయసు పెరుగుతున్న కొద్దీ కొందరిలో బయటపడవచ్చు. కొందరిలో టీనేజీ వయసుకు వచ్చాక కూడా బయటపడుతుంది. కొన్ని సందర్భాల్లో, థైరాయిడ్ వ్యాధి లేదా టైప్ 1 మధుమేహం వంటి ఆటో ఇమ్యూన్ వ్యాధులతో బొల్లి సంబంధం కలిగి ఉంటుంది. బొల్లి కూడా ఒక ఆటో ఇమ్యూన్ వ్యాధే. చర్మం కొన్ని రకాల రసాయనాలకు గురికావడం వల్ల, గాయాలు తగలడం వల్ల, పర్యావరణ కారకాల వల్ల కూడా బొల్లి వచ్చే అవకాశం ఉంది.
చర్మవ్యాధి నిపుణులను సంప్రదిస్తే శారీరక పరీక్ష ద్వారా బొల్లిని నిర్ధారిస్తారు. వుడ్స్ ల్యాంప్, డెర్మాటోస్కోపీ, స్కిన్ బయాప్సీ వంటి ప్రత్యేక పరికరాలను ఉపయోగించి రోగనిర్ధారణ చేస్తారు. తగిన చికిత్సా విధానాన్ని నిర్ణయించడానికి వైద్యులు రంగు మారిన చర్మం పరిధిని అంచనా వేస్తాడు. ఇతర ఆటో ఇమ్యూన్ వ్యాధులు ఉన్నాయేమో కూడా పరీక్షలు చేస్తారు.
నిజం చెప్పాలంటే బొల్లికి ఎటువంటి చికిత్స లేదు. వచ్చిందంటే అలా జీవితాంతంత కొనసాగాల్సిందే. కొన్ని రకాల వైద్య చికిత్సలు చేస్తున్నప్పటకీ అవేవీ శాశ్వతమైన పరిష్కారాన్ని అందించవు. టాపికల్ కార్టికోస్టెరాయిడ్స్, కాల్సినూరిన్ ఇన్హిబిటర్స్, విటమిన్ డి అనలాగ్‌లు వంటి చికిత్సలు ప్రభావితమైన చర్మాన్ని తిరిగి పిగ్మెంట్ చేయడంలో సహాయపడతాయి. నారోబ్యాండ్ అతినీలలోహిత B (NB-UVB) కాంతిచికిత్స, ఎక్సైమర్ లేజర్ థెరపీ వంటివి కూడా మెలనోసైట్ కార్యకలాపాలను పెంచుతాయి. దీనివల్ల అక్కడ చర్మం మరింత రంగు మారకుండా ఆపుతాయి. ఆటోలోగస్ మెలనోసైట్ మార్పిడి, స్కిన్ గ్రాఫ్టింగ్ వంటి శస్త్రచికిత్సలు కూడా చేస్తూ ఉంటారు. ఇవన్నీ ఖర్చుతో కూడుకున్నవే.
Also read: తీపి పదార్థాలు తగ్గించుకోండి, లేకుంటే చర్మంపై ముడతలు రావడం ఖాయం
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.