తెలంగాణ అధ్యక్షుడి మార్పుపై అధినాయకత్వం మరోసారి ఆలోచనలో పడ్డట్టు తెలుస్తోంది. ఇప్పటికే బండి సంజయ్‌ను ఢిల్లీ పిలిచి మాట్లాడిన హైకమాండ్‌ ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా సైలెంట్‌గా పరిస్థితులు గమనిస్తోంది. బండి సంజయ్‌కు ఆర్‌ఎస్‌ఎస్‌ మద్దతు గట్టిగా ఉన్నట్టు తెలుస్తోంది. 


సంజయ్‌ రాకతో పార్టీలో పెరిగిన జోష్


తెలంగాణలో పార్టీకి ఊపు తీసుకొచ్చింది బండి సంజయ్‌. ఈ విషయాన్ని ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఎవరిని అడిగినా చెప్తారు. అదే టైంలో పార్టీలో వర్గాలు కూడా ఎక్కువ అయ్యాయి అనేది కఠోర సత్యం. దీని ఫలితంగానే బండి సంజయ్‌ మార్పు ఖాయమని చాలా మంది అనుకున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న టైంలో అందర్నీ కలుపుకొని వెళ్లే వ్యక్తికి పగ్గాలు అప్పగించాలని, దూకుడు కంటే వ్యూహాత్మకంగా వెళ్లే వ్యక్తి అసవరం అవుతాడని పార్టీ హైకమాండ్ ఆలోచన. అందుకే కిషన్ రెడ్డి పేరును తెరపైకి తీసుకొచ్చింది. 


సంజయ్‌కు ఆర్‌ఎస్‌ఎస్‌ గట్టి మద్దతు


బండి సంజయ్‌ మార్పును ఆర్‌ఎస్‌ఎస్‌ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తోంది. పార్టీకి తెలంగాణలో మైలేజ్ తీసుకొచ్చిన వ్యక్తిని తప్పించి మరో వ్యక్తిని నియమిస్తే ప్రమాదం కొనితెచ్చుకున్నట్టేనని కేడర్‌కు తప్పుడు సంకేతాలు పంపించినట్టు అవుతుందని ఆ విభాగం వాదిస్తోంది. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని సవాల్‌ చేయడంలో సంజయ్ విజయం సాధించారని, తెలంగాణలో బీజేపీని తన సమీప ప్రత్యర్థిగా గుర్తించేలా అధికార పార్టీని పరుగెత్తించారని ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలు చెబుతున్నారు.  ఈ సమయంలో బండి సంజయ్‌ను తప్పిస్తే పార్టీ కేడర్‌ ఒక్కసారిగా డీలాపడిపోతందని వాదిస్తున్నారు. 


పరిణామాలను చూస్తున్న అధినాయకత‌్వం 


తెలంగాణ పరిణామాలను బీజేపీ హైకమాండ్ నిశితంగా గమనిస్తోంది. సంజయ్‌కు మద్దతుగా సోషల్ మీడియాలో నడుస్తున్న క్యాంపెయిన్‌ను కూడా పరిగణలోకి తీసుకుంటోంది. ఆయన అభిమానులు, బీజేపీ అభిమానులు, ఆర్‌ఎస్‌ఎస్‌ ఫాలోవర్స్ పెడుతున్న పోస్టింగ్స్‌పై బీజేపీ అధినాయకత్వం దృష్టికి వెళ్లినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 


ఒకట్రెండు రోజుల్లో కీలక ప్రకటన 


అందుకే సోమవారం ప్రకటించాల్సిన నిర్ణయాన్ని బీజేపీ అధినాయకత్వం వాయిదా వేసుకుంది. దీన్ని ఇంకా లాగడం కూడా మంచిది కాదని భావిస్తోంది. సంజయ్‌కు కేంద్రమంత్రివర్గంలో చోటు ఇచ్చి అనుకున్న మార్పులు కంటిన్యూ చేయడమా.. లేకుంటే బండి సంజయ్‌ను కంటిన్యూ చేయడమా అనేది తేల్చేయనుంది. దీనిపై ఇప్పటికే మథనం మొదలు పెట్టిన బీజేపీ అగ్రనాయకత్వం... ఒకట్రెండు రోజుల్లో ఓ నిర్ణయం ప్రకటించనుంది. 


హైదరాబాద్‌లోకు సునీల్ బన్సల్
బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ సునీల్ బన్సల్‌ నేడు హైదరాబాద్ వస్తున్నారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలపై నేతలతో చర్చించనున్నారు. రెండు రోజుల పాటు ఇక్కడే ఉండే తీసుకోవాల్సిన మార్పులపై అభిప్రాయసేకరణ చేయనున్నారు. వీటితోపాటు కొద్ది రోజులుగా నేతలు వినిపిస్తున్న అసంతృప్తి స్వరాలను కూడా కూల్ చేసేందుకు ఆయన మీటింగ్స్ పెడుతున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 


Also Read: పార్టీని, అధ్యక్షుడ్ని నేను ధిక్కరించలేదు, మీడియాలో తప్పుడు ప్రచారం - రఘునందన్ క్లారిటీ


Also Read: నాపై విమర్శలు కాదు, కొత్త భవనం కట్టండి - గవర్నర్ తమిళిసై కీలక వ్యాఖ్యలు


                                       Join Us on Telegram: https://t.me/abpdesamofficial