ఉస్మానియా ఆసుపత్రిని సందర్శించిన సందర్భంగా గవర్నర్ తమిళిసై కీలక వ్యాఖ్యలు చేశారు. ఉస్మానియా ఆసుపత్రి విషయంలో చొరవ చూపిన కోర్టును అభినందిస్తున్నట్లు ఆమె చెప్పారు. ఆసుపత్రిలోని టాయిలెట్లు పరిశీలించానని చాలా అపరిశుభ్రంగా ఉన్నాయని అన్నారు. ఉస్మానియాకు రోజుకు 2 వేల మంది ఔట్‌ పేషెంట్లు వస్తున్నారని, ఆసుపత్రి పైకప్పు పెచ్చులు ఊడి రోగులు బాధపడుతున్నారని అన్నారు. ఈ ఆస్పత్రిలో దాదాపు రోజుకు 200 దాకా ఆపరేషన్లు జరుగుతున్నాయని అన్నారు. వందల ఏళ్లనాటి భవనం కాబట్టి, కొన్ని చోట్ల పెచ్చులు ఊడుతున్నాయని అన్నారు.


జనరల్‌ వార్డులో కొన్ని ఫ్యాన్లు మాత్రమే పనిచేస్తున్నాయని, ఎండ వేడి తట్టుకోలేకపోతున్నామని రోగులు చెబుతున్నారని గుర్తు చేశారు. కొత్త భవనం కట్టాల్సిన అవసరం ఉందని బచెప్పారు. తాను ఎవరినీ తప్పుబట్టేందుకు ఉస్మానియా ఆసుపత్రికి రాలేదని, రాజకీయ కోణంలో అస్సలు రాలేదని తమిళిసై అన్నారు. తనపై విమర్శలు చేయడంలో పెట్టే శ్రద్ధ కొత్త భవనం కట్టడంలో ఉండాలని కోరారు.


ఆకస్మిక తనిఖీ


నేడు గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ఉ స్మానియా ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉస్మానియా పురాతన భవనమైన కులి కుతుబ్ షా బ్లాక్ ను పరిశీలించారు. ఆస్పత్రిలో ఆవరణలోని మరుగుదొడ్డి వద్దకు వెళ్లి అక్కడ వచ్చే దుర్గంధం తీరును పరిశీలించారు. ముక్కు మూసుకునే అంతా పరిశీలించారు. అనంతరం సిబ్బందితో మాట్లాడుతూ.. ఇక్కడ ఎలా ఉంటున్నారంటూ ప్రశ్నించారు.  మీడియాతో మాట్లాడిన గవర్నర్.. ఉస్మానియా ఆస్పత్రి పరిశీలనకు వచ్చి రోగులు పడుతున్న ఇబ్బందుల గురించి వారినే అడిగి తెలుసుకున్నట్లు చెప్పారు. కాగా, రాష్ట్ర గవర్నర్ ఉస్మానియా ఆస్పత్రి తనిఖీకి వచ్చినప్పుడు ఆస్పత్రి సూపరింటెండెంట్ అందుబాటులో లేరు. రాష్ట్ర సచివాలయంలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ఆధ్వర్యంలో జరిగిన సమీక్షా సమావేశానికి ఆస్పత్రి సూపరింటెండెంట్ వెళ్లినట్లు సిబ్బంది తెలిపారు. 


ఇటీవలే ట్విటర్‌లో ఉస్మానియా వ్యవహారం


ఇటీవల ఉస్మానియా ఆస్పత్రి నూతన భవన నిర్మాణం చేపట్టాలని కోరుతూ గవర్నర్ ట్విట్టర్ లో పేర్కొన్న సంగతి తెలిసిందే. ఉస్మానియా ఆస్పత్రి నూతన భవన నిర్మాణానికి సంబంధించి గతంలో రాష్ట్ర సర్కారు ఇచ్చిన హామీలను నిలుపుకోవాలంటూ 'జస్టిస్ ఫర్ OGH' పేరుతో ఉన్న ఓ ట్విట్టర్ ఖాతా పోస్టును గవర్నర్ రీట్వీట్ చేశారు. 


గవర్నర్ vs గవర్నమెంట్


'జస్టిస్ ఫర్ OGH' చేసిన ట్వీట్ ను గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ రీట్వీట్ చేస్తూ ఆస్పత్రి దుస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. ఎంతో మందికి అత్యంత మెరుగైన వైద్య సేవలు అందించిన చరిత్ర ఉస్మానియా ఆస్పత్రికి ఉందని పేర్కొన్నారు. ఆస్పత్రి కొత్త బిల్డింగ్ నిర్మాణాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని గవర్నర్ ప్రభుత్వాన్ని కోరారు. ఉస్మానియా దుస్థితి చూడటం బాధాకరమని వ్యాఖ్యానించారు.


దీనిపై స్పందించిన రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు.. ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఆస్పత్రి అంశం కోర్టు పరిధిలో ఉండటం వల్లే ప్రస్తుతానికి సైలెంట్ గా ఉన్నామని మంత్రి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో గవర్నర్ తమిళిసై ఉస్మానియా ఆస్పత్రిని తనిఖీ చేయడం కీలకంగా మారింది.