Raghunandan Rao Comments: పార్టీకి వ్యతిరేకంగా అసహన వ్యాఖ్యలు చేసినట్లుగా మీడియాలో వస్తున్న వార్తలను దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఖండించారు. తాను అన్నట్లుగా కొన్ని మీడియా సంస్థలే ఇలాంటి ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. తాను పార్టీకి సంబంధించి ఎలాంటి వ్యతిరేక వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు. తాను పార్టీ నాయకత్వాన్ని కానీ, అధ్యక్షుడ్ని గానీ ధిక్కరించబోనని చెప్పారు. బీజేపీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా తాను కట్టుబడే ఉంటానని చెప్పుకొచ్చారు. ఢిల్లీలో తాను ప్రెస్‌ మీట్‌ పెట్టలేదని, పార్టీ కోసం తాను పదేళ్లుగా పని చేస్తున్నందున కీలకమైన పదవి ఇవ్వాలని డిమాండ్‌ చేసినట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని అన్నారు. అయితే పార్టీలో పదవులు కోరుకోవడం తప్పుకాదన్నారు. గత రెండు నెలలుగా దుబ్బాక నియోజకవర్గంలోనే ఉన్నానని, అక్కడ నిధులు కోసం వచ్చానని రఘునందన్‌ చెప్పారు.


నేడు (జూలై 3) ఉదయం నుంచి రఘునందన్ రావు అన్నట్లుగా కొన్ని వార్తలు వచ్చాయి. ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్ లో ఆయన ఆ మాటలు అన్నట్లుగా అన్ని మీడియా సంస్థలు వార్తలు వేశాయి. తాను పదేళ్ల నుంచి పార్టీ కోసం కష్టపడుతుంటే తనను పట్టించుకోవడం లేదంటూ స్వరం పెంచారు. ఏకంగా ప్రస్తుత తెలంగాణ బీజేపీ రాష్ట్ర అద్యక్షుడు బండి సంజయ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో బీజేపీ అధ్యక్షుడు మారిపోతున్నాడంటూ మీడియాలో వస్తున్న వార్తలు నిజమేనని అన్నారు. వంద కోట్లు ఖర్చు పెట్టినా మునుగోడులో బీజేపీ గెలవలేదని, అదే వంద కోట్లు తనకిస్తే తెలంగాణను దున్నేసేవాడినని అన్నట్లుగా వార్తలు వచ్చాయి.


Telangana BJP: తెలంగాణ బీజేపీలో కీలక మార్పులు
తెలంగాణ బీజేపీలో కీలక మార్పులు జరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తున్న సంగతి తెలిసిందే. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై ఊహగానాలు, అనూహ్యంగా మంత్రి వర్గంతో ప్రధాని భేటీ జరుగుతున్న టైంలోనే బండి సంజయ్‌కు ఢిల్లీ నుంచి పిలుపువచ్చింది. ప్రస్తుతం ముంబయిలో ఉన్న తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ హుటాహుటిన ఢిల్లీ వెళ్లారు. 


ప్రైవేటు మీటింగ్
ఢిల్లీ పిలిచిన అధినాయకత్వం నేరుగా ప్రైవేట్ మీటింగ్ ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. ఎప్పుడైనా రాష్ట్ర అధ్యక్షులు కానీ, వేరే సీనియర్ నేతలు కానీ ఢిల్లీ వెళ్తే పార్టీ కేంద్రకార్యాలయానికి వెళ్తారు. కానీ ఈసారీ బండిని పిలిచిన అధినాయకత్వం ఓ ప్రైవేటు మీటింగ్ పెట్టిన సమాచారం అందుతోంది. ఆయన్ని కేంద్రమంత్రి పదవి కానీ, జాతీయ నాయకత్వంలో చోటు కాని కల్పిస్తారని ప్రచారం జరుగుతోంది. ఇంతలో ఆయన్ని ఢిల్లీ పిలిపించడంపై అందరిలో ఉత్కంఠ నెలకొంది. 


ఆదివారమే స్పష్టత
తెలంగాణకు కొత్త అధ్యక్షుడు రాబోతున్నాడనేది ఆదివారమే స్పష్టమైంది. హన్మకొండలో పార్టీ కార్యకర్తలు, సీనియర్ నేతలతో మాట్లాడుతూ.. 8న జరిగే ప్రధాని మీటింగ్‌కు తాను అధ్యక్ష హోదాలో హాజరు అవుతానో కాదో అని అనుమానం వ్యక్తం చేశారు. అప్పుడే కీలక మార్పులు జరగబోతున్నాయని అందరికీ క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడు బండి సంజయ్‌ను ఢిల్లీ పిలవడంతో ఆయన్ని తప్పించి వేరే వాళ్లకు అవకాశం ఇవ్వబోతున్నారని కూడా స్పష్టమవుతోంది.