CM Stalin Hospitalised: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆస్పత్రిలో చేరారు. జీర్ణకోశ వ్యాధి కారణంగా ఆయన క్రీమ్స్ రోడ్డులోని అపోలో ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం. ముఖ్యమంత్రి స్టాలిన్ కు వైద్యులు ఎండోస్కోపీ చికిత్స అందిస్తున్నారని, చికిత్స అనంతరం రేపు (జులై 4వ తేదీ) మంగళవారం ఉదయం డిశ్చార్జ్ చేస్తారని తెలుస్తోంది. రెగ్యులర్ చెకప్ లో భాగంగా సీఎం స్టాలిన్ తమ ఆస్పత్రిలో చేరారని అపోలో హాస్పిటల్ ఓ ప్రకటనలో పేర్కొంది. 




ఇవాళ ఉదయమే ముఖ్యమంత్రి స్టాలిన్ ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కు ఫోన్ చేసి మాట్లాడారు. ఎన్సీపీకి 53 మంది ఎమ్మెల్యేలు, తొమ్మిది మంది ఎమ్మెల్సీలు ఉండగా.. వారిలో అజిత్ పవార్ సహా తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఏకనాథ్ షిండే ప్రభుత్వంలో చేరిన విషయం తెలిసిందే. మహారాష్ట్రా రాజకీయాల్లో పెను సంచలనంగా మారిన ఈ వ్యవహారంపై మాట్లాడేందుకు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కు స్టాలిన్ ఫోన్ చేసి మాట్లాడారు. ఈ అంశంలో స్టాలిన్ ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కే తన మద్దతు ఇచ్చినట్లు తమిళనాడు ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది.


మహారాష్ట్ర రాజకీయాల్లో రెండేళ్లలో చాలా మార్పులొచ్చాయి. ఏక్‌నాథ్ షిండే తిరుగుబాటుతో ప్రభుత్వం మారిపోయింది. అప్పటికే మహారాష్ట్ వికాస్ అఘాడి చీలిపోవడం మొదలైంది. ఇప్పుడు అజిత్ పవార్‌ తిరుగుబాటుతో పూర్తిగా కుప్ప కూలిపోయింది. ఇది ఊహించని మలుపు అందరూ అనుకుంటున్నప్పటికీ.. దాదాపు ఏడాదిగా సీక్రెట్‌గా చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది. షిండే తో పాటు బీజేపీతోనూ అనేక చర్చల తరవాత పక్కా ప్లాన్ ప్రకారం.. అజిత్ పవార్ NCP నుంచి బయటకు వచ్చేశారు. షిండే ప్రభుత్వంలో చేరి డిప్యుటీ సీఎం బాధ్యతలు చేపట్టారు.