Maharashtra NCP Crisis:
బీజేపీ వాషింగ్ మెషీన్..
మహారాష్ట్రలో జరిగిన రాజకీయ పరిణామాలకు బీజేపీయే కారణమని కాంగ్రెస్ తీవ్రంగా విమర్శిస్తోంది. రెండ్రోజుల క్రితమే ప్రధాని మోదీ NCP ఓ అవినీతి పార్టీ అని చెప్పి...ఆ పార్టీ నేతలనే ప్రభుత్వంలోకి చేర్చుకున్నారని మండి పడుతోంది. ఇప్పుడు ఆ విమర్శల డోస్‌ని పెంచింది. ఈ సారి చాలా సెటైరికల్‌గా సోషల్ మీడియాలో ప్రచారం మొదలు పెట్టింది. బీజేపీని "వాషింగ్ మెషీన్" అంటూ ప్రచారం చేస్తోంది. కేంద్ర దర్యాప్తు సంస్థల్ని డిటర్జెంట్‌లుగా వాడుకుంటోందని వరుస పోస్ట్‌లతో విరుచుకు పడుతోంది. కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ట్విటర్‌లో ఈ పోస్ట్‌లు చేశారు.
"ముంబయిలో మరోసారి BJP వాషింగ్ మిషన్ ఆన్ అయింది. అందులో ICE (Incometax, CBI, ED) డిటర్జెంట్‌లు వేశారు. ఇది మోదీ వాషింగ్ పౌడర్. క్షణాల్లోనే అన్ని మరకలూ వదిలిపోతాయి. ప్రతిపక్షాల్లో చీలికలు తీసుకురావాలని కుట్రలు చేస్తున్నారు. జులై 17,18 వ తేదీల్లో కాంగ్రెస్ నేతృత్వంలో మరోసారి విపక్షాలు సమావేశం కానున్నాయి. బీజేపీ చేపట్టే ఆపరేషన్‌లన్నీ విపక్షాలను మరింత బలోపేతం చేసేవే"
- జైరాం రమేశ్, కాంగ్రెస్ సీనియర్ నేత
అంతకు ముందు మార్చి నెలలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇదే తరహాలో బీజేపీపై సెటైర్లు వేశారు. బీజేపీని వాషింగ్ మెషీన్‌తో పోల్చారు. నల్ల దుస్తులు అందులో వేసి పక్క నుంచి తెల్లటి దుస్తులు తీశారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్లెవరైనా బీజేపీలో చేరితే వారిపై ఉన్న కేసులన్నీ పోయి క్లీన్‌గా మారిపోతారని ఇలా సింబాలిక్‌గా చూపించారు మమతా బెనర్జీ.