భారతీయులు కూరల్లో ఎక్కువగా వేసుకునే మసాలా పదార్థం వెల్లుల్లి. చాలా మంది తప్పనిసరిగా ప్రతి కూరలో కనీసం రెండు వెల్లుల్లి రెబ్బలు అయినా వేసుకుంటారు. ఇది డిష్ కి మంచి రుచిని ఇస్తుంది. ఎన్నో ఔషధ గుణాలు కలిగిన దీని వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారు. వెల్లుల్లిలోని సల్ఫర్ సమ్మేళనాలు ఆరోగ్యంగా ఉండేందుకు సహకరిస్తాయని నిపుణులు అంటున్నారు. రోగనిరోధక శక్తి నుంచి కొవ్వు కరిగించే వరకు అన్ని విధాలుగా వెల్లుల్లి సహాయపడుతుంది. జలుబు, దగ్గుగా ఉన్నప్పుడు కాసింత అల్లం, వెల్లుల్లి వేసుకుని చేసిన సూప్ చేసుకుని తాగితే రిలీఫ్ వస్తుంది.


కొలెస్ట్రాల్ ని ఎలా తగ్గిస్తుంది


కొలెస్ట్రాల్ తగ్గించడంలో వెల్లుల్లి క్రియాశీలక పాత్ర పోషిస్తుందని అనేక అధ్యయనాలు నిరూపిస్తున్నాయి. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ లో ప్రచురించిన పరిశోధన ప్రకారం వెల్లుల్లిలో థియో సల్ఫినైట్ రసాయనాలు ఉన్నాయి. వెల్లుల్లి తొక్క తీసి కట్ చేసేటప్పుడు అది అల్లిసిన్ గా మారిపోతుంది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. వెల్లుల్లిలో రకాలు కూడా ఉంటాయి. ఒక్కొక్క రకాన్ని బట్టి ఒక్కో విధంగా కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. అల్లిసిన్ వల్ల ప్రయోజనాలు..


☀ చెడు కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది


☀ రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది


☀ రక్తపోటును అదుపులో ఉంచుతుంది.


కొలెస్ట్రాల్ ని తగ్గించే వెల్లుల్లిలోని ఉత్తమ రకాలు


నలుపు వెల్లుల్లి: డార్క్ బ్రౌన్ లేదా నలుపు రంగులో లభిస్తాయి. వీటిలోని అధిక తేమ వల్ల ఎక్కువ రోజులు ఉంటాయి.


క్యోలిక్ వెల్లుల్లి: దీన్ని చాలా తక్కువ వేడిలో వండుతారు. దాదాపు రెండు సంవత్సరాల వరకు నిల్వ ఉంటుంది.


పచ్చి వెల్లుల్లి: ఎక్కువగా ఇళ్ళల్లో ఉపయోగించేవి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో పచ్చి వెల్లుల్లి తింటే ఆరోగ్యానికి మేలు చేస్తుంది.


వెల్లుల్లి నూనె: వెల్లుల్లిని ముక్కలు చేసి ఆవిరితో ఈ నూనె తయారుచేస్తారు.


ఒక అధ్యయనం ప్రకారం బ్లాక్ వెల్లుల్లి చెడు కొలెస్ట్రాల్ ని బాగా తగ్గిస్తుంది. అలాగే మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది. ఈ అధ్యయనంలో పాల్గొన్న వాళ్ళు 4 నుంచి 12 వారాల పాటు 300 మిల్లీ గ్రాములు లేదా 6 గ్రాముల నల్ల వెల్లుల్లిని రోజుకి రెండు సార్లు తీసుకున్నారు. వెల్లుల్లి తీసుకున్న తరవాత వారిలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గినట్టు పరిశోధకులు గుర్తించారు.


వెల్లుల్లి వల్ల ప్రయోజనాలు


రోగనిరోధక శక్తి పెరుగుతుంది: అనారోగ్యాలు, ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడటంలో సహాయపడుతుంది. జలుబు, ఫ్లూ వైరస్ ని నిరోధిస్తుంది.


క్యాన్సర్ నివారిస్తుంది: వివిధ అధ్యయనాల ప్రకారం తాజా వెల్లుల్లి తినడం వల్ల పెద్ద పేగు క్యాన్సర్ ప్రమాదాన్ని 35 శాతం తగ్గించుకోవచ్చు.


యాంటీబయాటిక్: ఇందులోని అల్లిసిన్ కారణంగా వెల్లుల్లి యాంటీ బయాటిక్ గా పని చేస్తుంది. ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది.


మెదడుకి మంచిది: వెల్లుల్లి అల్జీమర్స్, డీమెన్షియా వంటి వ్యాధులని నివారిస్తుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్ ఆక్సీకరణ గుణాలు ఆరోగ్యకరమైన శరీర కణాల పెరుగుదలకు దోహదపడతాయి.


వెల్లుల్లి వల్ల దుష్ప్రభావాలు


దీర్ఘకాలంలో గుండె ఆరోగ్యానికి వెల్లుల్లి మేలు చేస్తాయని పలు అధ్యయనాలు చెబుతున్నప్పటికి దీని వల్ల దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి. వెల్లుల్లి తీసుకుంటే కొంతమంది ఈ ఇబ్బందులు ఎదుర్కొంటారు.


⦿ గుండెల్లో మంట, ఎసిడిటీ


⦿ నోటి దుర్వాసన


⦿ కడుపు ఉబ్బరం, నొప్పి


⦿ రక్తం గడ్డకట్టకుండా చేస్తుంది


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.


Also Read: అతిగా యోగా చేస్తున్నారా? ఎంత ప్రమాదకరమో తెలుసా?