Curd Benefits : పెరుగులో ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. అందుకో రోజుకో కప్పు పెరుగు తినాలని వైద్యులు చెబుతుంటారు. అయితే చాలా మంది జలుబు, దగ్గు వేధిస్తాయని చలికాలంలో పెరుగు తినేందుకు ఇష్టపడరు. చలికాలంలో పెరుగు తినడం ఆరోగ్యానికి ఎంతవరకు మంచిది. దీనిపై నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం. 


పెరుగు పోషకాలమయం


పెరుగులో ముఖ్యంగా కాల్షియం, విటమిన్ బి2, పొటాషియం, మెగ్నీషియం వంటి ఎన్నో పోషకాలు ఉన్నాయి. అంతేకాదు పెరుగు అద్భుతమైన ప్రొబయోటిక్ కూడా. పెరుగు తింటే శరీరంలో వేడి చేసే అవకాశం ఉండదు. దీంతో కడుపు ఆరోగ్యంగా ఉంటుంది. అంతేకాదు ఇది మనం ఆరోగ్యంగా ఉండేందుకు ఎంతగానో సహాయపడుతుంది. అయితే పెరుగులో చలువ చేసే గుణాలున్నాయన్న సంగతి అందరికీ తెలిసిందే. అందుకే పెరుగును ఎండాకాలంలో ఎక్కువగా తినేందుకు ఆసక్తి  చూపిస్తారు. మజ్జిగను తాగుతారు. ఇది శరీరంలో వేడిని తగ్గేలా చేస్తుంది. కానీ చలికాలంలో చాలా మంది పెరుగును దూరం పెడతారు. ఎందుకంటే జలుబు, దగ్గు వస్తుందని శరీరం వేడి తగ్గించి చలిని పెంచుతుందని భావిస్తారు. 


చలికాలంలో తినొచ్చా?


పెరుగును చలికాలంలో కూడా తినొచ్చు. చలికాలంలో పెరుగు తింటే ఇమ్యూనిటీ పెరుగుతుంది. రోజూ పెరుగును తినడం వల్ల మన జీర్ణక్రియ మెరుగుపడుతుంది. కడుపునొప్పి తగ్గుతుందట. ఎసిడిటి సమస్య వచ్చే ఛాన్స్ కూడా ఉండదట. ఇక ప్రోబయోటిక్ కావడంతో పెరుగులో మంచి బ్యాక్టీరియా కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది మన గట్ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. రోజూ పెరుగును తింటే మన రోగనిరోధకశక్తి పెరుగుతుంది.


ఎవరు తినకూడదు?


జలుబు, తుమ్ములు వంటి అలెర్జీ వ్యాధుల నుంచి కూడా పెరుగు మిమ్మల్ని కాపాడుతుంది. పెరుగులో ఉండే జింక్ జలుబు లక్షణాలను తగ్గిస్తుందని ఓ పరిశోధనలో తేలింది. 75 మిల్లీ గ్రాముల 8 ఔన్సుల కప్పు పెరుగులో 2 మిల్లీగ్రాముల కంటే ఎక్కువ జింక్ ఉంటుంది. ఇది జీర్ణశక్తితోపాటు రోగనిరోధశక్తిని పెంచడంలో సహాపడుతుంది. మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అయితే దగ్గు, జలుబు, ఆస్తమాతో బాధపడేవారు ఈ కాలంలో పెరుగును మితంగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. 


ఎప్పుడు తింటే మంచిది?


శీతాకాలంలో జలుబు, దగ్గు వేధిస్తుందని భయపడేవారు.. పెరుగును సాయంత్రం 5 గంటలలోపే మాత్రమే తీసుకోవాలని చెబుతున్నారు. రాత్రిపూట చల్లటి పెరుగు తినడం వల్ల శ్లేష్మం ఏర్పడుతుంది. అలర్జీలు, ఆస్తమాతో బాధపడేవారు రాత్రిపూట పెరుగు తినకపోవడమే మంచిదని అంటున్నారు. మొత్తానికి శీతాకాలంలో పెరుగు తినడం పూర్తిగా సురక్షితమైనదని.. ఆరోగ్యకరమైనదని నిపుణులు చెబుతున్నారు. 


పెరుగు వల్ల కలిగే మరిన్ని ప్రయోజనాలు ఇవే


ఇక పెరుగులో ఉండే కాల్షియం మన ఎముకలు, దంతాలు ఆరోగ్యంగా, బలంగా ఉంచేలా చేస్తుంది. పెరుగులో పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ ఖనిజాలు అధిక రక్తపోటును నియంత్రిస్తాయి. రోజూ పెరుగును తినడం వల్ల షుగర్ పేషంట్లకు చాలా మంచింది. పెరుగు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడుతుంది. పెరుగు తినడం వల్ల కేలరీల వినియోగం కూడా తగ్గుతుంది. మీరు బరువును తగ్గాలనుకుంటే మీకు పెరుగు సహాయపడుతుంది. చర్మ ఆరోగ్యానికి కూడా పెరుగు ఎంతో మేలు చేస్తుంది. 


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఈ ఆహారాలు, పానీయాలు మీకు అలర్జీ లేదా ఇతరాత్ర అనారోగ్యాలకు దారితీయొచ్చు. కాబట్టి, ఆహారం, ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.