గుడ్డు ఆరోగ్యకరమైన ఆహారం. అయితే గుండెకు మాత్రం మంచిది కాదని ఒక అభిప్రాయం ఉంది. దీనిలో కొలెస్ట్రాల్ నిండుగా ఉంటుంది. అధికంగా శరీరంలో చేరితే గుండెను నిశ్శబ్దంగా చంపేస్తుందని చెబుతారు. అందుకే గుడ్లు తినడం మానేయాలని చెప్పే వాళ్ళు ఉన్నారు. ఇది ఎంతవరకు నిజం.
గుడ్డులో చెడు కొలెస్ట్రాల్ ఉంటుందా?
గుడ్డులో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుందనేది నిజం. కేవలం కొలెస్ట్రాల్ మాత్రమే కాదు, మన శరీరానికి అత్యవసరమైన ఎన్నో విటమిన్లు, ఖనిజాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా పుష్కలంగా ఉంటాయి. గుడ్డులో క్యాల్షియం, పొటాషియం, మెగ్నీషియం సమృద్ధిగా ఉంటాయి. మితంగా సోడియం కూడా ఉంటుంది. అలాగే రాగి, అయోడిన్, ఐరన్, మాంగనీస్, సెలీనియం, జింక్ లభిస్తాయి. అందుకే గుడ్లను పోషకాహారంగా చెబుతారు. దీనిలో చెడు కొలెస్ట్రాల్ ఉంటుందనేది మాత్రం నిజం కాదు.
రోజుకు ఎన్ని తినాలి?
శరీరానికి అవసరమైన పోషకాలను అందించడానికి రోజుకో గుడ్డు తింటే సరిపోతుంది అని ఎన్నో అధ్యయనాలు చెప్పాయి. ఒక రోజులో ఎక్కువ గుడ్లు తినడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోయే ప్రమాదం ఉంది. కాబట్టి రోజుకు ఒక గుడ్డు తినడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాహారం అందడంతో పాటు కొలెస్ట్రాల్ పేరుకుపోయే ప్రమాదం ఉండదు. అయితే గుడ్డును చీజ్, బేకన్, మెఫిన్, ఎగ్ పఫ్ ఇలాంటి రూపంలోకి మార్చుకొని తింటే మాత్రం సంతృప్త కొవ్వులు అధికంగా శరీరంలో చేరే అవకాశం ఉందని హార్వర్డ్ ఆరోగ్య నివేదిక చెబుతుంది. కాబట్టి గుడ్డును కేవలం గుడ్డుగానే తినాలి. అంటే ఉడకబెట్టిన ఒక గుడ్డును, వేరే పదార్థాలు చేర్చకుండా తినడం వల్ల ఎక్కువ కొలెస్ట్రాల్ ఆహారంలో చేరదు.
వారానికి ఎన్ని?
బోస్టన్ యూనివర్సిటీ కి చెందిన పరిశోధకులు చేసిన ఒక అధ్యయనంలో వారానికి ఐదు గుడ్లు తింటే సరిపోతుందని తెలింది. ఇలా మితంగా గుడ్లు తినడం వల్ల రక్తపోటు, బ్లడ్ షుగర్, డయాబెటిస్ వచ్చే అవకాశం తగ్గుతుందని అధ్యయనం చెబుతోంది. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ చెబుతున్న ప్రకారం ఒక గుడ్డు 78 క్యాలరీలను అందిస్తుంది. అలాగే ఆరు గ్రాముల ప్రోటీన్ ను కూడా ఇస్తుంది.
మీరు ఇప్పటికే కొలెస్ట్రాల్ ఉంటే?
కొంతమంది ఊబకాయంతో బాధపడుతూ ఉంటారు. వారి శరీరంలో అప్పటికే అధిక కొలెస్ట్రాల్ ఉంటుంది. ఇలాంటివారు గుడ్డును తినవచ్చా అనే అనుమానం కూడా ఉంది. అధిక బరువు, ఊబకాయం, అధిక కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడుతున్న వారు గుడ్డులోని పచ్చసొనను తీసేసి, కేవలం బయట తెల్ల సొన మాత్రమే తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
ఎలా తింటే మంచిది?
వండే పద్ధతి కూడా ఆహారంలోని పోషకాలను నిర్ణయిస్తుంది. అంటే ఉడికించిన గుడ్లు తినడం వల్ల పోషకాలు అధికంగా బయటికి పోవు, ఆరోగ్యకరం కూడా. అలా కాకుండా నూనె వేసి చేసే ఆమ్లెట్లు, ఖీమాలాంటి వాటిని తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు తగ్గుతాయి. కాబట్టి రోజుకు ఒక ఉడికించిన గుడ్డును తినడం వల్ల ప్రయోజనాలు ఎక్కువ.
Also read: రూ.99 చెల్లిస్తే కోపం తీర్చుకునేందుకు ఏవైనా పగలగొట్టొచ్చు - అదే ఈ రేజ్ రూమ్ ప్రత్యేకత
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.