IND vs AUS, 1st Test Live:  నిరీక్షణకు తెర పడింది. బోర్డర్- గావస్కర్ ట్రోఫీకి తెర లేచింది. క్రికెట్ ప్రియులు ఎప్పట్నుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్- ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ కు సమయం ఆసన్నమైంది. నాగ్ పుర్ వేదికగా నేడే ఈ రెండు జట్ల మధ్య తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. సమఉజ్జీల పోరుగా భావిస్తున్న ఈ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగుతుందనడంలో సందేహం లేదు. ఉదయం 9.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. 


భారత్- తుది జట్టులో ఎవరుంటారు!


ప్రస్తుతం టీమిండియా జట్టు ఆస్ట్రేలియాకు సమానంగానే కనిపిస్తోంది. స్టార్లు, కుర్రాళ్లు, అనుభవజ్ఞులతో జట్టు సమతుల్యంగా ఉంది. అయితే తుది జట్టు కూర్పే భారత్ ను కలవరపెడుతోంది. ఒక్కో స్థానానికి ఒకరికి మించి ఆటగాళ్లు అందుబాటులో ఉండటంతో ప్లేయింగ్ ఎలెవన్ లో ఎవరిని ఎంచుకోవాలనేది సమస్యగా మారింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, ఛతేశ్వర్ పుజారా, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్ వీరు ఏడుగురు జట్టులో ఉండడం ఖాయమే. అయితే మిగిలిన 4 స్థానాల కోసం ఎవరిని తీసుకోవాలనేది కెప్టెన్ రోహిత్ కు తలనొప్పే. వికెట్ కీపర్ గా భరత్, ఇషాన్ లు అందుబాటులో ఉన్నారు. శ్రేయస్ అయ్యర్ గాయంతో ఖాళీ అయిన స్థానానికి శుభ్ మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ లు పోటీలో ఉన్నారు. స్పిన్నర్ కోటాలో అక్షర్, కుల్దీప్ యాదవ్ లు పోటీ పడుతున్నారు. మరి వీరిలో తుది జట్టులో ఎవరుంటారో రేపు తేలనుంది. 


ఇక ప్రదర్శన విషయానికొస్తే రోహిత్, పుజారా, కోహ్లీ, గిల్, రాహుల్ లతో బ్యాటింగ్ విభాగం పటిష్టంగా ఉంది. ఇక బౌలింగ్ లో అశ్విన్, జడేజాలు స్పిన్ తో మాయ చేయగలరు. వీరిద్దరికీ తోడు అక్షర్ కానీ, కుల్దీప్ కాని తుది జట్టులో ఉండనున్నారు. ఎక్కువగా స్పిన్ పిచ్ లు ఎదురవుతాయి కాబట్టి పేసర్లకు అంతగా పని ఉండకపోవచ్చు. ఏదేమైనా సరైన తుది జట్టును ఎంచుకోవడంలోనే భారత్ విజయం ఆధారపడి ఉంది. 


భీకరంగా ఆస్ట్రేలియా


2004 తర్వాత ఆస్ట్రేలియాకు భారత్ లో టెస్ట్ సిరీస్ విజయం దక్కలేదు. గత రెండు పర్యాయాలు ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా బోర్డర్- గావస్కర్ ట్రోఫీని అందుకుంది. అందుకే ఈసారి ఎలాగైనా భారత్ ను ఓడించి సిరీస్ ను దక్కించుకోవాలని ఆసీస్ భావిస్తోంది. అందుకు తగ్గట్లే 2021-23 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ సైకిల్ లో నిలకడగా విజయాలు సాధిస్తూ.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోనూ నిలిచింది. ఇప్పుడు టీమిండియాపై పైచేయి సాధించేందుకు అన్ని రకాలుగా సిద్ధమై వచ్చింది. భారత్ అంటే స్పిన్ పిచ్ లే ఎదురవుతాయన్న అంచనాలతో నెట్స్ లో విపరీతంగా సాధన చేస్తున్నారు ఆ జట్టు ఆటగాళ్లు. అంతేకాదు టీంలోనూ నలుగురు స్పెషలిస్ట్ స్పిన్నర్లకు చోటిచ్చింది ఆసీస్ జట్టు. ఇక బ్యాటింగ్ లో ఆ జట్టు పటిష్టంగా కనిపిస్తోంది. సీనియర్లు స్మిత్, వార్నర్ లు మంచి ఫాంలో ఉన్నారు. ఉస్మాన్ ఖవాజా తన కెరీర్ లోనే అత్యంత భీకరమైన ఫాంలో కనిపిస్తున్నాడు. మార్నస్ లబుషేన్ టెస్టుల్లో నెంబర్ వన్ బ్యాటర్. ఇక ఆల్ రౌండర్లు ఆ జట్టుకు అదనపు బలం. కాబట్టి టీమిండియా ఆసీస్ తో జాగ్రతగా ఉండాల్సిందే.


భారత్ తుది జట్టు (అంచనా)


రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ లేదా శుభ్ మన్ గిల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, మహమ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్. 


ఆస్ట్రేలియా తుది జట్టు (అంచనా)


డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబూషేన్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, పీటర్ హ్యాండ్‌స్కాంబ్/మాట్ రెన్‌షా, అలెక్స్ కారీ, పాట్ కమిన్స్ (కెప్టెన్), ఆస్టన్ అగర్, స్కాట్ బోలాండ్, నాథన్ లియాన్.