ఆధునిక జీవితంలో ఒత్తిళ్లు పెరిగిపోయాయి. దాని కారణంగా కోపం, చిరాకు కూడా పెరిగిపోతున్నాయి. అలా కోపంగా ఉన్నప్పుడు ఏదైనా విసిరి కొట్టేయాలనిపిస్తుంది. కానీ మన ఇంట్లో వస్తువులు పగలగొట్టుకుంటే మనకే నష్టం. పట్టరానంత కోపం వచ్చినప్పుడు ఏదైనా విసిరి కొట్టాలనిపిస్తే రేజ్ రూముకి వెళ్ళండి. ఇక్కడ మీరు మీ కోపాన్ని, లోపల దాగి ఉన్న ఒత్తిడిని వస్తువులను పగలగొట్టడం ద్వారా బయటికి పంపేయవచ్చు. ఈ రేజ్ రూమ్ బెంగళూరులో ఉంది. 18 ఏళ్ల వయసు దాటిన వాళ్ళు ఎవరైనా కూడా ఈ రూమ్ కి అర్హులే. ఈ గదిని వాడాలంటే... పాటించాల్సిన ఏకైక నియమం ‘స్వీయ భద్రత’. అంటే వస్తువులు పగలగొట్టవచ్చు గాని తమకి తాము ఎలాంటి హాని కలగకుండా చూసుకోవాలి. ఆ నియమం మీదే ఈ రేజ్ రూమ్‌లోకి అనుమతిస్తారు. దీన్ని యాంగర్ రూమ్, డిస్ట్రక్షన్ రూమ్, స్మాష్ రూమ్ అని కూడా పిలుస్తారు. మన దేశంలో బెంగళూరులో మొదటిసారి ఇలాంటి గదిని నిర్మించారు. అమెరికా, యూరోప్‌లో ఇలాంటి గదులు ఇప్పటికే ఎన్నో ఉన్నాయి.
ఎక్కడ ఉంది?
బెంగళూరులోని బసవన్న గుడి ప్రాంతంలో, సౌత్ అండ్ సర్కిల్ మెట్రో స్టేషన్ సమీపంలో, పట్టాలమ్మ టెంపుల్ రోడ్‌లో ఉంది ఈ రేజ్ రూమ్. దీనికి ఎక్కువగా ఐటీ ఉద్యోగులు వస్తూ ఉంటారు. వారికే కనిపించని ఒత్తిడి ఎక్కువ.
ధరలు ఎలా ఉంటాయి?
మీరు విసిరి కొట్టాలనే వస్తువును బట్టి ఇక్కడ ప్యాక్‌లు నిర్ణయించారు. ట్రయల్ ప్యాక్ రూ. 99 రూపాయలకే లభిస్తుంది. ఈ ప్యాక్‌లో రేజ్ రూమ్‌ని 5 నిమిషాల పాటు ఉపయోగించుకోవచ్చు. ఇందులో రెండు ధర్మకోల్ షీట్లను, మూడు మెటల్ షీట్లను విసిరి కొట్టొచ్చు.
అదే రూ. 2999 ప్యాక్‌ను మీరు ఎంచుకుంటే 15 నిమిషాల పాటు గదిలో ఉండొచ్చు. రెండు బీర్ సీసాలు, ఒక ఇటుక, నాలుగు ధర్మాకాల్ షీట్లు, మూడు మెటల్ వస్తువులను పగలగొట్టే అవకాశం ఉంది. అలాగే పంచింగ్ బ్యాగ్ కూడా కొట్టొచ్చు. ప్లాస్టిక్ బుల్లెట్లతో షూట్ చేయవచ్చు. టేబుల్ టెన్నిస్, సాఫ్ట్ బాల్ ఆడుకోవచ్చు. మీకు నచ్చిన సంగీతాన్ని కూడా వినవచ్చు.
ఇక రూ. 699 ప్యాక్‌లో 30 నిమిషాల పాటు రేజ్ రూముని వాడుకోవచ్చు. ఈ ప్యాక్ లో ఐదు బీరు సీసాలు, మూడు ఇటుకలు, రెండు ఫ్లై వుడ్ బోర్డులు, ఒక కార్డు బోర్డు బాక్స్, రెండు ప్లాస్టిక్ వస్తువులు, నాలుగు ధర్మకాల్ షీట్లు, మూడు మెటల్ వస్తువులను పగలగొట్టొచ్చు. పంచింగ్ బ్యాగ్ కొట్టే అవకాశం ఉంది.
రూ. 1499 ప్యాక్‌ను మీరు ఎంచుకుంటే అరగంట పాటు రేజ్ రూమ్‌లో ఉండొచ్చు. ఈ ప్లాన్‌లో పగలగొట్టే వస్తువుల సంఖ్య ఎక్కువగా ఉంటాయి. 10 బీర్ సీసాలు, ఆరు ఇటుకలు ఒక కుర్చీ లేదా టేబుల్, మూడు మట్టి కుండలు, ఒక ట్యూబు లైటు, రెండు ఫ్లై ఉడ్ బోర్డులు, ఒక కార్డు బోర్డు బాక్స్, రెండు ప్లాస్టిక్ వస్తువులు, నాలుగు ధర్మకోల్ షీట్లు, మూడు మెటల్ వస్తువులు విసిరి కొట్టొచ్చు.
అన్నిటికంటే ఖరీదైన ప్లాన్ రూ.2,999. ఈ ప్లాన్‌లో భాగంగా 45 నిమిషాల పాటు గదిలో ఉండొచ్చు. ఆ సమయంలో ఒక వాషింగ్ మిషన్, టీవీ, ఫ్రిజ్ లేదా మైక్రో ఓవెన్లలో ఏదో ఒకటి ఎంచుకోవచ్చు. అలాగే 10 బీరు సీసాలు, 6 ఇటుకలు, ఒక కుర్చీ లేదా టేబుల్, మూడు మట్టి కుండలు, ఒక ట్యూబ్ లైట్, రెండు ఫ్లై వుడ్ బోర్డులు, ఒక కార్డు బోర్డు బాక్స్, రెండు ప్లాస్టిక్ వస్తువులు, నాలుగు ధర్మకాల్ షీట్లు, మూడు మెటల్ వస్తువులు పగలగొట్టొచ్చు. పంచింగ్ బ్యాగ్ కూడా వాడుకోవచ్చు. అంతా అయ్యాక హాయిగా పడుకొని సంగీతాన్ని వినవచ్చు. విపరీతమైన ఒత్తిడి, కోపంలో ఉన్న వారికే ఈ ప్లాన్ అవసరం పడుతుంది.
స్నేహితులతో కలిసి గ్రూప్ బుకింగ్ కూడా చేసుకోవచ్చు. అలా గ్రూప్ బుకింగ్ చేసుకుంటే 10% తగ్గింపు కూడా ఉంటుంది.
రేజ్ రూమ్‌లో వస్తువులను విసిరి కొడుతున్నప్పుడు స్వీయ రక్షణ కూడా చాలా ముఖ్యం. అందుకే ఒకవేళ విసిరి కొట్టిన వస్తువు ముక్కలు తగిలిన ఎలాంటి గాయాలు కాకుండా రక్షణ పరికరాలు ఇస్తారు. వాటిని కచ్చితంగా వాడాల్సిందే, అలాగే ముందుగా తమకు ఏం జరిగినా రేజ్ రూమ్ వారికి ఏం సంబంధం లేదని సంతకం చేయాల్సి ఉంటుంది.
మీకు ఈ రేజ్ రూమ్ చూడాలనిపిస్తే, వాడాలనిపించినా rageroombangalore.comలో మీ ప్యాకేజీని ఎంచుకోవాలి. టైమ్ స్లాట్ బుక్ చేసుకోవాలి. ఎవరైనా సరే ముందుగా వెబ్ సైట్లో బుక్ చేసుకుంటేనే స్లాట్ దొరుకుతుంది. నేరుగా రూమ్ కి వెళ్లి ప్లాన్ కొనే అవకాశం ఉండదు.
Also read: ఈ జ్యూసు రోజుకో గ్లాసు తాగితే శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గడం ఖాయం