World Forest Day : అడవి మనిషిని తల్లి అర్థం కాలేదు అని ఓ సినిమాలో హీరో చెప్పినట్లు.. నిజంగా మనమంతా అడవి మనుషులమే. ఆ అడవి తల్లి నుంచి ఎన్నో ప్రయోజనాలు పొందుతూ.. ఆరోగ్యాన్ని సంరక్షించుకుంటూ.. మనం ముందుకు వెళ్తున్నాం. అందుకే అడవుల ప్రాముఖ్యత గురించి చెప్తూ.. ప్రతి సంవత్సరం మార్చి 21వ తేదీన ప్రపంచ అటవీ దినోత్సవం (International Day of Forest)నిర్వహిస్తున్నారు. చెట్ల పెంపకం, అడవుల నరికివేతను అడ్డుకోవడం వంటి కార్యక్రమాలపై అవగాహన కల్పిస్తూ.. ప్రతి సంవత్సరం కొత్త థీమ్‌తో ముందుకు వస్తున్నారు. అడవుల నరికివేతను అడ్డుకోవాలంటూ.. అడవుల ప్రాముఖ్యతను చాటి చెప్తూ.. ప్రతి సంవత్సరం మార్చి 21వ తేదీన ప్రపంచ అటవీ దినోత్సవం నిర్వహించాలని 2012లో యూనెస్కో తీర్మానించింది. రాబోయే తరాలకు అడవులను అందించాలనే లక్ష్యంతో దీనిని నిర్వహిస్తుంది.
అడవుల ప్రాముఖ్యతను వివరిస్తూ.. ఏటా మార్చి 21వ తేదీన వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తారు. అన్నిరకాల అడవుల ప్రాముఖ్యతపై అవగాహన కల్పిస్తారు. చెట్ల పెంపకం, అడవులతో కూడిన కార్యకలాపాలపై స్థానిక, జాతీయ, అంతర్జాతీయంగా అవగాహన సదస్సులు కల్పిస్తారు. అడవుల సంరక్షణలో భాగంగా అంతర్జాతీయ దినోత్సవం రోజు కొత్త థీమ్(International Day of Forest Theme)ను ఎంచుకుంటారు. ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫారెస్ట్స్ 2024కు గానూ.. అడవులు, ఆవిష్కరణ అనే థీమ్‌తో ముందుకు వెళ్తున్నారు. అయితే మీకు తెలుసా? అడవులు మన ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయట. అబ్బా ఎక్కడో ఉండే అడవులు మనపై ఎలా ప్రభావం చూపిస్తాయి.
వాతావరణంలో మార్పులకు కారణం
భూ ఉపరితలంలో దాదాపు మూడింట ఒక వంతు అడవులే ఉన్నాయి. అడవులంటే కేవలం పచ్చదనమే కాదు. పలు రకాల జాతులకు, జంతువులకు ఆవాసాలు. ప్రజలకు జీవనోపాధిని కలిగించే కర్మాగారాలు. అంతేకాదు ఆరోగ్యకరమైన అడవులు కార్బన్ సింక్లుగా పనిచేస్తాయి. సంవత్సరానికి బిలియన్ల మెట్రిక్ టన్నుల కార్బన్‌డయాక్సైడ్‌ను ఇవి గ్రహిస్తాయి. ఇవే కాకుండా వాతావరణ మార్పులను కంట్రోల్ చేయడంలో కీలకపాత్ర పోషిస్తాయి. వీటిని నరికివేయడం వల్ల వాతావరణంలో తీవ్రమార్పులు చోటు చేసుకుంటాయి. ఇవి ఆరోగ్యంపై దుష్ప్రాభావాలను చూపిస్తాయి.
ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం..
అడవులు వాతావరణంపై తీవ్రమైన మార్పులు చూపిస్తాయి. వాతావరణ మార్పుల కారణంగా పర్యావరణ పరిస్థితుల్లో మార్పు వస్తుంది. ఇవి అలెర్జీ కారకాలను ఉత్పత్తి చేసే అటవీ జాతుల ఆవిర్భావానికి కారణం అవుతాయి. అంతేకాకుండా పలు వ్యాధుల ఆవిర్భావానికి ప్రధాన కారణమవుతాయి. ఉష్ణోగ్రతల్లోని తీవ్రమైన మార్పులు భూమిని కూడా సూర్యుడి మాదిరిగా వేడి పుట్టించేలా చేస్తాయి. ఇప్పటికే పెరిగిన ఉష్ణోగ్రతలు మనుషులపై తీవ్ర ప్రభావాలు చూపిస్తున్నాయి. వేడి పెరిగితే మంచు కరిగి.. తీవ్రమైన వరదలు వచ్చే ప్రమాదం ఎక్కువ ఉంటుంది. తీవ్రమైన చలి, తీవ్రమైన ఎండలు ఆరోగ్యాన్ని అతలాకుతలం చేస్తాయి. ఇప్పటికే ఈ మార్పులు చాలా ఇబ్బంది పెడుతున్నాయి. వర్షాలు పలు చోట్ల అతిగా కురుస్తుంటే.. మరో చోట అనా వృష్టిగా కురుస్తున్నాయి. ఇలా ప్రతి పాయింట్ కూడా మానవ ఆరోగ్యాన్ని ప్రభావం చేస్తున్నాయి.
ఇన్నోవేషన్ పేరుతో నరికేస్తున్నాం..
ఔషధాల పేర్లతో, మూలికలు, బట్టలు, నిర్మాణ వస్తువులు, మందులు, అనేక రోజూవారీ వస్తువుల కోసం అడవులను ఉపయోగించుకుంటున్నాము. అయితే ఉపయోగించిన చెట్లకు బదులుగా ఎన్ని చెట్లను తిరిగి నాటుతున్నాము. అభివృద్ధి పేరుతో మరికొందరు చెట్లను నరికి అపార్ట్మెంట్లు, కర్మాగారాలు నిర్మిస్తూ అటవీని నరికేస్తున్నారు. వాతావరణంలో వస్తున్న మార్పులు చూసైనా మనం ఇకపై మారాలి అంటున్నారు పర్యావరణ హితులు. అడవులను పర్యవేక్షించడానికి, మంటలను గుర్తించి వాటిని కాపాడడానికి పర్యావరణ పరిరక్షణ వ్యవస్థలను రూపొందించాలి.
ఈ నేపథ్యంలోనే పలు దేశాలు అడవులను పరిరక్షించడంలో ముందుకు వస్తున్నాయి. కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను కంట్రోల్ చేసే ఎన్నో ఇన్నోవేటివ్ థాట్స్‌తో ముందుకు వస్తున్నాయి. అటవీ నిర్మూలకు వ్యతిరేకంగా పోరాడుతున్నాయి. 2030 నాటికి అటవీ నిర్మూలన, అటవీ క్షీణతను తగ్గించడం, అడవులను పునరుద్ధరించే విధంగా ముందుకు వెళ్తున్నాయి. మనం కూడా అడవి ప్రాముఖ్యతను గుర్తించి.. వాటితో పాటు.. భవిష్యత్తు తరాలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Also Read : 'మమ్మల్ని కూడా మనుషులుగా గుర్తించండి'.. డౌన్ సిండ్రోమ్ వ్యక్తుల ఆవేదన