Loksatta Jayaprakash Narayana :   ఆంధ్రప్రదేశ్ లో తన మద్దతు ఎన్డీఏ కూటమికేనని లోక్‌సత్తా అధినేత జయప్రకా‌శ్ నారాయణ తెలిపారు. రేపటి నుంచి తనపై కులముద్ర వేస్తారని తెలుసునని, అయినా రాష్ట్ర అభివృద్ధి కోసం తాను ఈ నిర్ణయం తీసుకున్నానని ఆయన తెలిపారు. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి మద్దతు ఇవ్వాలని ఆయన ప్రజలకు పిలుపు నిచ్చారు. ఈ కూటమితోనే రాష్ట్రానికి ఎంతో మేలు జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.   కూటమి అధికారంలోకి వస్తేనే అభివృద్ధి జరగడంతో పాటు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని, పరిశ్రమల స్థాపన జరుగుతుందని జయప్రకాశ్ నారాయణ అన్నారు. ఆ నమ్మకం తనకు ఉన్నందునే ఆ కూటమికి మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. ప్రజలు, మేధావులు, రైతులు ఆలోచించి పిల్లల భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని కూటమికి మద్దతివ్వాలని కోరారు. ఈ ప్రకటన చేసినందుకు తనపై కులముద్రతో పాటు, తనను దూషించేవాళ్లు కూడా అనేక మంది బయలుదేరుతారని, అయితే నిజాయితీగా రాష్ట్ర భవిష్యత్ కోసం ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు.


వైసీపీలో చేరుతారని ప్రచారం.. అంతలోనే 
లోక్‌సత్తా జేపీ కొంత కాలంగా బీజేపీకి మద్దతుగా మాట్లాడుతున్నారు. మోదీ ఏ నిర్ణయం తీసుకున్నా సమర్థిస్తూ వస్తున్నారు. అదే సమయంలో ఇటీవల ఓ కార్యక్రమంలో జగన్ తో కలిసి  పాల్గొన్నారు. ఆ తర్వాత ఆయన వైసీపీలో చేరుతారన్న ప్రచారం జరిగింది. దీన్ని అప్పుడే ఖండించారు. కార్యక్రమంలో పాల్గొన్నాను తప్ప రాజకీయాలపై చర్చించలేదన్నారు. తర్వాత ఒకటి రెండు సందర్భాల్లో యూట్యూబ్ ఇంటర్యూల్లో జగన్ పాలనపై పాజిటివ్ కామెంట్స్ చేశారు. అయితే చాలా అంశాలపై వ్యతిరేకంగా స్పందించారు. శాంతిభద్రతలు, ఆర్థిక నిర్వహణ, అభివృద్ధి లేకపోవడం వంటి అంశాలపై జగన్ పాలనపై విమర్శలు చేశారు. ఇప్పుడు ఎన్డీఏ కూటమికి మద్దతు పలకడమే కాకుండా..   పాలనను అంతం చేయాలని పిలుపునిస్తున్నారు. 


మాజీ సివిల్ సర్వీస్ అధికారి అయిన జయ ప్రకాష్ నారాయణ లోక్ సత్తా  పేరుతో చాలా కాలం స్వచ్చంద సంస్థను నడిపారు. రాజకీయంగా ప్రజల్ని చైతన్యవంతుల్ని  చేయాలన్న లక్ష్యంతో ఈ సంస్థ  కార్యకలాపాలను నిర్వహించారు. అప్పట్లో యువత లోక్ సత్తా వైపు ఆకర్షితులయింది. తర్వాత లోక్ సత్తాను రాజకీయ పార్టీగా మార్చారు.  2009 ఎన్నికల్లో పోటీ చేశారు. జేపీ కూకట్ పల్లి నుంచి ఎమ్మెల్యేగా  పోటీ చేశారు. ఆయన ఒక్కరే విజయం సాధించారు. ఉమ్మడి రాష్ట్రంలో రెండు శాతం మాత్రమే ఓట్లు తెచ్చుకున్నారు. కానీ టీడీపీ ఓటమిలో ఆ ఓట్లు కీలక పాత్ర పోషించాయి. ఆ ఎన్నికల తర్వాత రాజకీయ పార్టీ నిర్వహణలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 


తర్వాత ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి పోటీ  చేసినా ఫలితం లేకపోయింది.  పార్టీ నేతల మధ్య పోరాటం పెరిగిపోవడం.. రెండు వర్గాలుగా మారిపోవడంతో. ఆయన రాజకీయ పార్టీగా లోక్ సత్తా ప్రస్థానాన్ని ముగిస్తున్నట్లుగా ప్రకటించారు. ఇప్పుడు లోక్ సత్తా రాజకీయ పార్టీగా లేదు.