దక్షిణ భారతీయులకు ఇష్టమైన బ్రేక్‌ఫాస్ట్ దోశ. అది ఎక్కడ పుట్టిందో తెలియదు కానీ తెలుగు రాష్ట్రాలను, తమిళనాడు, కర్ణాటకను కమ్మేసింది. ఇక్కడికి వారికి టిఫిన్ అంటే చాలు గుర్తొచ్చేవి ఇడ్లీ తరువాత దోశ మాత్రమే. కొంతమంది కర్ణాటకలోని ఉడిపినే దోశ జన్మస్థలం అని చెబుతుంటారు. దోశ చరిత్ర ఇప్పటిది కాదు 12 వ శతాబ్ధం నాటికే ఇది ప్రజల వంటగదుల్లో ఘుమఘుమలాడిందని తెలుస్తోంది. ఎలా అంటే అప్పటి కొన్ని కన్నడ శ్లోకాల్లో దోశె ప్రసావన ఉంది. దోశె ఆకారం ఒక్కటే అయినా చేసే విధానం, కలిపే పదార్థాలు మారుతూ ఉంటాయి. ఎలా చేసినా రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది. సాధారణంగా అయితే దోశ కోసం ముందుగానే మినపప్పు, బియ్యాలను నానబెట్టి మిక్సీ వేసుకుని రుబ్బు రెడీ చేసుకోవాలి. ఒక్కోసారి అంత తీరిక ఉండదు. అలాంటప్పుడు దోశ తినాలనిపించినా లేక టిఫిన్ ఏం చేయాలో తోచక పోయినా ఇక్కడ మేం చెప్పిన ఇన్‌స్టెంట్ దోశను ప్రయత్నించండి. ఎవరికైనా ఇట్టే నచ్చేస్తుంది. ఈ దోశకు జతగా కొబ్బరి చట్నీ, టమాటో చట్నీ, శెనగపలుకుల చట్నీ... ఇందులో ఏది తిన్నా అదిరిపోతుంది. ముందుగా ఎలా చేయాలో చూద్దామా.


కావాల్సిన పదార్థాలు
బియ్యం పిండి - రెండు కప్పులు
పెరుగు - ఒకటిన్నర కప్పు
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - దోశెలకు వేయడానికి సరిపడా
నీళ్లు - తగినన్ని
ఉల్లి తరుగు - పావు కప్పు
పచ్చిమిర్చి తరుగు - ఒక స్పూను


తయారీ ఇలా
1. బియ్యంపిండిని ఒక గిన్నెలో వేసుకోవాలి. అందులో పెరుగు కూడా వేసి బాగా కలపాలి. ఉండల్లేకుండా చూసుకోవాలి. 
2. రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. 
3. రుబ్బు గట్టిగా అనిపిస్తే జారేలా అయ్యే వరకు నీళ్లు కలుపుకోవచ్చు. 
4. పెనంపై నూనె రాసి పలుచగా దోశలా వేసుకోవాలి. పైన ఉల్లితరుగు, పచ్చిమిర్చి తరుగు కూడా చల్లుకోవాలి. 
5. దోశె బంగారు వర్ణంలోకి మారాక తీసేయడమే. 
6. పెరుగు, బియ్యంపిండి మాత్రమే వేశాం కనుక చాలా త్వరగా దోశ కాలిపోతుంది. 
7. ఈ దోశను కొబ్బరి చట్నీని జతగా చేసుకుంటే ఆ రుచే వేరు. 


రోజూ వేసుకునే దోశ కన్నా పెరుగు కలిపిన ఈ దోశ భిన్నమైన రుచిని అందిస్తుంది. పిల్లలకు బాక్సుల్లో పెట్టేందుకు ఇది సరైన ఎంపిక. 


Also read: స్పెర్మ్ కౌంట్‌ను పెంచే టొమాటో మిరియాల సూప్, ఎలా చేయాలంటే


Also read:  శరీరాన్ని చల్లబరిచే మజ్జిగ చారు రెసిపీ, అప్పట్లో అమ్మమ్మల ఫేవరేట్


Also read: చింతచిగురు పొడి ఇలా చేసి పెట్టుకోండి, అన్నంతో పాటూ తింటే ఆ రుచే వేరు