వేసవిలో స్పెషల్ వంటకం మజ్జిగచారు. గ్రామాల్లో ఇప్పటికీ వేసవి వస్తే కచ్చితంగా ఈ వంటకం కనిపిస్తుంది. దానికి కారణం రుచే కాదు, అది చేసే మేలు కూడా. వేసవి తాపాన్ని తీర్చి, వడదెబ్బ కొట్టకుండా చూస్తుంది, అందుకే ఎండల్లో పొలం పనులు చేసేవారు రసం కన్నా మజ్జిగ చారుకే ప్రాధాన్యతనిచ్చేవారు. ఇప్పుడు కాలం మారింది, పట్టణాల పరిధి పెరిగింది. మజ్జిగచారుని చేసుకునే వారి సంఖ్య తగ్గింది. దీన్ని తయారుచేయడానికి పెద్దగా కష్టపడక్కర్లేదు. కేవలం పదినిమిషాల్లో తయారైపోతుంది. వేసవిలో పెద్దలకు, పిల్లలకు దీన్ని తినిపిస్తే త్వరగా వడదెబ్బ బారిన పడకుండా ఉంటారు. ఎర్రటి ఎండల్లో బయటికి వెళ్లివచ్చిన వారు మజ్జిగచారుతో అన్నాన్ని ముగిస్తే వారిలో చెమటద్వారా బయటికి పోయిన ఎలక్ట్రోలైట్స్ మళ్ళీ శరీరంలో చేరుతాయి. డీహైడ్రేషన్ బారిన పడకుండా కాపాడే అద్భుత శక్తి దీనికుంది. కాబట్టి ఇదెలా చేయాలో తెలుసుకోండి. 


కావాల్సిన పదార్థాలు
మజ్జిగ - రెండు కప్పులు
ఉల్లి తరుగు - అరకప్పు
పచ్చిమిర్చి తరుగు - అర స్పూను (కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు)
ఉప్పు  - రుచికి సరిపడా


పోపు కోసం
పసుపు - అర టీస్పూను
ఎండు మిర్చి - రెండు
ఆవాలు - అరటీస్పూను
జీలకర్ర - అరటీస్పూను
కరివేపాకు - గుప్పెడు
కొత్తిమీర తరుగు -  కొద్దిగా
నూనె - ఒక టీస్పూను


తయారీ ఇలా
ఒక గిన్నెలో మజ్జిగ చేసి పోసుకోవాలి. అందులో ఉల్లి తరుగు, పచ్చి మిర్చి తరుగు, ఉప్పు వేసి కలపాలి. ఇప్పుడు పోపు కోసం స్టవ్ పై చిన్న కళాయి పెట్టాలి. అది వేడెక్కాక ఒక  స్పూను నూనె వేయాలి. అందులో ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, కరివేపాకు, పసుపు వేసి చిటపటలాడించాలి. ఆ పోపును మజ్జిగ మిశ్రమంలో కలిపేయాలి. పైన కొత్తి మీర తరుగును చల్లుకోవాలి. అంతే మజ్జిగ చారు సిద్ధమైనట్టే. 


అందానికి కూడా...
అన్నట్టు మజ్జిగ చారు ఆరోగ్యానికే కాదు చర్మ సౌందర్యానికి కూడా అవసరం. పెరుగు, పాలల్లో ఉండే పోషకాలతో పాటూ ఇతర పోషకాలు కూడా దీన్నుండి లభిస్తాయి. చర్మ ఆరోగ్యాన్ని ఇది కాపాడుతుంది. చుండ్రుని తగ్గిస్తుంది కూడా. వేసవిలో రోగినిరోధక శక్తిని పెంచే దివ్యౌషధం మజ్జిగ చారు. కాల్ఫియం, పొటాషియం, విటమిన్ బి12, మెగ్నిషియం వంటివన్నీ ఇందులో నిండుగా ఉంటాయి. జీర్ణ సమస్యలేవీ దీని వల్ల రావు. 


Also read: జున్ను వయసును దాచేస్తుంది, అప్పుడప్పుడు తినాల్సిందే


Also read: అలాంటివారికి గుండెపోటు వస్తే బతికే ఛాన్స్ చాలా తక్కువ, కొత్త అధ్యయన ఫలితం