వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు హఠాత్తుగా దాడిచేస్తోంది. అంతకుముందు 50 ఏళ్లు దాటినవారికే గుండె పోటు వస్తుందనే నమ్మకం ఉంది. ఇప్పుడు వయసు తేడా లేదు. 30లలో ఉన్నవారిపై గుండె పోటు దాడి చేస్తోంది. అందుకే జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇటీవల చేసిన ఓ అధ్యయనంలో ఓ షాకింగ్ విషయం తెలిసింది. ధూమపానం అలవాటున్న వారికి గుండెపోటు వస్తే వారు బతికే ఛాన్స్ చాలా తక్కువని ఆ అధ్యయనంలో తేలింది. జోర్డాన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి చెందిన పరిశోధకులు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. ధూమపానం చేయని వారితో పోలిస్తే, చేసే వారు గుండె పోటు బారిన పడితే వారు బతికి బట్టకట్టే అవకాశాలు తక్కువ అని చెబుతున్నారు పరిశోధకులు. 


కారణం ఇదే...
కాలేయంలో ఆల్ఫా 1 యాంటీ ట్రిప్సిన్ అనే ప్రొటీన్ ఉంటుంది. ఇది శరీర కణజాలాలను రక్షిస్తుంది. ధూమపానం చేసేవారిలో ఆ ఈ ప్రొటీన్ స్థాయిలు తక్కువగా ఉంటాయి. చేయని వారిలో అధికంగా ఉంటాయి. అమెరికాకు చెందిన హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హార్ట్ డిసీజ్ అండ్ స్ట్రోక్ ప్రివెన్షన్ సంస్థ చెప్పిన ప్రకారం ఈ ఆల్ఫా1 యాంటీ ట్రిప్సిన్ ప్రొటీన్ గుండె పోటు వచ్చిన సమయంలో గుండె కణజాలానికి రక్షణగా ఉంటుంది.సిగరెట్ కాల్చేవారిలో ఈ ప్రొటీన్ తక్కువగా ఉంటుంది కాబట్టి గుండె పోటు వస్తే ధూమపానం చేసేవారు జీవించే ఛాన్సులు తక్కువ అని వివరించారు శాస్త్రవేత్తలు.


గుండెపొటు వచ్చిన 29 మంది పురుషులను, 11 మంది మహిళలను ఈ పరిశోధన కోసం ఎంపిక చేశారు. వారికి ఒక గంట, నాలుగ్గంటలు, 24 గంటలు, 48 గంటలు, 96 గంటల సమయంలో వారి నుంచి ప్రతిసారి రక్తనమూనాలను సేకరించారు. పరిశోధనలో పాల్గొన్నవారిని నాలుగు వర్గాలుగా విభజించారు. ధూమపానం చేసే వారు, చేయని వారు, అధిక రక్తపోటు కలవారు, సాధారణ రక్తపోటు కలవారు అలా.ధూమపానం చేసేవారిలో ఆల్ఫా1 ప్రొటీన్ తక్కువగా ఉన్నట్టు గుర్తించారు. వారు ధూమపానం మానేస్తే ఈ ప్రొటీన్ స్థాయులు గణనీయంగా పెరుగుతాయని వివరించారు పరిశోధకులు. సిగరెట్ కాల్చడం మానేస్తే ఇంకా ఎన్నో ఆరోగ్యలాభాలు కూడా ఉన్నాయి. కానీ కాల్చడం వల్ల ఒక్క ఉపయోగమూ లేదు. కాబట్టి కాల్చడం మానేయడం చాలా ఉత్తమం.  


Also read: పెద్దమనసు చాటుకున్న జంట, ఉక్రెయిన్ల కోసం తమ అందమైన దీవిని శరణార్ధుల శిబిరంగా మార్చేశారు


Also read: నిద్రలో మాట్లాడడం కూడా ఒక రోగమే, వారసత్వంగా వచ్చే అవకాశం