వసంతకాలం వచ్చిందటే చింతచిగురు తొడిగేస్తుంది. పచ్చని రంగులో చూస్తుంటేనే నోరూరిపోతుంది. పూర్వం చింతచిగురుతో చేసిన ఆహారానికి చాలా విలువ ఉండేది. పప్పు చింతచిగురు కలిపి వండుకుని కచ్చితంగా తినేవారు. కానీ ఇప్పుడు గ్రామాల్లో తప్ప పట్టణాల్లో దీన్ని తినేవారి సంఖ్య తగ్గిపోయింది. చింతచిగురు తినడం వల్ల చాలా లాభాలు కలుగుతాయి. 


చింతచిగురులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. కనుక రోగనిరోధక శక్తి అందుతుంది.త్వరగా వైరస్, బ్యాక్టరియాలు దాడి చేయలేవు. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువే. కాబట్టి చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా కాపాడుతుంది. గుండె ఆరోగ్యానికి మేలు చేసే మంచి కొవ్వును పెంచుతుంది. పైల్స్, మలబద్ధకం సమస్యలతో బాధపడేవారికి చింతచిగురుతో చేసిన వంటకాలు మేలు చేస్తాయి. చింతచిగురును నీళ్లలో వేసి మరిగించి, చల్లారక ఆ నీటిని తాగినా, లేక పుక్కిలించినా గొంతునొప్పి, మంట, వాపు తగ్గుముఖం పడతాయి. ఎర్రరక్తకణాల ఉత్పత్తిని చింతచిగురు పెంచుతుంది. పిల్లలకు తరచూ నులిపురుగుల సమస్య వేధిస్తుంది. చింతచిగురు పప్పు వంటివి పిల్లలకు తినిపిస్తే ఆ సమస్య తగ్గుముఖం పడుతుంది.కొన్ని రకాల క్యాన్సర్లను అడ్డుకునే శక్తి కూడా చింతచిగురుకు ఉంది. 


చింతచిగురు సీజనల్‌గా దొరుకుతుంది కాబట్టి దీన్ని పొడి రూపంలో దాచుకుంటే మంచిది. ఏడాదంతా తాజాగా ఉంటుంది. 


కావాల్సిన పదార్థాలు


చింతచిగురు - పావుకిలో
ఎండుమిరపకాయలు - 12 
(కారంగా కావాలంటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు)
మినపప్పు - అయిదు స్పూన్లు
ధనియాలు - పావు కప్పు
ఉప్పు - రుచికి సరిపడా
వెల్లుల్లి రెబ్బలు - 10
ఆవాలు - ఒక స్పూను
జీలకర్ర - ఒక స్పూను
నూనె - అయిదుస్పూన్లు


తయారీ ఇలా
1. చింతచిగురుని బాగా కడిగి గాలికి ఆరబెట్టాలి. 
2. స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి. 
3. నూనె వేడెక్కాక ఎండు మిరపకాయలు, ధనియాలు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు వేసి వేయించాలి.
4. అవి వేగాక చింతచిగురు కూడా వేసి వేయించాలి. 
5. అన్నీ వేగాక కాస్త చల్లారబెట్టాలి. చల్లారక వెలుల్లిరెబ్బలు కూడా కలిపి, ఉప్పు వేసి మిక్సీలో పొడిలా చేసుకోవాలి.  వెల్లుల్లి రెబ్బలు వేయడం వల్ల పొడికి ప్రత్యేకమైన రుచి వస్తుంది.
6. ఈ పొడి ఎన్ని నెలలైనా తాజాగానే ఉంటుంది.వేడి వేడి అన్నంలో ఈ పొడి, నెయ్యి వేసుకుని రెండు ముద్దలు తింటే ఆ రుచే వేరు. పైగా ఆరోగ్యం కూడా. 
అన్నమే కాదు, ఇడ్లీ, దోశెల్లోకి ఈ పొడి చాలా టేస్టీగా ఉంటుంది. 


Also read: ఇలా రాగిదోశ చేస్తే వదిలిపెట్టకుండా తినేస్తారు, అధిక బరువు నుంచి మధుమేహం వరకు ఎన్నో రోగాలకు చెక్ పెట్టొచ్చు



Also read: ఇలా మామిడికాయ పొడి చేసుకుంటే, చింతపండు అవసరం ఉండదు, మధుమేహులకు ఎంతో మేలు