IPL 2022: కోల్‌కతా నైట్‌రైడర్స్ బ్యాటర్‌ నితీశ్‌ రాణా (Nitish rana), ముంబయి ఇండియన్స్‌ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రాను (Jasprit Bumrah) మ్యాచ్‌ రిఫరీ మందలించారు. వారిద్దరి మ్యాచు ఫీజులో 10 శాతం కోత విధించారు. ఐపీఎల్‌ నిబంధనావళిని (IPL code of conduct) అతిక్రమించినందుకు వారిద్దరిపై చర్యలు తీసుకున్నారు.


ఐపీఎల్‌ 2022 మ్యాచ్‌ 14లో ముంబయి ఇండియన్స్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (KKR vs MI) తలపడ్డాయి. పుణె వేదికగా జరిగిన ఈ మ్యాచులో కేకేఆర్‌ అద్భుతమైన విక్టరీ సాధించింది. ప్యాట్‌ కమిన్స్‌ (Pat Cummins) కేవలం 14 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ చేసేశాడు. ఈ మ్యాచులోనే బుమ్రా, రాణా ఐపీఎల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌కు విరుద్ధంగా ప్రవర్తించారని తెలిసింది.


జస్ప్రీత్‌ బుమ్రా, నితీశ్ రాణా ఏ తప్పులు చేశారన్ని ఐపీఎల్‌ నిర్వాహకులు చెప్పలేదు. ఛేదనలో ఔటైన తర్వాత నితీశ్ రాణా ఒక అడ్వర్టైజ్‌మెంట్‌ బోర్డును ఆవేశంలో తన్నాడని తెలుస్తోంది. ఇక బుమ్రా ఏం చేశాడో తెలియలేదు. వీరిద్దరూ తమ తప్పును రిఫరీ ముందు అంగీకరించారు.


KKR vs MI మ్యాచ్‌ ఎలా సాగిందంటే?


IPL 2022, KKR vs MI Match Highlights: ఐపీఎల్‌ 2022లో ముంబయి ఇండియన్స్‌ (Mumbai Indians)కు వరుసగా మూడో ఓటమి ఎదురైంది! డిఫెండింగ్‌ ఛాంపియన్‌ సీఎస్‌కే బాటలోనే నడిచింది. ఆ జట్టు నిర్దేశించిన 162 పరుగుల టార్గెట్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (Kolkata Knightriders) 5 వికెట్ల తేడాతో ఛేదించేసింది. ప్యాట్‌ కమిన్స్‌ । Pat Cummins (56; 15 బంతుల్లో 4x4, 5x6) 14 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ కొట్టేయడంతో మరో 4 ఓవర్లుండగానే గెలుపు తలుపు తట్టింది. వెంకటేశ్‌ అయ్యర్‌ । Venkatesh Iyer (50; 41 బంతుల్లో 6x4, 1x6) ఆఖరి వరకు నిలిచాడు. అంతకు ముందు ముంబయిలో సూర్య కుమార్‌ యాదవ్‌ (52; 36 బంతుల్లో 5x4, 2x6) అర్ధశతకం చేశాడు. హైదరాబాదీ తిలక్‌ వర్మ (38*; 27 బంతుల్లో 3x4, 2x6) రాణించారు.


Pat Cummins ఊచకోత


పిచ్‌ కఠినంగా ఉండటంతో కోల్‌కతా ఛేజింగ్‌ మొదట్లో అంత ఈజీ కాలేదు. పక్కగా ప్లాన్‌ చేసిన ముంబయి పేసర్లు అవే గోయింగ్‌ డెలివరీలతో ఓపెనర్లను చికాకు పెట్టారు. తొలి 3 ఓవర్లు పెద్దగా రన్స్‌ ఇవ్వలేదు. జట్టు స్కోరు 6 వద్దే అజింక్య రహానె (7)ను తైమల్‌ మిల్స్‌ ఔట్‌ చేశాడు. రెండు బౌండరీలు బాదిన శ్రేయస్‌ అయ్యర్‌ (10)ని డేనియెల్‌ సామ్స్ పెవిలియన్‌ పంపించాడు.


వికెట్లు పడుతున్నా ఓపెనర్‌ వెంకటేశ్‌ అయ్యర్‌ నిలబడ్డాడు. హాఫ్‌ సెంచరీతో అలరించాడు. ఆచితూచి ఆడుతూనే దొరికిన బంతుల్ని బౌండరీకి పంపించాడు. కాసేపు బిల్లింగ్స్ (17) అతడికి అండగా నిలిచాడు. జట్టు స్కోరు 67 వద్ద అతడిని, 83 వద్ద నితీశ్ రాణా (8) ఒకే తరహాలో మురుగన్‌ అశ్విన్‌ ఔట్‌ చేశాడు. 13.1వ బంతికి ఆండ్రీ రసెల్‌ (11)ను తైమల్‌ మిల్స్‌ ఔట్‌ చేయడంతో కేకేఆర్‌ 101/5తో నిలిచింది. ఈ సిచ్యువేషన్‌లో ప్యాట్‌ కమిన్స్‌ అద్భుతం చేశాడు. రసెల్‌ బదులు అతడు ఊచకోత కోశాడు. వరుసగా పుణెలో బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపించి 14 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ చేసి కేఎల్‌ రాహుల్‌ రికార్డును సమం చేశాడు. 16 ఓవర్లకే మ్యాచును ముగించేశాడు.