IPL 2022, Pat Cummins Joint Fastest 50 runs in 14 balls against MI: కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఆటగాడు ప్యాట్‌ కమిన్స్‌ (Pat Cummins) అద్భుతమైన రికార్డు సృష్టించాడు. ఐపీఎల్‌ 2022లో అత్యంత వేగంగా అర్ధశతకం సాధించిన బ్యాటర్‌గా నిలిచాడు. కేవలం 14 బంతుల్లోనే 50 పరుగులు చేసి ప్రత్యర్థి ముంబయి ఇండియన్స్‌ను (KKR vs MI) బెంబేలెత్తించాడు. 2018లో కేఎల్‌ రాహుల్‌ (KL Rahul) సాధించిన అత్యంత వేగవంతమైన హాఫ్‌ సెంచరీ రికార్డును సమం చేశాడు.


పుణె వేదికగా ముంబయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచులో ప్యాట్‌ కమిన్స్‌ (56; 15 బంతుల్లో 4x4, 5x6) ఇరగదీశాడు. ఛేదనలో 5 వికెట్లు పడి, ముంబయి బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేస్తున్న సమయంలో అతడు అడుగు పెట్టాడు. వెంకటేశ్‌ అయ్యర్‌ (50; 41 బంతుల్లో 6x4, 1x6)తో కలిసి ఊచకోత కోశాడు. అతడి బౌలింగ్‌లో ముంబయి ఎక్కువ పరుగులు చేయడంతో కసితో ఆడాడు. 


Pat Cummins equaled the record for the fastest fifty ever in the Indian Premier League


తైమల్‌ మిల్స్‌ వేసిన 13.5, 13.6 బంతుల్ని కమిన్స్‌ వరుసగా సిక్స్‌, బౌండరీగా మలిచాడు. తన ఉద్దేశమేంటో ప్రత్యర్థికి స్పష్టంగా చెప్పాడు. బుమ్రా వేసిన 15వ ఓవర్లో రెండు బంతులు డాట్‌ చేసిన అతడు 14.4, 14.5 బంతుల్ని వరుసగా 6, 4గా మలిచాడు. డేనియెల్‌ సామ్స్ వేసిన 16వ ఓవర్లో అతడి అసలు ఊచకోత మొదలైంది. గతంలో ఎన్నడూ లేనంత కసితో బ్యాటింగ్‌ చేశాడు. వరుసగా 4, 6, 6 బాదేశాడు. తర్వాత బంతిని బౌండరీ లైన్‌ వద్ద సూర్య అద్భుతమైన ఫీల్డింగ్‌తో క్యాచ్‌ అందుకున్నా అది నోబాల్‌ కావడంతో 2 పరుగులు తీశాడు. ఆ తర్వాత వరుసగా 4, 6 బాదేసి జట్టుకు విజయం అందించాడు.


ముంబయి ఇండియన్స్‌పై చివరి మూడు ఇన్నింగ్సుల్లోనూ ప్యాట్‌ కమిన్స్‌ ఇదే తరహాలో ఆడాడు. వరుసగా 12 బంతుల్లో 33; 36 బంతుల్లో 53 నాటౌట్‌; 15 బంతుల్లో 56 నాటౌట్‌గా నిలిచాడు. ఐపీఎల్‌లో ఇప్పటి వరకు ఫాస్టెస్ట్‌ హాఫ్‌ సెంచరీ రికార్డు కేఎల్‌ రాహుల్‌ పేరుతో ఉండేది. అతడు 2018లో దిల్లీపై 14 బంతుల్లోనే 50 కొట్టాడు. నేడు ముంబయిపై కమిన్స్‌ దానిని సమం చేశాడు.  2014లో సన్‌రైజర్స్‌పై యూసుఫ్‌ పఠాన్‌ 15; 2017లో ఆర్‌సీబీపై సునిల్‌ నరైన్ 15 బంతుల్లో అర్ధశతకాలు బాదేశారు.