AP Cabinet Last Meeting Today: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త మంత్రివర్గ (AP New Cabinet) ఏర్పాటుకు అంతా సిద్ధం అయింది. ఇంకో 4 రోజుల్లో అంటే ఏప్రిల్ 11న కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇవాళ (ఏప్రిల్ 7) రాష్ట్రంలోని పాత మంత్రులు 25 మంది రాజీనామాలు చేసే అవకాశం ఉంది. వీరి స్థానంలో దాదాపు 90 శాతం కొత్త మంత్రులు కొలువుదీరనున్నారు. ఈ మేరకు గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ఏపీ సచివాలయంలో ఏపీ కేబినెట్ చివరి భేటీ జరగనుంది. అందుకు సంబంధించి కేబినెట్ భేటీ ఎజెండాను కూడా రెడీ చేశారు. ఈ సందర్భంగానే ముఖ్యమంత్రి జగన్ (CM Jagan) మంత్రుల నుంచి రాజీనామాను కోరే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.


ఎప్పటినుంచో ఉన్న వాదనల ప్రకారం ప్రస్తుత మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Peddireddy Ramachandra Reddy), ఆదిమూలపు సురేష్‌ (Adimulapu Suresh), చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ (Chelluboina Venugopala Krishna), సీదిరి అప్పలరాజు (Seediri Appala Raju), గుమ్మనూరు జయరాం (Gummanuru Jayaram) కొత్త కేబినెట్‌లో (AP New Cabinet) మంత్రులుగా కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక కొత్త మంత్రులుగా ఎవర్ని ఎంపిక చేశారన్న విషయాన్ని మాత్రం ఎక్కడా బయటకు పొక్కనీయడం లేదు. ఈ విషయాన్ని ప్రమాణ స్వీకార తేదీ ముందు వరకూ రహస్యంగా ఉంచే అవకాశం ఉందని తెలుస్తోంది. 2024 ఎన్నికలకు సంబంధించి అనుసరించాల్సిన వ్యూహాల్ని సిద్ధం చేసేందుకు సీనియర్ మంత్రుల సేవల్ని వినియోగించుకోనున్నారు.







మంత్రుల రాజీనామాలకు (Ministers Resign in AP) గవర్నర్ ఆమోదం తెలపగానే అదే రోజు కొత్తగా మంత్రిమండలిలోకి (AP New Cabinet) వచ్చేవారికి వ్యక్తిగతంగా సమాచారం ఇస్తారని తెలుస్తోంది. ఈ నెల 11న ఉదయం 11:30 గంటలకు సచివాలయం భవన సముదాయం పక్కనున్న స్థలంలో కొత్త మంత్రులతో గవర్నర్ (AP Governor) ప్రమాణం చేయించనున్నారు.


నేడు కేబినెట్ భేటీ ఉదయం 11 గంటలకు నిర్వహించాలని ముందుగా నిర్ణయించారు. కానీ, నేడు సీఎం పల్నాడు జిల్లాలో పర్యటించి వాలంటీర్లకు అవార్డులు ప్రదానం చేయడం వంటి ఇతర కార్యక్రమాలు ఉండడంతో ఈ భేటీని మధ్యాహ్నానికి మార్చారు. ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన నేపథ్యంలో 6న జరగాల్సిన వాలంటీర్ల అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం 7వ తేదీకి మారింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మ వివిధ శాఖల ఉన్నతాధికారులకు మూడు రోజుల క్రితమే సమాచారం ఇచ్చారు.