సైకిల్ తొక్కేది పవన్.. ఎక్కేది బాబు అని వైసీపీ నేత అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. పవన్ కల్యాణ్ వ్యూహాలన్నీ సైకిల్ దారే అని అన్నారు. ఎంతమంది కట్టకట్టుకుని వచ్చినా.. 2024లో ఫ్యాన్ జెండానే రెపరెపలాడుతుందని అన్నారు. చంద్రబాబు పల్లకి మోయటానికి జన సైనికులు కష్టపడాలా అంటూ ప్రశ్నించారు. రైతులకు సినిమాల్లో వచ్చిన డబ్బులు ఇస్తున్నాడో లేక ఎన్టీఆర్ ట్రస్టు డబ్బులు ఇస్తున్నాడో తేలాలని అన్నారు. టీడీపీ హయాంలో రైతులను పచ్చి దగా చేసింది చంద్రబాబు, పవన్ లు కాదా? అని ప్రశ్నించారు. ఆ పాపాల పరిహారం కోసం రైతు భరోసా యాత్ర చేస్తారా అని అన్నారు. అమరావతిలోని వైఎస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో అంబటి మీడియాతో మాట్లాడారు.


‘‘మీది రైతు భరోసా యాత్రా లేక చంద్రబాబు భరోసా యాత్రా? రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబు, పవన్ కు లేదు. జనసేనలో చంద్రబాబు పెట్టిన కాపలాదారుడు నాదెండ్ల మనోహర్. రైతులకు అన్యాయం జరుగుతుందని మాట్లాడుతున్న పవన్ కల్యాణ్ ఒక్క విషయం గుర్తు చేసుకోవాలి. 2014లో టీడీపీతో కలిసి పనిచేసింది పవన్ కల్యాణే. రైతుల పట్ల ఆ ప్రభుత్వం వ్యవహరించిన తీరు ఎలా ఉంది? రైతుల కష్టాలకు, ఆత్మహత్యలకు బాధ్యులు ఎవరు అనేది జనసేన పార్టీ మర్చిపోయినట్లు ఉంది.’’


‘‘2014కు ముందు ఉమ్మడిగా మీరు ఎన్నికలకు వెళ్లినప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే.. రైతులకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి ప్రతిజ్ఞ చేశారు. రూ.87 వేల 612 కోట్ల రైతులకు రుణమాఫీని చేస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చారు, మరి ఏం చేశారు? రద్దు చేశారా? రైతుల రుణాలల్లో కోతలు వేసేందుకు కోటయ్య కమిటీని వేసి తిమ్మిని బమ్మిని చేసి స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ అని... ఇన్‌స్టాల్‌మెంట్ల బేసిస్‌ మీద రుణమాఫీ చేస్తామని, 87,612 కోట్ల రూపాయిల రుణాలకు గానూ 25 వేల కోట్లు మాత్రమే ఇవ్వగలమని చావు కబురు చల్లగా కోటయ్యగారి కమిటీతో చెప్పారు. అక్కడే రైతుల నడ్డి విరిగిపోయింది. 24 వేల కోట్లు ఇచ్చారా? అదీ ఇవ్వలేదు, ఆఖరికి రూ. 15 వేల కోట్లు ఇచ్చి సర్దుకున్నారు. ఆ అయిదేళ్లలో రైతుల పరిస్థితి దిగజారడానికి కారణం మీరు కాదా? మీ మాటలు నమ్మి బ్యాంకుల్లో కుదవ పెట్టిన బంగారం ఇంటికి వస్తుందని రైతులు ఆశపడ్డారు. తాము చేసిన రుణమంతా అణాపైసలతో సహా మాఫీ అయిపోతుందని రైతులు కలలు కన్నారు, మీకు ఓటు వేశారు. మరి అధికారంలోకి వచ్చాక రైతులను పచ్చి దగా, మోసం చేసింది టీడీపీ, పవన్‌ కల్యాణ్‌లు కాదా? అప్పుడు అధికారంలో ఉంది- మీరు మద్దతు ఇచ్చిన చంద్రబాబు నాయుడు కాదా? ఆరోజు రైతులు గుర్తురాలేదే? ఆరోజు రైతు భరోసా యాత్ర చేయాలని పవన్‌కు అనిపించలేదా?’’


పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయిన పవన్ చూసి మేం భయపడాలా..?
‘‘మరోవైపు పవన్‌ కల్యాణ్‌ రాజకీయ ఉపన్యాసం చేస్తూ.. చాలా కామెడీగా మాట్లాడారు. పార్టీ ఆవిర్భావ దినోత్సం రోజున పవన్‌ ఒకమాట చెప్పాడు. వైయస్సార్‌ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేక ఓటును చీలకుండా కాపలా కాస్తానని అన్నాడు. ఆయన ప్రకటనను చూసి మాకు భయమేస్తుందట. మేము భయపడిపోతున్నామట. పవన్‌ను, చంద్రబాబును చూసి భయపడాల్సిన పని మాకేంటి? నువ్వు రాజకీయ పార్టీ పెట్టావు. అధికారంలోకి రాలేదు సరే. సీట్లు ఎన్నివచ్చాయి? ఒకటి వచ్చింది. నీవు పోటీచేసిన చోట్లల్లో ఒకచోట కాదు... రెండుచోట్లా ఓడిపోయావు.  అలాంటి నిన్ను చూసి మేము భయపడాలా? అందరూ కట్టకట్టుకుని వచ్చినా భయపడం’’ అని అన్నారు.