YS Jagan Delhi Tour: అమరావతి: ఢిల్లీకి వెళ్లిన ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన ఒక్కరోజు పర్యటన ముగించుకుని నేడు రాష్ట్రానికి తిరిగి రానున్నారు. ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం వైఎస్ జగన్.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. అనంతరం నిర్మలా సీతారామన్ సహా పలువురు కేంద్రమంత్రులను కలుసుకున్నారు. బుధవారం ఉదయం 9.15 గంటలకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సీఎం జగన్ సమావేశమయ్యారు. అనంతరం ఉదయం 9.30 కు ఢిల్లీ నుంచి సీఎం జగన్ ఏపీకి బయలుదేరారు. మధ్యాహ్నం ఒంటి గంటకు తాడేపల్లి నివాసానికి జగన్ చేరుకుంటారు.. 


సాయంత్రం గవర్నర్‌తో సీఎం జగన్ కీలక భేటీ
బుధవారం మధ్యాహ్నం ఢిల్లీ నుంచి తిరిగొచ్చిన సీఎం జగన్ తాడేపల్లిలోని నివాసంలో కొంత సమయం విశ్రాంతి తీసుకుంటారు. నేటి సాయంత్రం 5.30 కు రాజ్ భవన్ లో గవర్నర్‌తో సీఎం కీలక భేటీ కానున్నారు. త్వరలో జరగనున్న మంత్రివర్గ మార్పులపై గవర్నర్‌కు సీఎం జగన్ వివరించనున్నారు. మంత్రుల రాజీనామాలు, కొత్త మంత్రుల జాబితాను గవర్నర్ కు ఆయన సమర్పించనున్నారని తెలుస్తోంది. ఈ నెల 11 న కొలువుదీరనున్న ఏపీ కొత్త క్యాబినెట్ ప్రమాణ స్వీకారానికి గవర్నర్‌ను సీఎం జగన్ ఆహ్వానించనున్నారు.


ప్రధానితో సీఎం జగన్ భేటీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Narendra Modi)తో ఏపీ సీఎం మంగళవారం భేటీ అయ్యారు. దాదాపుగా గంట సేపు వీరి మధ్య భేటీ జరిగింది. రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలతో పాటు ఆర్థిక పరమైన సాయం కోసం ప్రత్యేకంగా ప్రధానిని జగన్ అభ్యర్థించినట్లుగా తెలుస్తోంది. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సవరించిన అంచనాలకు ఆమోదం తెలపాలని మరోసారి ప్రధానిని జగన్కోరారు. 2019, ఫిబ్రవరి 11న జరిగిన టెక్నికల్‌ అడ్వైజరీ కమిటీ పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలను రూ. 55, 548.87 కోట్లుగా నిర్ధారించిందని జగన్ ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు.  ప్రాజెక్టును పూర్తిచేయడానికి ఇంకా రూ.31,188 కోట్లు ఖర్చు చేయాల్సిన అవసరం ఉందన్నారు.  నిర్మాణ పనులకోసం రూ.8,590 కోట్లు, భూ సేకరణ – పునరావాసంకోసం రూ.22,598 కోట్లు ఖర్చవుతుందని జగన్ ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు.


కేంద్ర మంత్రులతో సీఎం జగన్ వరుస భేటీలు..
ప్రధాని మోదీతో భేటీ భేటీ అనంతరం ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి(YS Jagan Mohan Reddy) పలువురు కేంద్రమంత్రులను కలుసుకున్నారు. మొదటగా కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌(Nirmala Seetaraman)తో సమావేశమయ్యారు. రెవెన్యూ గ్యాప్‌ భర్తీ కోసం ఇచ్చిన నిధుల్లో తీవ్ర వ్యత్యాసం ఉందని, పెండింగ్‌ బిల్లుల రూపంలో, 10వ వేతన సంఘం సిఫార్సుల అమలు, కార్యక్రమాలకు ఖర్చు చేసిన రూ.32,625.25 కోట్లను భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో గత ప్రభుత్వం హయాంలో అదనపు రుణాలకు అనుమతిచ్చి, ఇప్పుడు ఆ రుణపరిమితుల్లో కోత విధించడం సరికాదన్నారు. దీన్ని వెంటనే సవరించాలని సీఎం విజ్ఞప్తి చేశారు. పోలవరం ప్రాజెక్టు(Polavaram)కు సకాలంలో నిధులు, సవరించిన అంచనాలకు ఆమోదం తదితర అంశాలపైనా కేంద్ర ఆర్థికశాఖమంత్రితో సీఎం చర్చించారు. 


కేంద్ర జలశక్తిశాఖమంత్రి గజేంద్ర సింగ్‌షెకావత్‌(Gajendra Singh Shekhawat)తో సీఎం సమావేశమయ్యారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఇరువురి మధ్య ప్రధాన చర్చ జరిగింది. ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)కు జీవనాడి లాంటి ఈ ప్రాజెక్టు పనులను సత్వరంగా పూర్తయ్యేలా తగిన సహాయ సహకారాలు అందించాలని సీఎం విజ్ఞప్తి చేశారు. టెక్నికల్‌ అడ్వైజరీ కమిటీ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి నిర్థారించిన అంచనాలకు వెంటనే ఆమోదం తెలపాలన్నారు. కాంపొనెంట్‌ వారీగా కాకుండా మొత్తం ప్రాజెక్టు పనులను పరిగణలోకి తీసుకుని బిల్లులు చెల్లించాలని కోరారు.


Also Read: Jagan PM Meet : రాష్ట్ర సమస్యలే ఎజెండా - ప్రధానితో జగన్ భేటీ 


Also Read: CM Jagan meets Union Ministers: గత ప్రభుత్వం హయంలో అలా చేసి ఇప్పుడెందుకు కోతలు- సరి చేయాలని కేంద్రమంత్రులకు సీఎం జగన్ విజ్ఞప్తి