తిండి, పని, నిద్ర అన్నీసరిపడినంత ఉండాలి. ఇందులో ఏది తగ్గినా శారీరక మానసిక ఆరోగ్యాలు ముప్పులో పడతాయి. చాలా మంది తిండి, వర్కవుట్ కు ఇచ్చిన ప్రాధాన్యత విశ్రాంతి, నిద్రకు ఇవ్వరు. నిద్ర చాలా ముఖ్యమని నిపుణులు సలహా ఇస్తున్నారు. స్లీప్ ఆంక్జైటీ ఎలా అనారోగ్యాలకు కారణం అవుతుందో తెలిపే కొత్త అధ్యయనాలు చాలా జరిగాయి. వాటి ఫలితాలలో ఆందోళనకర విషయాలు బయటపడ్డాయి.  


యాభై ఏళ్లు పైబడిన ప్రతి పది మందిలో ఏడుగురు సరైన వేళకు నిద్రించకపోవడం వల్లే గుండెపోటు, స్ట్రోక్‌కు గురువ్వుతున్నారని  యూరోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీకి సమర్పించిన ఓ అధ్యయనంలో వెల్లడైంది. వారి స్లీప్ ప్యాటర్న్ సరిగ్గా ఉన్నట్లయితే ఆ ముప్పు నుంచి బయటపడేవారని తేలింది. రాత్రి ఒక గంట నిద్ర తగ్గినా కూడా మెదడులోని సోషల్ బిహేవియర్ ను కంట్రోల్ చేసే భాగం ప్రభావతం అయ్యి చాలా స్వార్థంగా, చికాకుగా ప్రవర్తించే విధంగా మారుస్తుందని కాలిఫోర్నియా యూనివర్శిటీ వెల్లడించింది. 


నిద్ర లేమి అంటే?


నిద్రలేమిని ఇన్సోమ్నియా అంటారు. రాత్రి నిద్ర పోవడానికి కష్టపడడం, రాత్రి నిద్ర సరిగా లేకపోవడం వల్ల ఉదయాన్నే నిద్ర లేవడానికి  కష్ట పడటాన్ని ఇన్సోమ్నియా అంటారు. రాత్రి నిద్రకు ఉపక్రమించిన తర్వాత కూడా చాలా సేపు మెలకువగానే ఉండిపోవడం, రాత్రి పూట చాలా సార్లు నిద్రాభంగం కలిగి ఎక్కువ సార్లు మెలుకోవడం, ఉదయం నిద్ర లేవగానే తాజాగా, ఉత్సాహంగా ఉన్న ఫీలింగ్ కలగపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.


అలసటగా ఉన్నప్పటికీ పగటి పూట కూడా నిద్ర పోవడం కష్టంగా ఉంటుంది. నిద్ర చాలక పోవడం వల్ల ఏకాగ్రత తగ్గడం, చికాకుగా ఉండవచ్చు. కొంత మందిలో అప్పుడప్పుడు ఈ నిద్ర లేమి సమస్య వస్తుంది. దానంతట అదే పోతుంది కూడా. కొంత మందిలో అది నెలలు, సంవత్సరాల పాటు కొనసాగవచ్చు.


నిద్రలేమి కారణాలు


ప్రతి సారి నిద్రలేమికి స్పష్టమైన కారణాలు చెప్పడం వీలుకాదు. అయితే ఒత్తిడి, ఆందోళన సాధారణంగా నిద్రలేమికి కారణమవుతాయి. పడక సరిగా కుదరక పోవడం, కదిలినపుడు మంచం శబ్ధం చెయ్యడం వంటి చిన్న చిన్న కారణాలు కూడా నిద్రాభంగం కలిగించవచ్చు. కొన్ని సార్లు ప్రయాణాలు, జెట్ లాగ్, షిఫ్ట్‌ల్లో పనిచెయ్యడం కూడా నిద్రకు అంతరాయంగా మారుతాయి. ఇవే కాదు శారీరక, మానసిక ఆరోగ్య పరిస్థితులు కూడా నిద్ర లేమికి కారణం అవుతాయి.


నిద్ర లేమిని అధిగమించే మార్గాలు



  • పడుకోవడానికి, మెలుకోవడానికి ఒక సమయాన్ని నిర్ణయించుకోవాలి. అదే సమయానికి నిద్రపోవడానికి అనువైన పరిస్థితులను ఏర్పరుచుకోవాలి.

  • నిద్రకు ముందు గోరు వెచ్చని నీటితో స్నానం చెయ్యడం, విశ్రాంతిగా ఉండడం, శ్రావ్యమైన సంగీతం వినడం త్వరగా నిద్ర పోవడానికి దోహదం చేస్తాయి.

  • వెలుగు, శబ్ధం వల్ల నిద్రా భంగం కలుగకుండా ఉండేందుకు గదిలోని కర్టెన్లు మూసి పెట్టుకోవడం, ఇయర్ ప్లగ్స్, ఐమాస్క్ ఉపయోగించడం మంచిది.

  • టీ, కాఫీ, ఆల్కహాల్ తీసుకోవడం, రాత్రి అతిగా భోజనం చెయ్యడం వల్ల త్వరగా నిద్రపోవడం కష్టం కావచ్చు. కనుక వీటికి దూరంగా ఉండడం మంచిది.

  • నిద్ర సమయానికి కొన్ని గంటల ముందు నుంచే వ్యాయామం చెయ్యడం ఆపెయ్యాలి. వ్యాయామం శరీరాన్ని చురుకుగా చేసి నిద్ర పట్టకపోవచ్చు.

  • పడుకునే ముందు టీవీ చూడడం, ఫోన్లు చూడడం, కంపూటర్ల ముందు గడపడం చెయ్యవద్దు. ఇవి నిద్రలేమికి నేరుగా కారణం కాగలవు.

  • నిద్రకు ముందు సమస్యలు, వాటి పరిష్కారాల గురించి ఆలోచించడం చెయ్యకూడదు. ఏది ఏమైనా తెల్లవారిన తర్వాత చూసుకుందాం అనే అనుకోవాలి. నిద్రకు కావల్సిన ప్రశాంత చిత్తంతో మంచం మీదకు చేరాలి.



Also Read: విటమిన్-D లోపంతో కండరాల నొప్పులు - ఇవి తింటే ఉపశమనం