జీర్ణక్రియ సంబంధిత సమస్యలు ఆధునిక కాలంలో పెరిగిపోతున్నాయి. చాలామంది తిన్నాక ఆహారం అరగక ఇబ్బంది పడుతున్నారు. అయితే ఈ సమస్యను చాలా తేలికగా తీసుకుంటున్నారు ఎంతోమంది. కానీ ఇలా అజీర్తి సమస్యలు పెద్ద పేగు క్యాన్సర్‌కు కారణం కావచ్చని చెబుతున్నారు వైద్య నిపుణులు. మనం తీసుకున్న ఆహారం జీర్ణ వ్యవస్థలో సరిగ్గా జీర్ణమైనప్పుడే అది శక్తి రూపంలోకి మారుతుంది. శరీరంలోని వివిధ అవయవాలకు ఆ శక్తి అందుతుంది. ఆహారం జీర్ణం కాకపోతే శరీర అవయవాలకు శక్తి అందక నీరసపడతాయి. అందుకే జీర్ణ క్రియ చాలా ముఖ్యమైనది. మనం తీసుకున్న ఆహారంలోని పోషకాలు రక్తంలోకి చేరి గుండె వంటి ప్రధాన అవయవాలను కాపాడతాయి. రక్తం నుంచే పోషకాలు శరీరంలోని ఇతర అవయవాలకు చేరుతాయి. ఎప్పుడైతే అజీర్తి సమస్యలు వచ్చాయో శక్తి, పోషకాలు రెండూ అవయవాలకు అందవు. అందుకే జీర్ణ సమస్యలను తేలిగ్గా తీసుకోకూడదు. ఎక్కువ రోజులపాటు అజీర్తి సమస్య ఉంటే వెంటనే వైద్యులను కలవడం చాలా ముఖ్యం.
అజీర్తి సమస్యలు కొన్నిసార్లు పెద్ద పేగు క్యాన్సర్ వంటి తీవ్రమైన జబ్బులకు సంకేతం కావచ్చు. అందుకే జీర్ణకోశ సంబంధిత సమస్యలను ప్రాథమిక దశలోనే గుర్తించి చికిత్స తీసుకోవాలి. అజీర్తి... పెద్ద పేగు క్యాన్సర్ వల్ల కలిగితే కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తాయి. పొట్ట కింద నొప్పిగా ఉంటుంది. మల విసర్జన సమయంలో నొప్పి వస్తుంది. రక్తస్రావం కూడా అవుతుంది. బరువు తగ్గిపోతారు. తీవ్రమైన అలసట వస్తుంది. విరేచనాలు అధికంగా అవుతాయి. పొట్ట బిగబట్టినట్టు అవుతుంది. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే జాగ్రత్తపడాలి. వెంటనే వైద్యులను సంప్రదించి తగిన మందులు చికిత్స తీసుకోవాలి.
అజీర్తి సమస్య రాకుండా ఉండాలంటే వ్యాయామం అధికంగా చేయాలి. తేలికపాటి ఆహారాన్ని తీసుకోవాలి. అధిక మసాలాలు, కారం దట్టించిన ఆహారాన్ని తినకపోవడమే మంచిది. తేలికపాటి పండ్లు, కూరగాయలు వంటివి తీసుకుంటే ఎలాంటి అజీర్తి సమస్యలు రావు. రాత్రి భోజనాన్ని ఎనిమిది గంటల్లోపే పూర్తి చేయాలి. నిద్రపోవడానికి, భోజనం తినడానికి మధ్య కనీసం గంటన్నర నుంచి రెండు గంటల గ్యాప్ ఉండడం చాలా ముఖ్యం. ఒత్తిడి పడకుండా చూసుకోవాలి. యోగా, వాకింగ్ వంటివి చేస్తూ ఉండాలి. ముఖ్యంగా తిన్న వెంటనే నిద్రపోకూడదు. నిద్రపోతే జీర్ణ వ్యవస్థ మందకొడిగా పనిచేస్తుంది. భోజనం చేశాక కనీసం గంట పాటూ మెలకువగానే ఉండాలి.
Also read: గుండెలో వేసిన స్టంట్‌లు పూడుకుపోయే ముప్పు ఉందా? పూడుకుపోతే ఏం చేస్తారు?
Also read: కోడిగుడ్లు అధికంగా తింటే వచ్చే సమస్యలు ఇవే, అందుకే రోజుకు ఎన్ని తినాలంటే
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.