రోజుకో గుడ్డు కచ్చితంగా తినమని వైద్యులు సూచిస్తూ ఉంటారు. కానీ చాలా మంది రోజుకో గుడ్డు కూడా తినరు. కొన్ని సార్లు రోజులో నాలుగైదు తినేస్తారు. ఇలా చేయడం మంచి పద్దతి కాదు. రోజుకు ఎన్ని గుడ్లు తినవచ్చు అనే దానిపై ఇప్పటికే ఎన్నో అధ్యయనాలు తేల్చి చెప్పాయి. ఒకేరోజులో ఎక్కువ గుడ్లు తినడం వల్ల ఆరోగ్యం పై చాలా ప్రభావం పడుతుంది.  రోజుకో గుడ్డు తినడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోదు. కానీ ఎక్కువ గుడ్లు తింటే మాత్రం చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోయే అవకాశం ఉంది. గుడ్డులోని పచ్చసొనలో కొలెస్ట్రాల్ అధికంగా ఉంటుంది. నిజానికి ఇది మంచి కొలెస్ట్రాల్. కానీ అధికంగా తినడం వల్ల ఈ కొలెస్ట్రాల్ మొత్తం చెడు కొలెస్ట్రాల్ గా మారి శరీరంలో పేరుకుపోతుంది. 


రోజులో ఎన్ని గుడ్లు తినాలన్న విషయంలో ఎన్నో అధ్యయనాలు జరిగాయి. పరిశోధనల ప్రకారం ఆరోగ్యకరమైన వ్యక్తి రోజుకు రెండు గుడ్లు తినవచ్చు. అలాగే వారానికి 7 నుంచి  10 గుడ్ల వరకు తినవచ్చు. అంతకుమించి తీసుకోకపోవడమే మంచిది. అయితే రోజుకు జిమ్ కు వెళ్లేవారు, వర్కవుట్లు చేసేవారు మాత్రం ప్రొటీన్ కోసం ఎక్కువ గుడ్లను తీసుకోవచ్చు. అయితే పచ్చసొన మాత్రం తక్కువగా తీసుకుంటేనే మంచిది. రోజూ  రెండుకు మించి గుడ్లు తినేవారు పచ్చసొన తినకపోవడమే మంచిది. 


కోడిగుడ్లు రోజుకు ఒకటి తినడం వల్ల శరీరానికి ఎన్నో పోషకాలు అందుతాయి. గుడ్డులో మన శరీరానికి అవసరమైన తొమ్మిది అమైనో ఆమ్లాలు ఉంటాయి. ఇవి ఇతర ఏ ఆహారంలోనూ ఉండవు. దీనిలో ఉండే ప్రొటీన్ మన శరీరానికి చాలా అవసరం. అలాగే విటమిన్ బి12, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ డి అధికంగా ఉంటాయి. గుడ్డును ప్రతిరోజూ తినడం శక్తి పెరుగుతుంది. రోగనిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది. ఎలాంటి రోగాలనైనా తట్టుకునే శక్తి శరీరానికి వస్తుంది. ఉడికించిన గుడ్డులో ఐరన్, జింక్, విటమిన్ ఇ, పొటాషియం అధికంగా ఉంటాయి. కాబట్టి గుడ్డు తినడం వల్ల గుండెకు ఎంతో మంచిది. వారానికి ఏడు గుడ్లు మించకుండా తింటే గుండె జబ్బులు వచ్చే అవకాశం తగ్గుతుంది. దీనిలో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉండే సెలీనియం మన శరీరానికి చాలా అవసరం. ఇది మన రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మెదడుకు ఆరోగ్యానికి గుడ్డు తినడం చాలా అవసరం. 



Also read: రోజులో ఎక్కువకాలం ఏసీలో ఉంటున్నారా? గుండె జాగ్రత్త



Also read: పీడకలలు వస్తుంటే తేలికగా తీసుకుంటున్నారా? వాటి ఫలితం ఇదే












గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.