ప్రాచీనకాలంలో సుగంధ ద్రవ్యాలుగా పిలుచుకున్న మన మసాలా దినుసులకు చాలా విలువ ఉండేది. ప్రపంచంలోనే అత్యంత విలువైన వాణిజ్య వస్తువులుగా ఇవి చెలామణి అయ్యాయి. ఎన్నో రాజ్యాలు కేవలం వీటి వాణిజ్యంపైనే ఆధారపడి మనుగడ సాగించాయి. ఎందుకు వీటికింత విలువ? ఆహారానికి మంచి రుచిని ఇస్తాయని మాత్రమే కాదు, వాటిలోని ఔషధ గుణాలు. తాజాగా చెన్నైలోని శ్రీరామచంద్ర యూనివర్సిటీ వారు హెర్బల్ ఇండియన్ మెడిసిన్ రీసెర్చ్ లో భాగంగా ఇండియన్ మసాలా దినుసులపై పరిశోధనలు నిర్వహించారు. అందులో ఈ మసాలా దినుసులు మానవ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని, అందులోనూ గుండెకు బలాన్ని చేకూరుస్తాయని తేలింది. అధ్యయనకర్తలు హన్నా ఆర్ వసంతి, ఆర్ పి పరమేశ్వరి అందించిన పరిశోధనా వివరాలను ఇక్కడ మేము అందిస్తున్నాం. 


రుచికి మాత్రమే కాదు..
మన పూర్వీకులు పరిచయం చేసిన ఆహారాన్ని, వంట దినుసులనే మనం ఇప్పటికీ వాడుతున్నాం. వారు మనకు పరిచయం చేసిన ప్రతి దినుసులోనూ ఏదో ఒక గొప్పదనం ఇమిడే ఉంటుంది. అల్లం, వెల్లుల్లి, దాల్చిన చెక్క, ఏలకులు, మిరియాలు, జీరా, ధనియాలు... ఇవేవీ లేకుండా మన వంటకాలు పూర్తి కావు. వీటిని కేవలం వంటలకు రుచిని ఇచ్చేవిలా మాత్రమే చూడడం మానేయాలి. వీటిలో చాలా దినుసులు గుండె జబ్బులను నిరోధించే లక్షణాలు కలవి, అలాగే రక్తపోటును కూడా నియంత్రణలో ఉంచగలవు. 


వెల్లుల్లి
బిర్యానీకో, చికెన్ కర్రీలోకో రుచి కోసం దీన్ని వేస్తారు కానీ ఎపిడెమియోలాజిక్ అధ్యయనాల ప్రకారం వెల్లుల్లి వినియోగానికి హృదయ సంబంధ వ్యాధులకు మధ్య సంబంధం ఉంది. వెల్లుల్లిలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఆహారంలో వెల్లుల్లిని ఉపయోగించడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుందని, ప్లేట్ లెట్ అగ్రిగేషన్ ను నిరోధిస్తుందని, రక్తపోటును తగ్గిస్తుందని అధ్యయనాలు తేల్చాయి. 


పసుపు
భారతీయ వంటల్లో పసుపుకు ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్ గా పనిచేస్తుంది. ఛాతీనొప్పులు, గ్యాస్ట్రిక్, కడుపునొప్పి, పంటి నొప్పి ఇలా సమస్యలకు చికిత్స చేయగల సత్తా దీనికుంది. పొట్ట, కాలేయ గాయాలను కూడా నయం చేయగలదు.  రోజువారీ ఆహారంలో పసుపు వాడడం వల్ల కేవలం నాలుగు వారాల్లో శరీరంలోని హానికర చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలు తగ్గుతాయని పరిశోధన ద్వారా తెలిసింది. 


అల్లం
ప్రాచీన కాలం నుంచి ఔషధాలలో వాడుతున్న పదార్థాలలో అల్లం ఒకటి. ఆర్థరైటిస్, రుమటిజం, బెణుకులు, కండరాల నొప్పులు, గొంతునొప్పి, తిమ్మిర్లు, మలబద్ధకం, అజీర్ణం, వాంతులు, రక్తపోటు, అంటు వ్యాధులు ఇలా ఎన్నో వ్యాధులను నయం చేయగల దమ్మున్న మసాలా దినుసు అల్లం. రోజువారీ ఆహారం తీసుకోవడం మర్చిపోవద్దు. 


మిరియాలు
యాంటీ ఆక్సిడెంట్ , యాంటీ బ్యాక్టిరియల్ గుణాలు అధికంగా గల మసాలా  దినుసు నల్ల మిరియాలు. ఇవి జీర్ణక్రియ మెరుగవ్వడంలో, బరువు తగ్గడంలో సహాయపడతాయి. ఇవి కొవ్వు కణాలను విచ్చిన్నం చేస్తాయి. దీనివల్ల బరువు పెరుగరు. మిరియాలలో ‘వనాడియం’ అధికంగా ఉంటుంది. ఇది గుండెకు రక్షణగా నిలుస్తుంది. 


ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.


Also read: రోజుకు ఓ నాలుగు వాల్నట్స్ తిన్నా చాలు... జ్ఞాపకశక్తి పెరుగుతుంది


Also read: బిస్కెట్లు, కేకులు అధికంగా తింటే... ఆ క్యాన్సర్ వచ్చే అవకాశం, తేల్చిన కొత్త అధ్యయనం



ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి