కొంచెం తియ్యగా, కొంచెం వగరుగా, మరి కొంచెం పుల్లగా ఉండే నేరేడు పండ్లు చూస్తే ఎవరికైనా నోరూరిపోతుంది కదా. వాటిని తినేందుకు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు అందరూ ఇష్టపడతారు. అయితే డయాబెటిక్ పేషెంట్స్ వీటిని తినొచ్చా అనే అనుమానం ఉంటుంది. ఎందుకంటే షుగర్ పేషెంట్స్ అన్ని రకాల పండ్లు తినకూడదు కాబట్టి. అందుకే నేరేడు పండ్లు తినేందుకు మధుమేహం ఉన్న వాళ్ళు ఒకటికి పది సార్లు ఆలోచిస్తారు. కారణం అవి తియ్యగా ఉండటమే. ఇవి తింటే ఎక్కడ షుగర్ లేవల్స్ పెరుగుతాయో అని భయపడతారు. కానీ నిజానికి మధుమేహం ఉన్న వాళ్ళు ఎటువంటి భయం లేకుండా భేషుగ్గా నేరేడు కాయలు తినవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇవి వాళ్ళకి చాలా మంచి చేస్తాయని అంటున్నారు. నేరేడు పండ్లను ఇండియన్ బ్లాక్ బెర్రీ అని కూడా పిలుస్తారు. 


నేరేడు కాయల్లో జంబోలానా అనే యాంటీ-డయాబెటిక్ పదార్ధం ఉంది. జంబోలానా మీ రక్తప్రవాహంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. ఇది మీ శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచడంలో మరియు మీ రక్తంలో గ్లూకోజ్ స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది. ఎంతో రుచికరమైన ఈ పండు వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. టైప్ 2 డయాబెటిస్ ఉన్న వాళ్ళకి ఇది అద్భుతమైన పండు. అందుకే మధుమేహ వ్యాధిగ్రస్తులు ఎటువంటి అనుమానాలు పెట్టుకోకుండా వీటిని ఆరగించవచ్చు. 


రక్తపోటును నియంత్రిస్తుంది


నేరేడు కాయల్లో పొటాషియం అధికంగా ఉన్నందున, ఇది అధిక రక్తపోటును నివారించడంలో సహాయపడుతుంది. ఇందులో తక్కువ మొత్తంలో కొవ్వు, జీరో కొలెస్ట్రాల్, అధిక మొత్తంలో నీరు మరియు మితమైన కేలరీలు ఉంటాయి.


చర్మాన్ని మెరుగుపరుస్తుంది


ఇందులో ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు మరియు విటమిన్ ఎ పుష్కలంగా ఉన్నాయి. ఇవి కంటి సమస్యలను నివారించడంలో మరియు అకాల వృద్ధాప్యాన్ని నివారించడంలో సహాయపడతాయి. ఇది మొటిమలు, మచ్చలు, ముడతలు వంటి సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది. అంతే కాదు విటమిన్ సి ఎక్కువగా ఉండటం వల్ల చర్మం ఆరోగ్యకరంగా ఉండేలా చేస్తుంది.  


బరువు తగ్గడంలో సహాయపడుతుంది


నేరేడులో తక్కువ మొత్తంలో కేలరీలు, అధిక మొత్తంలో ఫైబర్ ఉంటాయి. అందువల్ల, ఇది సంతృప్తికరంగా ఉండటానికి మరియు బరువు తగ్గడాన్ని ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. ఇది శరీరంలో నీటి నిలుపుదలని కూడా తగ్గిస్తుంది.


హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది


ఈ పండులో  హిమోగ్లోబిన్ ఉత్పత్తికి అవసరమైన ఐరన్ మరియు విటమిన్ సి పుష్కలంగా ఉన్నాయి. ఇందులో ఉండే ఐరన్ రక్తాన్ని శుద్ధి చేయడంలో సహాయపడుతుంది. మన రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి పెరగడం వల్ల శరీరంలో ఆక్సిజన్ సరఫరా పెరుగుతుంది.


చిగుళ్లను బలపరుస్తుంది


ఇండియన్ బ్లాక్‌బెర్రీ యాంటీ బాక్టీరియల్ లక్షణాలకు ప్రసిద్ధి చెందింది, ఇది చిగుళ్ల రక్తస్రావం నివారించడంలో సహాయపడుతుంది. నేరేడు చెట్టు ఆకులను ఎండబెట్టి, పొడి రూపంలో నిల్వ చేయవచ్చు. దీనితో మీ చిగుళ్లను శుభ్రం చేసుకుంటే మంచి ఫలితాలని పొందుతారు. 


గమనిక: పలు అధ్యయనాలుపరిశోధనలుహెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు. 


Also Read: కాచిన నీరు మంచిదా? ఫిల్టర్ నీరు మంచిదా? మీరు ఏది తాగుతున్నారు


Also Read: ఈ పదార్థాలు కలిపి తింటున్నారా? మీ ఆరోగ్యానికి ముప్పు తప్పదు