మాన‌వ శ‌రీరంలో దాదాపు 500 కు పైగా జీవ‌న క్రియ‌ల్లో పాలు పంచుకొనే ముఖ్య‌మైన అవ‌యవంగా లివ‌ర్‌ను చెప్ప‌వ‌చ్చు. ఈ లివ‌ర్ ప్ర‌ధానంగా జీర్ణ ప్ర‌క్రియ‌లో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఈ కాలేయానన్ి ఇబ్బంది పెట్టే కొన్ని అంశాల‌లో హెపటైటిస్ ఒకటని చెప్ప‌వ‌చ్చు. ఇది అనేక కార‌ణాల‌తో ఏర్ప‌డ‌వ‌చ్చు. ముఖ్యంగా ఇన్ ఫెక్ష‌న్లు, ఆల్క‌హాల్ వంటి దుర‌ల‌వాట్లు, కొన్ని ర‌కాల జ‌న్యుప‌ర‌మైన లోపాలు, కొన్ని ర‌కాల మందుల‌ను తీసుకోవ‌టం వంటి కార‌ణాల‌తో హెప‌టైటిస్ సంక్ర‌మించ‌వ‌చ్చు. నేడు ‘వరల్డ్ హపటైటిస్ డే’ నేపథ్యంలో  రెనోవా_ఎన్.ఐ.జి.ఎల్. హాస్పిటల్స్ (బంజారాహిల్స్)కు చెందిన స‌ర్జిక‌ల్ గ్యాస్ట్రో ఎంట‌రాల‌జిస్టు అండ్ లివ‌ర్ ట్రాన్స్ ప్లాంటేషన్ స‌ర్జ‌న్, డాక్ట‌ర్ ఆర్ వి రాఘ‌వేంద్ర‌రావు గారు చెప్పిన ఈ సూచనలు తప్పక పాటించండి. 


హెప‌టైటిస్ మీద అవ‌గాహ‌న క‌ల్పించేందుకు ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (డ‌బ్ల్యూ హెచ్ వో ) న‌డుం క‌ట్టింది. ప్ర‌తీ ఏటా జూలై నెల 28వ తేదీని ప్ర‌పంచ ‘హెప‌టైటిస్ డే’గా పాటిస్తున్నారు. ఇందులో భాగంగా ఏటా ఒక థీమ్‌ను తీసుకొని ప్రాచుర్యం క‌ల్పిస్తుంటారు. ఈ ఏడాది (2022)కి స‌మాజం నుంచి హెప‌టైటిస్‌ను నిర్మూలించడం అనే త‌క్ష‌ణ ఆవ‌శ్య‌క‌త‌ను ఈ ఏడాది థీమ్ సూచిస్తుంది.


ప్రపంచ ఆరోగ్య సంస్థ (డ‌బ్ల్యూ హెచ్ వో ) గణాంకాల ప్రకారం వైరల్ హెపటైటిస్‌తో జీవిస్తున్న దాదాపు 90% మందికి అది సోకినట్లు తెలియదు. హెపటైటిస్ బి, సి కారణంగా ప్రతి రోజూ దాదాపుగా 3000 మంది మరణిస్తున్నారు. ప్రతి 30 సెకన్లకు ఒకరు హెపటైటిస్ బి లేదా సితో ప్రాణాలు కోల్పోతున్నారు. 


ప్రాథ‌మికంగా హెప‌టైటిస్ అన్న‌ది ఒక వైర‌స్ వ‌ల్ల వచ్చే లివ‌ర్ సమస్య. ఈ వైర‌స్‌లో ఐదు ర‌కాలు క‌నిపిస్తాయి. వీటిని  ఏ, బి, సి, డి, ఇ అనే ర‌కాలుగా చెప్ప‌వ‌చ్చు.  ఇవి ఎక్కువ‌గా ఒక‌రి నుంచి ఒక‌రికి వ్యాపిస్తుంటాయి. మాన‌వ శ‌రీరంలోకి ప్ర‌వేశించాక క్ర‌మంగా లివ‌ర్ ను చేరుకొని అక్క‌డ ఇబ్బంది పెట్టేందుకు ప్ర‌య‌త్నిస్తాయి. శ‌రీరంలోని అనేక ముఖ్య విధుల్లో పాలు పంచుకొనే లివ‌ర్‌లో ఈ ఇన్ఫెక్షన్ చేర‌టం వ‌ల్ల అనేక ర‌కాల స‌మస్య‌లు వస్తాయి. 


ఈ  హెప‌టైటిస్‌లలో హెప‌టైటిస్ ఏ, హెప‌టైటిస్ ఇ అనేవి ఒక‌రి నుంచి ఒక‌రికి క‌లుషిత నీరు, క‌లుషిత ఆహారం ద్వారా సంక్ర‌మిస్తుంటాయి. సాధార‌ణంగా ఇటువంటి హెప‌టైటిస్ ఇబ్బందులు ఉంటే కొన్ని ర‌కాల ల‌క్షణాలు క‌నిపిస్తుంటాయి. ఒళ్లు నొప్పులు, తేలికపాటి జ్వ‌రం, త‌ల‌నొప్పి, శ‌రీర బ‌ల‌హీన‌త వంటి ల‌క్ష‌ణాలు కనిపిస్తాయి. ఆ త‌ర్వాత 2,3 రోజుల్లో ప‌చ్చ కామెర్లు బ‌య‌ట ప‌డతాయి. ఇది హెప‌టైటిస్ వైర‌స్ మూలంగా లివ‌ర్ క‌ణ‌జాలం దెబ్బ‌తిన‌టం వ‌ల్ల సంభ‌వించే ప‌రిణామం అన్న మాట‌. ఇక‌, ఈ వైర‌స్ ను గుర్తించ‌టం, నిర్ధారించ‌టం, చికిత్స వంటి అంశాల‌ను తెలుసుకుందాం. చాలా సంద‌ర్బాల్లో సుల‌భ‌మైన ఎల్ ఎఫ్ టీ వంటి ర‌క్త ప‌రీక్షల ద్వారా, సీర‌లాజిక‌ల్ ప‌రీక్ష‌ల ద్వారా ఈ  దీన్ని గుర్తించ‌వ‌చ్చు.


చాలా సంద‌ర్బాల్లో ఈ స‌మ‌స్య‌... శ‌రీరంలోని రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ ద్వారానే అదుపులోకి వ‌స్తుంది. కొన్ని అరుదైన సంద‌ర్భాలు లేదా ఇమ్యునిటీ తక్కువ‌గా ఉన్న సంద‌ర్భాల్లో మాత్రం ఈ హెప‌టైటిస్ ఏ, హెప‌టైటిస్ ఇ వైర‌స్‌ల కార‌ణంగా లివ‌ర్‌కు తీవ్ర‌మైన ఇబ్బందులు ఏర్ప‌డ‌వ‌చ్చు. దీనిని ఫ‌ల్మ‌నెంట్ హెప‌టైటిస్ అని పిలుస్తారు. ఇటువంటి సంద‌ర్భాల్లో రోగిని ఆసుప‌త్రిలో చేర్చ‌టం, ఐసీయూలో చికిత్స చేయించ‌టం వంటివి చేప‌ట్టాల్సి రావ‌చ్చు.


రెండో ర‌కం అయిన హెపటైటిస్ బి, హెప‌టైటిస్ సి ర‌కాల‌ను ప్ర‌మాద‌క‌ర‌మైన‌విగా  చెప్ప‌వ‌చ్చును. సాధార‌ణంగా శ‌రీర ద్ర‌వాల మూలంగా (లాలాజ‌లం, ర‌క్తం వంటివి) ఒక‌రి నుంచి మ‌రొకరికి సంక్ర‌మిస్తుంటాయి. అదే విధంగా ఇన్ ఫెక్టెడ్ సిరంజీలు, నీడిల్స్ వంటివాటి ద్వారా ఇవి ఒక‌రి నుంచి మ‌రొక‌రికి సంక్ర‌మించే అవ‌కాశం  ఉన్న‌ది.


చాలా మందిలో ఈ వైర‌స్ వ్యాపించిన త‌ర్వాత ఎటువంటి రోగ ల‌క్ష‌ణాలు బ‌య‌ట ప‌డ‌క పోవ‌చ్చు. కొంద‌రిలో మాత్రం తీవ్ర‌మైన క‌డుపు నొప్పి, ప‌చ్చ కామెర్లు ఏర్ప‌డ‌టం వంటివి జ‌ర‌గ వ‌చ్చును. అయితే ఎటువంటి వ్యాధికార‌క ల‌క్ష‌ణాలు లేక‌పోయిన‌ప్ప‌టికీ హెప‌టైటిస్ బి, హెప‌టైటిస్ సి ఇన్ ఫెక్ష‌న్ లు మొద‌లైన‌ట్ల‌యితే.. లివ‌ర్ లోని  క‌ణ‌జాలాన్ని క్ర‌మంగా శిథిల ప‌రుస్తాయి. ఫ‌లితంగా లివ‌ర్ లో తీవ్ర‌మైన ఇబ్బందుల‌కు దారి తీయ‌వ‌చ్చును. ఇది క్ర‌మంగా లివ‌ర్ సిర్రోసిస్ ( అంటే లివ‌ర్ లోని కొంత క‌ణ‌జాలం నిర్జీవ స్థితికి చేరిపోయి స‌మ‌స్య‌లు తెచ్చిపెట్ట‌డం) కు దారి తీస్తుంది. ఈ ప‌రిస్థితిని బ‌రువు త‌గ్గ‌టం, ప‌చ్చ‌కామెర్లు ఏర్ప‌డ‌టం, క‌డుపులో నీరు చేర‌టం, ర‌క్త‌పు వాంతులు వంటి విప‌రీత ల‌క్ష‌ణాల‌తో అనుమానించ‌వ‌చ్చు.


ఇటువంటి  సంద‌ర్బాల్లో డీఎన్ఎ లేదా ఆర్ఎన్ఎ ర‌క్త ప‌రీక్ష‌లు చేయించ‌టం, అదే విధంగా లివ‌ర్ లోపాల వ‌ల్ల జ‌రిగే ఇబ్బందిని గుర్తించేందుకు అల్ట్రా సౌండ్  స్కానింగ్ ప‌రీక్ష‌లు, సీటీ స్కాన్ ప‌రీక్ష‌లు అవ‌స‌రం అవుతాయి. ఈ వైర‌స్ ల‌ను స‌కాలంలో గుర్తించ‌గ‌లిగిన‌ట్ల‌యితే మందులతోనే నియంత్రించ‌టం సాధ్యం అవుతుంది. త‌ద్వారా ఇత‌ర అనర్థాలు రాకుండా  జాగ్ర‌త్త‌లు  ప‌డ‌వ‌చ్చు.


లివర్ క్యాన్సర్?
హెప‌టైటిస్ ఇన్ఫెక్షన్ల వ‌ల్ల క‌లిగే మ‌రో ప్ర‌మాద‌క‌ర ప‌రిస్థితి లివ‌ర్ క్యాన్స‌ర్.  లివర్ లో అవాంఛిత క‌ణ‌జాలం పేరుకొని పోయి క‌ణితులుగా మార‌తాయి.  సాధార‌ణ కాలేయ క్యాన్స‌ర్ ను హెప‌టో సెల్యులార్ క్యాన్స‌ర్ అంటారు. ఇది ప్ర‌ధానంగా దీర్ఘ‌కాలికంగా ఆల్క‌హాల్ తీసుకొనే వారిలో ఏర్ప‌డుతుంది. హెప‌టైటిస్ బి, హెప‌టైటిస్ సి ఇన్ఫెక్షన్‌తో ఏర్ప‌డ‌వ‌చ్చు.


కడుపు పైభాగంలో నొప్పి తో పాటు బరువు తగ్గటం వంటి లక్షణాలతో గమనించవచ్చు. పసిరికలు, నీళ్ల విరేచనాలు వంటివి కూడా కనిపిస్తుంటాయి. . ప్రాథమికంగా రక్తపరీక్ష (ఎ ఎఫ్ బి), అల్ట్రా సౌండ్ పరీక్షలతో గుర్తించవచ్చు. అవసరాన్ని బట్టి సీటీ స్కాన్, ఎండోస్కోపీ, బయాప్సీ పరీక్షలు చేయించాల్సి ఉంటుంది. క్యాన్సర్ ను తొలిదశలో గుర్తించినప్పుడు క్యాన్సర్ సోకిన కణజాలాన్ని గుర్తించి, ఆపరేషన్ ద్వారా ఆ భాగాన్ని మొత్తంగా తొలగించటం మేలు.  ఈ ఆపరేషన్ చేయలేని పరిస్థితులు లేదా పేషంట్ ఆపరేషన్ తీవ్రతను తట్టుకోలేని పరిస్థితుల్లో ... ప్రత్యేక విధానాలు అయిన టేస్ మరియు అబ్లేషన్ విధానాలు అవలంబించాల్సి ఉంటుంది. 


వీటిలో మైక్రో వేవ్ అబ్లేషన్ అన్నది చాలా మెరుగైన చికిత్స విధానం అనుకోవచ్చు. క్యాన్స‌ర్ మొద‌టి ద‌శ‌ల్లో చ‌క్క‌టి చికిత్స విధానాల‌తో రోగిని కాపాడ‌వ‌చ్చు. ఒక వేళ వ్యాధి బాగా ముదిరిపోయిన‌ప్ప‌టికీ, అధునాత‌న మార్గాల‌ను అవ‌లంబించ‌టం ద్వారా నాణ్య‌మైన శేష జీవితాన్ని అందించేందుకు వీల‌వుతుంది. తీవ్ర‌మైన హెప‌టైటిస్ రోగుల‌లో అవ‌స‌రాన్ని బ‌ట్టి లివ‌ర్ ట్రాన్స్ ప్లాంటేష‌న్ చేయాల్సి వ‌స్తుంది.


అవగాహన ముఖ్యం:
ఇటువంటి స‌మ‌స్య‌లు త‌లెత్తిన‌ప్పుడు నిర్ల‌క్ష్యం చేయ‌కుండా చికిత్స‌లు తీసుకోవ‌టం అవ‌స‌రం. మందుల‌తో లేదంటే స‌ర్జిక‌ల్ విధానాల‌తో చికిత్స‌లు అందించేందుకు అవ‌కాశం ఉంటుంది. ఆధునిక టెక్నాల‌జీ తో కూడిన వ‌స‌తులు, నిపుణలైన వైద్యుల‌ను క‌లిగిన ఆస్ప‌త్రుల‌ను సంప్ర‌దించ‌టం మేలు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌లో ఎంత త్వ‌ర‌గా స‌మ‌స్య‌ను గుర్తిస్తే అంత త్వ‌ర‌గా చికిత్స‌లు ప్రారంభం అవుతాయి. నిపుణులైన డాక్ట‌ర్ల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో అధునాత‌న విధానాలు అవ‌లంబిస్తే హెప‌టైటిస్ మ‌హ‌మ్మారిని త‌రిమికొట్ట‌డం పెద్ద క‌ష్ట‌మేమీ కాదు.


సాధ్య‌మైనంత  వ‌ర‌కు  హెప‌టైటిస్  వైర‌స్ రాకుండా జాగ్ర‌త్త ప‌డ‌టం మేలు. వ్య‌క్తిగ‌త శుభ్ర‌త పాటించ‌టం, క‌లుషిత నీటికి, క‌లుషిత ఆహారానికి దూరంగా ఉండ‌టంీతో  రక్ష‌ణ పొంద‌వ‌చ్చు. కాచి చ‌ల్లార్చిన నీటిని తాగ‌టం ఉత్త‌మ మార్గం. ర‌క్త మార్పిడి వంటి చోట్ల జాగ్ర‌త్త తీసుకోవ‌టం అవ‌స‌రం.  హెప‌టైటిస్ బి వంటి  వైర‌స్ ల నుంచి ర‌క్ష‌ణ పొందేందుకు టీకాలు ల‌భిస్తున్నాయి. కాబట్టి, ఈ వ్యాధిపై ప్రతి ఒక్కరికి అవగాహన అవసరం. 


Also Read: ఈ వయస్సు వచ్చాక మగాళ్ల లైంగిక శక్తి మటాష్, ఇలా చేస్తే సేఫ్!


Also Read: ఎలోన్ మస్క్ తండ్రి వీర్యానికి అంత డిమాండా? 76 ఏళ్ల వయస్సులోనూ అదేపని!