UK PM Race: 


షో మధ్యలోనే ఆపేస్తున్నాం..


యూకే ప్రధాని రేసులో చివరికి భారత సంతతి వ్యక్తి రిషి సునక్, లిజ్ ట్రస్ మిగిలారు. చివరి రౌండ్‌ వరకూ రిషి సునక్‌ లీడ్‌లోనే ఉన్నా..ఆ తరవాతే ఉన్నట్టుండి లిజ్ ట్రస్ ఆధిక్యంలోకి వచ్చారు. కచ్చితంగా ఆమే ప్రధాని అవుతారని అందరూ అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ టీవీ షోలో డిబేట్‌లో పాల్గొన్నారు వీరిద్దరూ. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు తన వద్ద కొన్ని ప్రణాళికలున్నాయని లిజ్ ట్రస్ వివరిస్తుండగా ఓ షాకింగ్ సంఘటన జరిగింది. ఈ ప్రోగ్రామ్‌లో హోస్ట్‌గా వ్యవహరిస్తున్న యాంకర్ ఉన్నట్టుండి కుప్ప కూలిపోయింది. ఇది చూసి ఎంతో కంగారు పడ్డారు లిజ్ ట్రస్. ఆమె పడిపోయినప్పుడు పెద్ద శబ్దం వచ్చింది. ఇది విని షాక్‌కు గురయ్యారు లిజ్ ట్రస్. యాంకర్ కింద పడిపోయిన వెంటనే రిషి సునక్ వేగంగా ఆమె వద్దకు వెళ్లారు. ఆమెను పైకి లేపేందుకు ప్రయత్నించారు. తరవాత లిజ్ ట్రస్ కూడా వచ్చి ఆమె ఆరోగ్యాన్ని పరీక్షించారు. "ప్రస్తుతానికి యాంకర్ ఆరోగ్యంగానే ఉన్నారు. అయినా వైద్యులు ఆమెకు విశ్రాంతి అవసరమని చెప్పారు. అందుకే డిబేట్‌ను మధ్యలోనే ఆపేస్తున్నాం" అని టాక్‌ టీవీ వెల్లడించింది. దాదాపు అరగంట చర్చ తరవాత యాంకర్ ఇలా అనారోగ్యానికి గురయ్యారు. ఈ చర్చలో పన్నుల గురించి ప్రధానంగా ప్రస్తావించారు రిషి సునక్, లిజ్ ట్రస్.





 


లీడ్‌లో ఉన్న లిజ్ ట్రస్ 


బ్రిటన్ ప్రధాని రేసులో భారత సంతతికి చెందిన రిషి సునక్ కాస్త వెనకబడ్డారు. రిషి సునక్‌తో పోల్చుకుంటే ప్రత్యర్థి లిజ్ ట్రస్‌ 28 పాయింట్ల లీడ్‌లో ఉన్నట్టు యూగవ్ సర్వే వెల్లడించింది. కన్జర్వేటివ్ పార్టీ సభ్యులు రిషి సునక్‌, లిజ్ ట్రస్‌కు ఓటు వేయటం వల్ల చివరి రౌండ్‌లో వీరిద్దరే మిగిలారు. వీరిలో ఎవరికి మద్దతు ఎక్కువగా వస్తే, వారే ప్రధాని పదవిని చేపడతారు. అయితే ఇది కన్జర్వేటివ్ పార్టీ సభ్యుల నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ఆగష్టు 4 వ తేదీ నుంచి బ్యాలెట్ పద్ధతిలో ఈ నియామకానికి సంబంధించిన ఓటింగ్ ప్రక్రియ మొదల వుతుంది. సెప్టెంబర్‌లోగా  ఎవరు ప్రధాని అన్నది తేలిపోతుంది. బ్రిటీష్ ఇంటర్నేషనల్ ఇంటర్నెట్ బేస్డ్‌ మార్కెట్ రీసెర్చ్ సంస్థ అయిన యూగవ్‌ రిపోర్ట్‌లో మాత్రం రిషి సునక్ కాస్త వెనకబడినట్టు తెలుస్తోంది. 19 పాయింట్ల తేడాతో ట్రస్, రిషి సునక్‌ను అధిగమిస్తారని గత వారమే అంచనాలు వచ్చాయి. ఈ సర్వే ప్రకారం...730 మంది కన్జర్వేటరీ పార్టీ సభ్యుల్లో 62% మంది తాము ట్రస్‌కు ఓటు వేసినట్టు చెప్పగా, 38% మంది మాత్రమే రిషి సునక్‌కు ఓటు వేసినట్టు వెల్లడించారు. ఇలా చూసుకుంటే 24% మేర ట్రస్‌ లీడ్‌లో ఉన్నట్టే.